ఆపదలో అగ్నిమాపక కేంద్రాలు | Minimum Facilities Not Implement In Fire Stations | Sakshi
Sakshi News home page

ఆపదలో అగ్నిమాపక కేంద్రాలు

Published Mon, Feb 25 2019 10:14 AM | Last Updated on Mon, Feb 25 2019 11:29 AM

Minimum Facilities Not Implement In Fire Stations - Sakshi

అగ్నిమాపక కేంద్రాలకు ఆపద వచ్చింది. ప్రమా దం జరిగినప్పుడు ఆదుకునే పరిస్థితి లేకుండా పోతోంది. ఫైర్‌స్టేషన్లకు సరైన భవనాలు లేక రేకుల షెడ్లలోనే కాలం వెల్లదీస్తున్నారు. వాహనం కండీషన్‌ ఉండదు. డీజిల్‌కు బడ్జెట్‌ లేదు. కనీసం ట్యాంకర్‌లో నింపేందుకు నీరు కూడా దొరకని దుస్థితి. ఇలాంటి సమయంలో అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం వస్తే సిబ్బంది వెళ్లేలోపే పుణ్యకాలం కాస్తా అయిపోతుంది. చివరకు బూడిదే మిగులుతోంది.

నర్సంపేట: ఆపదలో ఆదుకునే అగ్నిమాపక కేంద్రాలకు సౌకర్యాలు లేక సిబ్బంది ఇబ్బందుల గురవుతున్నారు.  చాలా ఏళ్ల నాటి ఫైర్‌ స్టేషన్‌లకు సరైన భవనాలు లేక రేకుల షెడ్‌లతోనే కాలం వెల్లదీస్తున్నారు. వాహనం కండీషన్‌లో ఉండదు. డీజిల్‌కు బడ్జెట్‌ కేటాయింపు ఉండదు. ట్యాంకర్‌లో నింపేందుకు నీరు దొరకదు. ఇలాంటి తరుణంలో ఏదైనా ప్రమాదం జరిగి...ఫోన్‌ చేస్తే... సిబ్బంది గంట కొట్టుకుంటూ  వచ్చే వరకు పుణ్యకాలం కాస్తా పూర్తవుతుంది. అగ్నికి ఆస్తి ఆహుతి అవుతోంది. బాధితులకు బూడిదే మిగులుతోంది. ఏళ్లుగా ఇదే పరిస్థితి. గతేడాది ఆధునిక పరికరాలు ఇచ్చారే తప్పా.. అందులో పనిచేసే సిబ్బంది సమస్యలను వదిలేశారు.

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఈ ఏడాది వర్ధన్నపేటలో ఫైర్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసి ఆధునాతన ఫైర్‌ ఇంజిన్‌ అందించడం మినహా ఏళ్ల తరబడి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. రానున్నది అసలే ఎండాకాలం.. ఈ నెల 23న పరకాల నియోజకవర్గంలో ఒకేరోజు ఒగ్లాపూర్, శనిగరం గ్రామాల్లో రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇలాంటి సంఘటనలు రానున్న రోజుల్లో జరిగే అవకాశం ఉండడంతో ప్రభుత్వం సౌకర్యాలు కల్పించి ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యచరణ తీసుకోవాల్సిన అవపరం ఉంది. వేసవికాలం వచ్చిందంటే చాలు అగ్ని ప్రమాదాల భయం వెంటాడుతుంటుంది. జిల్లాలో ప్రతి ఏటా వేసవి కాలంలో జరిగిన అగ్ని ప్రమాదాల నివారణ కోసం కొత్తగా ఫైర్‌స్టేషన్‌లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలున్నా..  ఒక్క వర్దన్నపేటలోనే ఏర్పాటు చేసి మిగతా చోట్ల విస్మరించారు. దీంతో పాత అగ్నిమాపక కేంద్రాలతోనే సేవలు అందిస్తున్నారు. ప్రమాదాలు జరిగినపుడు సకాలంలో అగ్నిమాపక శకటం చేరుకున్నప్పుడే ఆస్తులు కాపాడుకోగలుగుతున్నారు. దూర ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగితే అంతేసంగతులు. బాధితుల ఆస్తులు బుగ్గిపాలవుతున్నాయి

నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణం.. 
అగ్ని ప్రమాదాలు చిన్న చిన్న తప్పిదాల వల్లే ఎక్కువగా జరుగుతుంటాయి.అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే 101కి సమాచారం అందించాలి. ఎక్కువగా అగ్ని ప్రమాదాలు వేసవి కాలంలో సంభవిస్తాయి.విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్, గ్యాస్‌ లీకేజీల కారణంగా ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గ్రామాల్లో  గడ్డివాములు, పూరిళ్లు, ఎండిన పొలాల్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి.

జిల్లాలో మూడు కేంద్రాలు..
జిల్లాలో రెండు నెలల క్రితం వరకు రెండు అగ్నిమాపక కేంద్రాలు మాత్రమే ఉండగా వర్ధన్నపేటలో తాజాగా ఏర్పాటు చేశారు. నర్సంపేట అగ్నిమాపక కేంద్రంలోని ఫైరింజన్‌ మహబూబాబాద్‌ జిల్లాల్లోని గ్రామాలకు కూడా వెళ్లాల్సి ఉండడంతో దూర ప్రాంతాల్లో ప్రమాదం జరిగితే సమాచారం అందించిన తర్వాత బయలుదేరినప్పటికి ఆలస్యమై ఆస్తి నష్టం ఎక్కువగా కలిగేది.  కొన్ని చోట్ల కొత్తవి ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఉంది. కనీసం మూడు మండలాల పరిధిలో ఒక అగ్నిమాపక కేంద్రం ఉంటేనే అవి సకాలంలో సంఘటన స్థలాలకు చేరుకొని సిబ్బంది మంటలు అదుపులో చేసే అవకాశం ఉంటుంది.

అగ్నిమాపక శాఖకు ఇటీవల బుల్లెట్లు మంజూరు చేసింది. కేంద్రాలు, వాహనాల నిర్వహణకు బడ్జెట్‌ కొరత కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అగ్నిమాపక ట్యాంకర్లకు నీటి సరఫరా కోసం బోర్లు అవసరం ఉంది. డీజిల్‌ కేటాయింపులు, సిబ్బంది కొరత వంటి సమస్యలు ప్రతిబింబంగా మారాయి. పట్టణాల్లో అగ్ని ప్రమాదాల తరుణంలో సిబ్బంది ప్రాణాలు పణంగా పెట్టి పనిచేయాల్సి వస్తుంది. ముఖ్యంగా బహుళ అంతస్తులు, సినిమా థియేటర్లు, వాణిజ్య భవంతులు, ప్రైవేట్‌ పాఠశాలలో ఎక్కడా కూడా అగ్ని నిరోధక పరికరాలు లేవు. పైగా అంగుళం కూడా వదలకుండా భవనాలు నిర్మిస్తున్నారు. అనుకోకుండా ప్రమాదాలు జరిగితే ఆస్తి నష్టం తీవ్రంగా ఉంటోంది. 

ఇబ్బందులను అధికమించి సేవలు...
అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో సంఘటన స్థలానికి వెళ్లే సమయంలో రోడ్డుకు అడ్డుగా ఉన్న విద్యుత్‌ తీగలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఐనప్పటికి సాధ్యమైనంత వరకు నష్ట నివారణ చేసేందుకు ప్రమాద స్థలానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. విద్యుత్‌ అధికారులకు కూడా ఇదే విషయంపై సహకరించాలని కోరాం. ప్రమాదం జరిగిన వెంటనే 101కు సమాచారం అందించాలి. – పోకల రామకృష్ణ, అగ్నిమాపక అధికారి, నర్సంపేట

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement