సాక్షి,యాదాద్రి: ఓ దఫా కౌన్సిలర్‌గా గెలిస్తే చాలు.. రూ.కోట్లు కూడగట్టేసుకుంటున్న నేటి రోజుల్లో ఏకంగా రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినా సొంతిల్లు కూడా కూడగట్టుకోలేని నిజాయితీకి నిలువుటద్దం కొమ్మిడి నర్సింహారెడ్డి. సర్పంచ్‌గా ప్రజా జీవితం ప్రారంభించి, సమితి ప్రెసిడెంట్‌గా, భువనగిరి ఎమ్మెల్యేగా రెండు దఫాలు సేవలందించిన కొమ్మిడి ప్రజా సమస్యలే ఎజెండాగా ఎంచుకున్న నిస్వార్థ రాజకీయనాయకుడు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్నా మర్రి చెన్నారెడ్డి లాంటి వారి కోటరీలో ఉన్నా తనకంటూ ప్రత్యేకంగా ఆస్తిపాస్తులు సంపాదించుకోలేదు. చివరకు అద్దె ఇంట్లో ఉంటూ సాధారణ జీవితం గడుపుతున్న కొమ్మిడి ఆదర్శ ప్రస్థానం ఓసారి చూద్దాం రండి.
ఎన్టీఆర్ ప్రభంజనాన్నీ ఎదుర్కొని గెలిచి..
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కొమ్మిడి నర్సింహారెడ్డి భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1962 నుంచి 1970 వరకు బ్రాహ్మణపల్లి గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. తొలిదశ తెలంగాణ పోరాటసమయంలో 1969లో బ్రాహ్మణ పల్లి సర్పంచ్‌గా ఉన్నారు. అనంతరం 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ› నుంచి భువనగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు.1983లో ఎన్‌టీ.రామారావు టీడీపీ ప్రభంజనంలో కూడా ఆయన రెండవ సారి భువన గిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
డబ్బులు లేవని పోటీకి దూరం
1985 మధ్యంతర ఎన్నికల్లో కొమ్మిడి నర్సింహారెడ్డి ఎమ్మెల్యే ఎన్నికల నుంచి తప్పుకున్నారు. 1978 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన ఎన్నికల ఖర్చు సుమారు రూ.7 వేలు కాగా, రెండోసారి ఎన్నికల నాటికి ఆ ఖర్చు రూ.2 లక్షలకు పెరిగింది. మూడోసారి పోటీ చేసే అవకాశం ఉన్నా.. డబ్బు లేదని పోటీ నుంచి స్వచ్ఛందంగా విరమించుకున్నారు. ఆ ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పోటీ చేయమని కోరినా కొమ్మిడి నర్సింహారెడ్డి సున్నితంగా తిరస్కరించారు. అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
పరిహారం వస్తే ఇల్లు కట్టుకుంటా
నా సొంత భూమి బొల్లేపల్లి కాల్వ తవ్వడం కోసం ప్రభుత్వం తీసుకుంది. తీసుకున్న భూమికి పరిహారం డబ్బులు వస్తే ఇల్లు కట్టుకుంటా. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నా. సీఎం, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌లను కలిసి వినతి పత్రాలు ఇచ్చినా పరిహారం డబ్బులు అందడం లేదు. ప్రభుత్వం స్పందించి భూ పరిహారం డబ్బులు ఇప్పించాలి. – కొమ్మిడి నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే
భూములను పేదలకు పంచారు
బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లిలో తన వాటాగా వచ్చిన సాగు భూమిని నర్సింహారెడ్డి పేదలకు పంచారు. 83 సంవత్సరాల వయసులో సైతం ఆయన ఇప్పటికీ దీర్ఘకాలిక ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. భువనగిరి ప్రాంత సమస్యలతో పాటు రాష్ట్ర స్థాయి సమస్యలను ఎజెండాగా చేసుకుని పోరాటం కొనసాగిస్తున్నారు. గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టి భువనగిరి, ఆలేరు ప్రాంతాలకు సాగు నీరు అందించాలని ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. గోదావరి నదీ జలాల సాధన, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని మూసీ పరీవాహక ప్రాంతంలో కాలుష్యం నివారణ, నిమ్స్, సీసీఎంబీ కోసం గతంలో ఆమరణ దీక్ష చేశారు.
గతంలో స్కూటర్‌పైనే ప్రయాణం
నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే నర్సింహారెడ్డి వాహనం బజాజ్ చేతక్‌ను ఉపయోగించేవారు. వృద్ధాప్యం వల్ల ప్రస్తుతం స్కూటర్‌ను వాడడం లేదు. అప్పట్లో అసెంబ్లీ, సీఎం ఇల్లు, సచివాలయం, అధికారుల వద్దకు ఎక్కడికి వెళ్లినా ఆయన తన స్కూటర్ పైనే వెళ్లేవారు. జాతీయ స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ఎందరితోనో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నప్పటికీ.. ఎప్పుడు తాను నమ్మిన సిద్ధాంతాన్ని వీడలేదు. తన ప్రజాసమస్యల పోరాట నావను ఆపలేదు.
Comments
Please login to add a commentAdd a comment