తెలుగు జాతికిది సంతోష సందర్భం. తెలుగు ఖ్యాతికిది విశ్వవిఖ్యాత సంబరం. కొన్నేళ్ళ ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. ఎనిమిదొందల ఏళ్ళ నాటి కాకతీయుల శిల్పకళావైభవ ప్రతీక రామప్ప దేవాలయం ‘ప్రపంచ వారసత్వ కట్టడం’గా గుర్తింపు తెచ్చుకుంది. గర్వంతో తెలుగు వారి ఛాతీ ఉప్పొంగేలా చేసింది. ఎన్నో చారిత్రక కట్టడాలకు నిలయమైన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ప్రపంచ పట్టం సాధించిన తొలి నిర్మాణంగా రామప్ప కొత్త చరిత్ర సృష్టించింది.
హైదరాబాద్‌కు 220 కిలోమీటర్ల దూరంలో, తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప గుడికి ఈ విశ్వవిఖ్యాత పట్టం రావడానికి వారసత్వ ప్రియుల మొదలు ప్రభుత్వాల దాకా ఎందరో కృషి చేశారు. పురాస్మరణకూ, పర్యాటకం పుంజు కోవడానికీ తోడ్పడే ఈ విశ్వఘనత అనేక రకాల ప్రత్యేకమైనది. విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక రంగాలలో అంతర్జాతీయ సహకారంతో శాంతి, భద్రతలను ప్రోత్సహించేందుకు ఐక్యరాజ్యసమితి పెట్టిన ప్రత్యేక సంస్థ ‘యునెస్కో’. ఆ సంస్థ నుంచి 1972లో ఓ అంతర్జాతీయ ఒప్పందంగా వార సత్వ కట్టడాల గుర్తింపు ప్రారంభమైంది. 1977లో మన దేశం ఆ ఒప్పందంలో భాగమైంది. 1983లో మన దేశం నుంచి తొలిసారిగా అజంతా, ఎల్లోరా గుహలు, ఆగ్రా కోట, తాజ్‌మహల్ వారసత్వ కట్టడాలుగా గుర్తింపు పొందాయి. అప్పటి నుంచి దేశంలోని ఖజురహో శిల్పాలు, కోణార్క్ ఆలయం, మహాబలిపురం, హంపీ నిర్మాణాలు, ఎర్రకోట, ఖజిరంగా జాతీయ పార్క్ తదితర 38 సాంస్కృతిక నిర్మాణాలు, సహజ అభయారణ్యాలు ‘యునెస్కో’ గుర్తింపు పొందాయి. ఇప్పుడు ఆ వరుసలో 39వదిగా మన రామప్ప ఆ జాబితాకు ఎక్కింది. ఇప్పటికి ఇలా మొత్తం 167 దేశాల్లోని 1130 నిర్మాణాలు ఈ ప్రత్యేక గుర్తింపు సాధించాయి.
రామప్ప గుడి కట్టి 800 ఏళ్ళు పూర్తయినప్పటి నుంచి ఈ గుర్తింపు కోసం మన ప్రభుత్వాలు కృషి చేస్తూ వచ్చాయి. 2014 ఏప్రిల్‌లో ప్రయత్నించి, విఫలమయ్యాం. అప్పటి నుంచి యునెస్కో తాత్కాలిక జాబితాలో మటుకు కొనసాగుతూ, గుర్తింపు కోసం రామప్ప గుడి నిరీక్షించాల్సి వచ్చింది. 2019 సెప్టెంబర్‌లో అక్కడి అధికారులొచ్చి, మన శిల్పకళా సౌందర్యాన్ని చూసి వెళ్ళారు. దరఖాస్తు లోని లోటుపాట్ల సవరణ, నృత్య శిఖామణుల వివరణతో మన వాదనకు బలం చేకూరింది. ఇంతలో కరోనా కారణంగా గత ఏడాది సమావేశం వాయిదా పడింది. చివరకు చైనాలోని ఫ్యూజు వేదికగా యునెస్కో 44వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశం వర్చ్యువల్‌గా జరిగినప్పుడు ఈ ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటలు దాటాక తీపి కబురందింది. మొత్తం 21 సభ్యదేశాలలో నార్వే అభ్యంతరం చెప్పింది. కానీ, మన ప్రభుత్వ దౌత్యం ఫలించి, రష్యా చొరవతో 17పైగా సభ్య దేశాలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. అలా రామప్పకు విశ్వవిఖ్యాతి దక్కింది. పది వేర్వేరు అంశాలను బట్టి ఈ గుర్తింపు ఈసారి రామప్పతో పాటు చైనా, ఇరాన్, స్పెయిన్‌లలోని కట్టడాలకూ లభించింది.
‘విలక్షణ శైలి... సూక్ష్మరంధ్రాలుండి నీటిలో తేలే తేలికైన ఇటుకలతో కట్టిన ఆలయ విమానం... కాకతీయ సంస్కృతినీ, నృత్య సంప్రదాయాలనూ ప్రతిఫలించే అద్భుత ఆలయ శిల్పాలు...’ అంటూ యునెస్కో ఈ ప్రాచీన ఆలయ నిర్మాణ విశేషాలను వేనోళ్ళ పొగడడం విశేషం. రామప్పగా పేరుపడ్డ శివాలయమైన రుద్రేశ్వరాలయం కాకతీయ శిల్పకళా విశిష్టతకు మకుటాయ మానం. విశాల కాకతీయ సామ్రాజ్యంలో గణపతిదేవుని పాలనలో, సేనాని రేచర్ల రుద్రుడు నిర్మిం చిన ఈ ఆలయ సముదాయానిది పెద్ద కథ. క్రీ.శ. 1213లో నిర్మాణమైన ఈ గుడిలో ఎన్నెన్నో విశే షాలు. ఇది భక్తులకు గుడి. నల్లని రాళ్ళపై చెక్కిన అపురూపమైన స్త్రీమూర్తులతో కళాప్రియులకు అద్భుత శిల్పసౌందర్యశాల. ‘శాండ్ బాక్స్ టెక్నాలజీ’లో ఇసుక మీద పేర్చిన రాళ్ళతో నిర్మాణ నిపుణులకు అపూర్వ ఇంజనీరింగ్ అద్భుతం. వెరసి, రాశిగా పోసిన విశేషాల కుప్ప– రామప్ప. దాదాపు 40 ఏళ్ళు ఈ నిర్మాణం కోసం శ్రమించిన శిల్పి రామప్ప పేరు మీదే ఎనిమిదొందల ఏళ్ళ నాటి ఈ గుడికి ఆ పేరొచ్చిందని కథ. ఆ తరువాత కట్టిన వాటెన్నిటికో గుర్తింపు దక్కినా, ఇప్పటి దాకా ఆ భాగ్యం రామప్పకు దక్కకపోవడం విచారకరమే. చరిత్రపై శ్రద్ధ, ఘనవారసత్వాన్ని కాపాడుకోవాలనే ధ్యాస లేని సమాజంలో ఈ ప్రాచీన శిల్పవిన్నాణానికి ఇప్పటికైనా గుర్తింపు రావడమే ఉన్నంతలో ఊరట.
మన తెలుగు నేలపై ఇంకా వేయిస్తంభాల గుడి, లేపాక్షి లాంటి అద్భుతాలు, పునరుద్ధరిం చాల్సిన శిథిల నిర్మాణాలు, మరుగునపడిన చారిత్రక కట్టడాలెన్నో ఉన్నాయి. ఆలనాపాలనా లేని వాటిపై ఇకనైనా దృష్టి పెట్టాలి. కళలు, సంస్కృతి, చరిత్రపై తమిళ, కన్నడిగ, మలయాళీలకున్న అక్కర తెలుగువారికి లేదనే అపఖ్యాతి తరతరాలుగా మూటగట్టుకున్నాం. ఆ మచ్చను తుడిచేయా లంటే, ఇది సరైన సమయం! ‘ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో, ఈ బండల మాటున ఏ గుండెలు మోగెనో’ అన్న సినారె సాక్షిగా చరిత్రకెక్కని చరితార్థుల కథలు వెలికి తీయడానికి ఇదే సందర్భం! రామప్పకు దక్కిన గుర్తింపు మన జాతి చరిత్ర, సంస్కృతి, కళలపై స్వాభిమానం పెంచుకోవడానికి అందివచ్చిన అవకాశం! కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ లాంటి సంస్థలు, కొందరు కళాప్రియులు రెండు రాష్ట్రాల్లో ఇతోధికంగా శ్రమిస్తున్నా, అదొక్కటే సరిపోదు. భారతీయ పురావస్తు శాఖ తోడ్పాటు, తగిన నిధుల కేటాయింపుతో ప్రభుత్వాలు ముందుకు రావాలి. చరిత తెలుకోనిదే భవితను నిర్మించలేమనే చైతన్యంతో ప్రజలు భాగస్వాములు కావాలి. సమష్టిగా బాధ్యతను భుజానికెత్తుకొని, మన ఘనతను విశ్వానికి చాటాలి. ఆ దీక్షలో రామప్ప నుంచే తొలి అడుగు వేయాలి!
Comments
Please login to add a commentAdd a comment