సాక్షి, హైదరాబాద్: ‘నేను ఇటీవల పరిగి సమీపంలోని ఓ గ్రామానికెళ్లా.. ఆ ఊరి నిండా శిల్పాలే. వెయ్యేళ్ల నాటి అద్భుత శిల్పాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ దుస్థితి కొంత దూరమవుతుందన్న ఆశాభావం కలుగుతోంది. రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా రావటమే ఇందుకు కారణం. ఆలయ శిల్పాలే యునెస్కోను ఆకర్షించాయి. ఫలితంగా శిల్పాలకు కొంతగుర్తింపు పెరుగుతుంది. నిరాదరణకు గురవుతున్న పురాతన శిల్పాలకు కొంత గౌరవం దక్కుతుంది’అని ప్రముఖ స్తపతి, రామప్ప దేవాలయ నిర్మాణానికి వినియోగించిన ఎర్ర ఇసుక రాతిని తొలిచిన క్వారీలను ఇటీవల వెలుగులోకి తెచ్చిన పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా దక్కిన నేపథ్యంలో ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
ఇది గొప్ప మలుపు
కర్ణాటకలోని హంపికి యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత ఆ ప్రాంత రూపురేఖలే మారిపోయాయి. 10 వేల కుటుంబాలకు ఉపాధి రావటమే కాకుండా, నిత్యం విదేశీ పర్యాటకులతో ఆ ప్రాంతం కొత్త అందాలతో పాటు వేగంగా పురోగమించేందుకు అవకాశం కలిగింది. పట్టడకల్ దేవాలయాలకు ఆ గుర్తింపు వచినప్పుడు కూడా అదే జరిగింది. ఇప్పుడు రామప్పకు యునెస్కో గుర్తింపు రావటంతో మనవద్ద కూడా అలాంటి అభివృద్ధికి అవకాశం ఉంది. కాలక్రమంలో వాటిల్లో చాలావరకు దాడులకు గురై ధ్వంసం కావటంతో వాటి శిల్పాలు ఊరూవాడ చిందరవందరగా పడిపోయాయి. అవగాహనలేని స్థానికులు వాటిని గాలికొదిలేశారు. ఇప్పుడు రామప్పకు గుర్తింపుతో ప్రజల్లో కొంత చైతన్యం వచ్చి ఆ శిల్పాలకు కొంత గుర్తింపు వస్తుందని భావిస్తున్నా.
శిల్పులకూ గౌరవం వస్తుంది
రామప్ప దేవాలయంలోని నల్లరాతితో చెక్కిన శిల్పాలు, స్తంభాల ముందు నిలబడితే అద్దంలో చూసుకుంటున్నామన్న భావన వస్తుంది. రాతిని గాజులాగా మార్చేసిన 8 శతాబ్దాల క్రితం నాటి శిల్పుల ఘనతకు ఇప్పుడు మరింత గుర్తింపు వస్తుంది. వారిపై గౌరవం పెరుగుతుంది. ఎలాంటి యంత్రాలు అందుబాటులో లేని సమయంలో.. ఉలితోనే రాతిని అద్దంలా మార్చిన ప్రతిభ నేటి తరానికి తెలుస్తుంది.
శిథిల ఆలయాల పునరుద్ధరణ అవసరం..
కాకతీయుల కాలంలో అద్భుత దేవాలయాలను నిర్మించారు. అంతకుముందు చాళక్యులు కట్టిన అలంపూర్ లాంటి ఆలయాలున్నాయి. కానీ చాలావరకు శిథిలమవుతున్నాయి. రామప్పకు ప్రపంచ గుర్తింపు నేపథ్యంలో.. శిథిలమవుతున్న పాత దేవాలయాలను పునరుద్ధరించాలన్న ఆలోచన కూడా గ్రామాలకు కలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment