హిల్.. కిల్ | Kill Hill .. | Sakshi
Sakshi News home page

హిల్.. కిల్

Published Mon, Dec 21 2015 12:02 AM | Last Updated on Sun, Sep 3 2017 2:18 PM

హిల్.. కిల్

హిల్.. కిల్

{పాణాలు తీస్తున్న కొండలు
పాలకులు, ల్యాండ్ మాఫియాతో అనర్ధాలు
కొండవాలు ప్రాంతాల్లో 25 వేల కుటుంబాలు

 
విశాఖపట్నం : విశాఖ నగరంలో కొండ లు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. అనధికార కట్టడాలతో ప్రకృతి ప్రసాదిత గిరులను ఆక్రమించుకుంటున్నందుకు ఫలితంగా ప్రాణాలనే బలికోరుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేయడం మినహా శాశ్వత చర్యలు కానరావడం లేదు. నగరంలో 25వేల కుటుంబాలు కొండవాలు ప్రాంతాల్లో జీవిస్తున్నట్టు అంచనా.
 
ప్రమాదమని తెలిసినా
 తుపాను, సునామీ, భూకంపం ఇలా ఏ హెచ్చరికలు జారీ అయినా కొండవాలు ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు ఉండడం లేదు.  హూద్‌హూద్ తుఫాను  సమయంలో వేలాది ఇళ్లు నేలకూలాయి. అయినా వేరే ఎక్కడా గూడు దొరకకపోవడంతో మళ్లీ అక్కడే గుడిసెలు, ఇళ్లు నిర్మించుకుని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఎన్నికల సమయంలోనూ, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ ప్రాంతాల్లో పర్యటించి ప్రత్యామ్నాయ నివాసాలు కల్పిస్తామని, రక్షణ గోడలు నిర్మిస్తామని ఎన్నెన్నో హామీలు గుప్పిస్తున్నా అవేవీ అమలులోకి రావడం లేదు.

ల్యాండ్ మాఫియా నిర్వాకం
ల్యాండ్ మాఫియా రంగంలోకి దిగి కొండలను ఆక్రమిస్తోంది. ప్రజాప్రతినిధుల అండతో కొందరు గ్రూపులుగా ఏర్పడి కొండ ప్రాంతాలలో హద్దులు నిర్ణయిస్తున్నారు. 30 నుంచి వంద గజాల స్థలాలు చదును చేసి బహిరంగంగా అమ్మేస్తున్నారు. ముందుగా అక్కడి చెట్లకు నిప్పు పెట్టి స్థలాలను చదును చేస్తున్నారు. తర్వాత చిన్నపాక వేసి దానిని రేకుల షెడ్డుగా, భవనంగా మారుస్తున్నారు. అనంతరం ఇళ్లు లేని వారికి వాటిని విక్రయిస్తున్నారు.

ప్రమాదంలో జీవనం
విశాఖ నగరానికి ఉపాధి, కూలీ పనులు  కోసం చాలా మంది వలస వస్తుంటారు.  కొమ్మాది, ఆరిలోవ, మధురవాడ, తాడిచెట్లపాలెం, మాధవధార, సీతమ్మధార, వెంకోజిపాలెం, హనుమంతవాక, కప్పరాడ, మురళీనగర్, సింహిద్రిపురం, వరాహగిరి కాలనీ, గాజువాక, మల్కాపురం, కస్తూరినగర్, రాంజీఎస్టేట్, సంజీవయ్యాకాలనీ, తిక్కవానిపాలెంకాలనీ, బాపూజీనగర్, శివలింగపురం, అరుంధతినగర్, అంబేద్కర్ ఎస్టేట్, జైభారత్‌నగర్, బర్మానగర్, శ్రీనివాసనగర్, మధుసూధన నగర్, సురేష్‌రాంనగర్, సూరిబాబునగర్, శాంతినగర్ కొండలపై ఇలా వేలాది నివాసాలు వెలిశాయి.

కనీస వసతులు కరువు
 కొండవాలు ప్రాంతాల్లో నివసించే వారికి కనీస వసతులు కూడా ఉండవు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు వంటివి అందుబాటులో లేవు. ఇళ్లకు చేరే దారులు కూడా శిథిలమైపోయి ఇబ్బందులు పడుతున్నారు. జీవీఎంసీ తాగునీటిని సరఫరా చేస్తున్నా, అవి పైపులైన్లు ద్వారా కొండపైకి చేరడం లేదు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement