నిబంధనలకు నీళ్లు
– ప్రైవేటు విద్యాసంస్థల్లో కరువైన సదుపాయాలు
– తరచూ ప్రమాదాల బారిన పడుతున్న విద్యార్థులు
హిందూపురం టౌన్ : తాగునీటి సౌకర్యం ఉండదు.. ఆటస్థలం ఉండదు.. మరుగుదొడ్డి ఉండదు.. అర్హత ఉన్న ఉపాధ్యాయులు ఉండరు.. ఇలా ఏ సౌకర్యం లేకున్నా విద్యాశాఖ అధికారులు నిబంధనలకు నీళ్లు వదిలి పాఠశాల, కళాశాలలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. పాఠశాల లేదా కళాశాలకు అనుమతి ఇవ్వాలంటే ఎన్నో నిబంధనలు ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క నిబంధన పాటించకపోయినా విద్యాశాఖ వారు అనుమతి ఇస్తూ విద్యార్థుల ప్రమాదాలకు కారణమవుతున్నారు.
అన్ని దానాల్లో విద్యాదానం గొప్పదని చెబుతున్నారు. కానీ కొంతమంది ప్రైవేటు, కార్పొరేటు శక్తులు విద్యాశాఖ అధికారులను మామూళ్ల మత్తులో ముంచి అనుమతులు పొందుతున్నార నే ఆరోపణలు లేకపోలేదు. రూ.వేల ఫీజులు దండుకుంటూ తమ విద్యాసంస్థల్లోనే పుస్తకాలు, యూనిఫాం కొనాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. వారి పిల్లల జీవితాల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు విధిలేక చెల్లిస్తున్నారు. పట్టణంలో మూడు కార్పొరేటు పాఠశాలలు, ఒక కార్పొరేటు కళాశాల, సుమారు 10 ప్రైవేటు కళాశాలలు, 52 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 50 శాతం విద్యాసంస్థలకు కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేవు. అయినా విద్యాశాఖ అధికారులు మాత్రం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి– చంద్రశేఖర్‌రెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి
పట్టణంలో నిబంధనలు అతిక్రమిస్తున్న విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. విద్యాసంస్థల నిర్లక్ష్యంతో విద్యార్థులు ప్రమాదాలకు గురవుతున్నారు. అయినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.