ఒంగోలు కల్చరల్, న్యూస్‌లైన్: విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాలు సమస్యల నిలయాలుగా మారుతున్నాయి. అద్దె భవనాల్లో.. అరకొర వసతుల మధ్య కునారిల్లుతున్నాయి. జిల్లాలోని గ్రంథాలయాల స్థితిగతులను ‘న్యూస్‌లైన్’ బృందం ఆదివారం పరిశీలించింది. జిల్లాలో పెరుగుతున్న పాఠకుల సంఖ్యకు తగినట్లుగా కొత్త గ్రంథాలయాలు ఏర్పాటుకావడంలేదు. గ్రంథాలయాల వల్ల ఆదాయం లేకపోవడంతో ప్రభుత్వం కూడా వీటి అభివృద్ధిపై ఉదాసీనత కనబరుస్తోంది. తగినంతమంది సిబ్బంది లేకపోవడం, నూతన నియామకాలకు ప్రభుత్వం అనుమతి అంతగా ఇవ్వకపోవడం వంటి కారణాల వల్ల సిబ్బంది కొరత ఏర్పడి పలు గ్రంథాలయాలు మూతపడుతున్నాయి.
పేరుకుపోతున్న పన్ను బకాయిలు:
గ్రంథాలయాలు నడవడానికి పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి వచ్చే సెస్ ముఖ్యాధారం. సిబ్బంది ఉదాసీనత వల్ల పన్ను బకాయిల వసూలు మందగిస్తోంది. దీంతో గ్రంథాలయాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
గత ఏడాది * 1.20 కోట్ల సెస్సు వసూలుకాగా, ఈ ఏడాది వసూలు మందగించింది. మైనర్ పంచాయతీల నుంచి సెస్సు వసూలు బాగా పడిపోయింది. వీటి నుంచి * 60 లక్షల దాకా బకాయిలు వసూలు కావలసి ఉంది. అయితే మార్చి వరకు సమయం ఉన్నందున సెస్సు బకాయిల వసూలు కొంత ఆశాజనకంగానే ఉండవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
పుస్తకాల కొనుగోలు కూడా ఏటా నిర్ణీత సమయంలో కాకుండా కొన్నేళ్లకు ఒకసారి జరుపుతుండడంతో పాతపుస్తకాలే పాఠకులకు దిక్కవుతున్నాయి. ఇటీవలి కాలంలో కొంత ధోరణి మార్చుకుని పోటీపరీక్షల పుస్తకాల కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతిదానికీ హైదరాబాద్‌లోని పౌర గ్రంథాలయ అధికారుల అనుమతి అవసరమవుతుండడంతో ఒక్కోసారి తీవ్రజాప్యం చోటుచేసుకుంటోంది. జిల్లాలో 66 శాఖా గ్రంథాలయాలుండగా వీటిలో ప్రస్తుతం 64 మాత్రమే పనిచేస్తున్నాయి. సంతరావూరు, ముండ్లమూరు లైబ్రరీలు మూతపడ్డాయి. గ్రామీణ గ్రంథాలయాలు 12 పనిచేస్తున్నాయి. బుక్‌డిపాజిట్ సెంటర్లు 70 ఉన్నాయి. శాఖా గ్రంథాలయాలు లేనిచోట్ల బుక్‌డిపాజిట్ సెంటర్లను నిర్వహిస్తున్నారు.
అద్దె భవనాల్లోనే...
జిల్లాలో 22 గ్రంథాలయాలకు మాత్రమే సొంత భవనాలున్నాయి. 15 అద్దె భవనాల్లో, మిగిలినవి ఉచిత భవనాల్లో నిర్వహిస్తున్నారు. కొరిశపాడు, పర్చూరు, కనిగిరి, కొండపి, మార్కాపురం గ్రంథాలయాలకు 2013-14 సంవత్సరంలో సొంత భవనాలు నిర్మించారు. కనిగిరి, మార్కాపురం లైబ్రరీలలో అదనపు నిర్మాణాల కోసం ప్రతిపాదనలు పంపారు. యర్రగొండపాలెం, త్రిపురాంతకం, పొదిలి, హనుమంతునిపాడు గ్రంథాలయాలకు సొంత భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నతాధికారుల అనుమతి కోసం పంపారు. పామూరు, దర్శి, పొన్నలూరు గ్రంథాలయాలకు స్థలం కేటాయిస్తే సొంత భవనాలు నిర్మించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
సిబ్బంది కొరత..
జిల్లా గ్రంథాలయ సంస్థలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రంథాలయాలు ఉదయం 8 నుంచి 11 వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు పనిచేయాల్సి ఉంది. సిబ్బంది కొరత వల్ల ఒక్కో గ్రంథపాలకుడికి రెండు, మూడు గ్రంథాలయాల బాధ్యతలను అప్పగించడంతో అవి వారంలో ఒకటి రెండు రోజులు మాత్రమే తెరుచుకుంటున్నాయి. ఇటీవల ప్రభుత్వం 6 అటెండర్ల పోస్టులతోపాటు 3 లైబ్రేరియన్ల పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. జిల్లా కలెక్టరు నుంచి అనుమతి రాగానే ఈ పోస్టుల భ ర్తీ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది. పోటీ పరీక్షల సీజన్ కావడంతో పాఠకులు గ్రంథాలయాలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీనిని కూడా అధికారులు దృష్టిలో పెట్టుకోవాలి.
కనీస వసతులేవీ...
అనేకచోట్ల వసతుల లేమి పాఠకులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. కొన్ని గ్రంథాలయాల్లో కనీసం సరైన ఫర్నిచరు లేదు. కరెంటు సౌకర్యం లేనివి కూడా ఉన్నాయి. పాఠకులకు మంచినీటి వసతి దాదాపు శూన్యం. టాయిలెట్ సౌకర్యం అనేక చోట్ల లేదు. ముఖ్యంగా మహిళా పాఠకులకు అవసరమైన సౌకర్యాలు పలు గ్రంథాలయాల్లో లేవు. దీంతో వారు ఆ గ్రంథాలయాలకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. పలుచోట్ల గ్రంథాలయాధికారులు సరిగా విధులకు హాజరుకావడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నింటినీ చక్కదిద్ది పాఠకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది.
అదనపు పుస్తకాల రాక...
రాజా రామ్మోహన్‌రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ నుంచి ఇటీవల 800 రకాల పుస్తకాలకు సంబంధించి 3200 ప్రతులు వచ్చాయి. వీటిని జిల్లాలోని ఇతర గ్రంథాలయాలకు పంపే యత్నాలను అధికారులు చేపట్టారు.
ఆన్‌లైన్ నమోదు సౌకర్యం...
పాఠకులు తమకు కావలసిన పుస్తకాన్ని ఇంతకాలం గ్రంథాలయాల్లోని రిజిస్టర్లలో నమోదు చేసుకోవలసి వచ్చేది. ఈ పద్ధతికి పౌర గ్రంథాలయ ఉన్నతాధికారులు స్వస్తి పలికి ఆనలైన్‌లో నమోదు చేసుకునే అవకాశాన్ని నూతనంగా కల్పించారు. పాఠకులు ఇకనుంచి ్చఞఞఠఛజీఛిజీఛట్చటజ్ఛీట.జీఛి.జీ అనే దానిలో నమోదు చేసుకుంటే ఆ పుస్తకాన్ని కొనుగోలు చేసి సరఫరా చేస్తారు. ఈ వినూత్న విధానాన్ని పాఠకులు, ఉద్యోగార్థులు సద్వినియోగం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
సౌకర్యాల కల్పనకు కృషి
ఆర్‌సీహెచ్ వెంకట్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి
జిల్లా గ్రంథాలయ సంస్థను అభివృద్ధి పథంలో పయనింపచేసేందుకు చర్యలు చేపడుతున్నాం. అద్దె భవనాల్లో నడుస్తున్న వాటికి సొంత భవనాలు ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. ఖాళీల భర్తీకి చర్యలు చేపడుతున్నాం. డ్వాక్రా బజారులోని బాలల గ్రంథాలయాన్ని వేరే చోటకు మారుస్తాం. సెస్ బకాయిల వసూలుపై దృష్టి సారించాం.
విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాలు
Published Mon, Dec 30 2013 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM
Advertisement
Advertisement