సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వారసత్వ హోదా అందినట్లే అంది చేజారింది. నిర్మాణ చాతుర్యం, వైశిష్ట్యం పరంగా ప్రత్యేకత చాటుకుంటున్న రామప్ప దేవాలయం యునెస్కో జాబితాలోకి చేరినట్టే చేరి దారితప్పినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన కట్టడం లేదన్న లోటును రామప్ప తీరుస్తుందని ఆశించినా.. ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం మాత్రం భిన్నంగా ఉంది. యునెస్కో గుర్తింపు కోసం ప్రతిపాదించిన రామప్ప దరఖాస్తును కేంద్రం బుట్టదాఖలు చేసిందని, దాని స్థానంలో జైపూర్ ప్రతిపాదనను పంపిందని సమాచారం. గతంలో చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ సమాధు లతో కలిపిన ప్రతిపాదన, ఆ తర్వాత వేయిస్తంభాల గుడి ప్రతిపాదనలు తిరస్కరణకు గురవడంతో ఈసారి పక్కాగా దరఖాస్తు చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. రామప్ప దేవాలయాన్ని ఎంపిక చేసి ప్రతిపాదించింది. కానీ అది యునెస్కో తలుపు తట్టకుండానే తిరుగుటపాలో వచ్చినట్లు తెలుస్తోంది. దాన్ని ఢిల్లీ స్థాయిలో స్క్రూటినీ కమిటీనే తిరస్కరించినట్లు్ల సమాచారం.
రెండు సార్లు తయారు చేసినా..
గత చేదు అనుభవాల దృష్ట్యా ఈసారి కొంత పక్కాగానే ప్రభుత్వం వ్యవహరించింది. ప్రభుత్వ సలహాదారు పాపారావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రామప్ప ప్రతిపాదనకు కార్యరూపం ఇచ్చారు. కానీ ఆలయ ప్రతిపాదన (డోషియర్) రూపకల్పనలో పక్కాగా వ్యవహరించకపోవడమే తిరస్కరణకు కారణమని తెలుస్తోంది. కేవలం రామప్ప ఆలయ నిర్మాణ కౌశలంపైనే దృష్టి సారించి వివరాలు సేకరించిన నిపుణులు.. ఆ కోణంలోనే దాన్ని ప్రతిపాదించారని, యునెస్కోకు పంపాల్సిన పద్ధతిలో ప్రతిపాదన లేదని ఢిల్లీ స్క్రూటినీ కమిటీ అభిప్రాయ పడినట్లు తెలిసింది. కట్టడానికి సంబంధించిన కొన్ని వివరాలూ తప్పుగా పేర్కొన్నట్లు కమిటీ గుర్తించిందని తెలుస్తోంది. కొన్ని శిల్పాలకు సంబంధించి కుడి వైపు వివరాలను ఎడమవైపు, ఎడమ వైపు వివరాలు కుడివైపు ఉన్నట్లు తప్పుగా నమోదు చేసిన విషయాన్నీ కమిటీ గుర్తించినట్లు సమాచారం.
రాష్ట్రానికి సమాచారం లేదు..
జైపూర్ ప్రతిపాదనను కేంద్రం వారం క్రితం యునెస్కోకు పంపి రామప్పను పెండింగులో పెట్టిందని ఢిల్లీ సమాచారం. కానీ దీనిపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందలేదు. యునెస్కో గుర్తింపు కోసం రాష్ట్రాల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఈ వార్త ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ప్రపం చ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న రాజస్తాన్ ఈ విషయంలో గట్టి లాబీ చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో బాగా వెనుకబడిన తెలంగాణ, యునెస్కో గుర్తింపు పొందే విషయంలోనూ మంచి అవకాశం చేజార్చుకున్నట్లయింది. యునెస్కో ప్రతిపాదనలు రూపొందించటంలో అనుభవం ఉన్నవారి మార్గదర్శనంలో కొత్త ప్రతిపాదన రూపొందిస్తే భవిష్యత్‌లోనైనా రామప్పకు గుర్తింపు తథ్యమన్న విషయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. చిన్న పొరపాట్లు కూడా లేకుండా డోషియర్ రూపొందించాలని సూచిస్తున్నారు.
కనీస వసతులూ లేవు..!
ప్రపంచ వారసత్వ హోదా పొందే కట్టడం వద్ద పర్యాటకులకు కనీస వసతులు అవసరం. కానీ రామప్ప ఆలయానికి ఇప్పటికీ సరైన రహదారి లేదు. అక్కడ పర్యాటకులకు మంచి భోజనం లభించే వసతి లేదు. మంచి నీరు, టాయిలెట్లకూ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. కనీస వసతులు కల్పించి దరఖాస్తు చేసి ఉండాల్సిందని, దాన్ని కూడా పట్టించుకోకపోవడాన్ని కమిటీ తప్పుబట్టిందని తెలుస్తోంది. వరంగల్‌లోని వేయిస్తంభాల దేవాలయాన్ని రుద్రేశ్వరాలయంగా పిలుస్తారు. రామప్ప దేవాలయాన్ని రామలింగేశ్వరాలయంగా పేర్కొంటారు. కానీ యునెస్కో ప్రతిపాదనలో దాన్ని రుద్రేశ్వరాలయంగా పేర్కొన్నట్లు తెలిసింది. దీన్ని కూడా కమిటీ గుర్తించిందని చెబుతున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని దాన్ని పక్కన పెట్టిందని సమాచారం. ఇదే కేటగిరీలో పోటీ పడిన రాజస్తాన్ రాజధాని నగరం జైపూర్ ప్రతిపాదనకు కమిటీ జై కొట్టిందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment