ఇక్కడ క్షేమం లేదు
అధ్వానంగా సంక్షేమ హాస్టళ్లు
మౌలిక వసతుల కరువు
శిథిలావస్థలో భవనాలు
విద్యార్థులకు అందని దుప్పట్లు, దుస్తులు
జ్వరమొచ్చినా పట్టించుకునే వారుండరు
సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్నారు. కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన తిండి లేక... రోగ మొస్తే పట్టించుకునే వారు లేక అనారోగ్యం బారిన పడుతున్నారు. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ ఎదురయ్యే సమస్యలను మౌనంగా భరిస్తూనే ఉన్నారు. వీరి దుస్థితిపై ‘సాక్షి’ ఫోకస్...
- సాక్షి, సిటీబ్యూరో
పిల్లి కూనల్లా చలికి వణుకుతూ ఒకరిపై ఒకరు... ఒకే దుప్పట్లో నలుగురైదుగురు విద్యార్థులు సర్దుకొని పడుకోవడం... పగిలిన కిటికీలు...తలుపుల సందుల్లోంచి ఇబ్బంది పెట్టే చలిగాలిని తట్టుకోలేక.... ఎప్పుడు తెల్లవారుతుందా అని రాత్రంతా నిద్ర లేకుండా గడపడం... స్నానాలకు గంటల తరబడి క్యూలో వేచి ఉండడం...ఇవేవో రైల్వే స్టేషన్‌లోనో...బస్సు కాంప్లెక్స్‌లలోనో కనిపించే దృశ్యాలు కాదు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్న సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థుల కష్టాలు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంక్షేమ హాస్టళ్లు 161 ఉన్నాయి. ఇందులో బాలుర 117, బాలికలవి 44 ఉన్నాయి. వీటిలో 15,652 మంది చదువుతున్నారు. హైదరాబాద్ జిల్లాలోని 36 హాస్టళ్లలో 2,702 మంది చదువుతుండగా... రంగారెడ్డి జిల్లాలోని 125 హాస్టళ్లలో 12,950 మంది ఉన్నారు. ఈ విద్యార్థులకు ఏడాదికి నాలుగు జతల దుస్తులు (రెండు స్కూల్, రెండు జనరల్ డ్రెస్సులు) ఇవ్వాల్సి ఉండగా... కొన్ని హాస్టళ్లకు మాత్రమే సరఫరా చేశారు. పాఠశాలలు తెరచి ఆరు నెలలు దాటుతున్నా ఇంతవరకూ దుస్తులు అందలేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చిన్నారులు చలిలో వణుకుతున్నా అనేక చోట్ల ఇంకా దుప్పట్లు అందలేదు. ఒకటి, రెండు చోట్ల ఇచ్చినా నాణ్యత లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లకు ఒకసారి ప్లేట్లు, గ్లాసులు ఇవ్వాలన్న సంగతి అధికారులు మరచిపోయినట్లున్నారు. మంచినీరు, స్నానపు గదులు, మరుగుదొడ్ల వంటి మౌలిక వసతుల సంగతి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంతమంచిది. ఇక జంట జిల్లాల్లోని 83 కాలేజీ హాస్టళ్లలో 8,200 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 46 బాలురు, 37 బాలికలవి ఉన్నాయి. అధిక సంఖ్యలో హాస్టళ్లు అద్దె భవనాల్లోనే ఉండడంతో విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు.