‘అరణ్య’ రోదన..  | Minimum Facilities Not Implemented In Tribal Areas Khammam | Sakshi
Sakshi News home page

‘అరణ్య’ రోదన.. 

Published Mon, Apr 22 2019 6:56 AM | Last Updated on Mon, Apr 22 2019 6:56 AM

Minimum Facilities Not Implemented In Tribal Areas Khammam - Sakshi

పాల్వంచరూరల్‌:    చెట్టు.. పుట్ట... పశువులు.. అడవి సంపదే సర్వస్వంగా బతికే ఆదివాసీలు వారంతా.  ప్రపంచం సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నా.. ఆ ఆదివాసీ గూడెంలో మాత్రం కనీసం విద్యుత్‌ సౌకర్యం కూడా లేదు. నేటికీ చీకటిలోనే బతుకీడుస్తున్న గిరిజనులు.. నీటి కోసం కూడా కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లాల్సిందే. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి కోట్లు ఖర్చు చేస్తున్నామని చెపుతున్న పాలకులకు ఇలాంటి ఆదివాసీ గూడేలు ఎందుకు కనిపించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. చివరకు ఆదివాసీ గిరిజనుల కోసమే ఏర్పాటు చేసిన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) కూడా వీరి గురించి పట్టించుకోకపోవడం గమనార్హం. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం, చిన్నచూపుతో తమ సమస్యలను పట్టించుకునే నాథుడే లేడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏళ్ల తరబడి ఆదివాసీ గూడేల్లో ఉంటున్న వీరి జీవనశైలిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. నిరక్షరాస్యత, అమాయకత్వంతో అరణ్యంలో కాపురం చేస్తూ అభివృద్ధి పథకాలకు నోచుకోక దుర్భర జీవితం గడుపుతున్నారు. ఇంతటి దీనావస్థలో ఉన్న గిరిజన గూడెం చిరుతానిపాడు. జిల్లా కేంద్రం కొత్తగూడేనికి 34 కిలో మీటర్ల దూరంలో గల ఈ గూడెం.. పాల్వంచ మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఎన్నో ఏళ్ల క్రితం వలస వచ్చిన ఆదివాసీలు ఇక్కడ గుట్టల మధ్య నివసిస్తున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలు ఏ ఒక్కటీ వీరికి అందడం లేదు. ఇక్కడ 33 గిరిజన కుటుంబాల్లో 120 మంది నివాసం ఉంటున్నారు. తునికాకు, అటవీ ఉత్పత్తుల సేకరణతో పాటు వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో ఒక్కో గిరిజనుడికి 20 నుంచి 30 వరకు తెల్ల పశువులు, గొర్రెలు, మేకలు ఉన్నాయి. ఆధార్‌కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయి కానీ రేషన్‌ కార్డులు మాత్రం ఇవ్వలేదు.

విద్యుత్, తాగునీరు, రహదారి సౌకర్యాలు శూన్యం..  
మండలంలోని బంజర పంచాయతీ నుంచి 3–4 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరుతానిపాడు గ్రామంలో నివాసం ఉంటున్న గిరిజనులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. కనీస రహదారి సౌకర్యం కూడా లేదు. వర్షాకాలంలో అయితే చుట్టూ తిరిగి 5 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్తే తప్ప పంచాయతీ కేంద్రానికి చేరుకోలేరు. ఇక విద్యుత్‌ సౌకర్యం లేక అంధకారంలో మగ్గుతున్నారు. తాగునీరు లేకపోవడంతో వర్షాకాలం, వేసవికాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వైద్యసేవలు అందని ద్రాక్షే...  
చిరుతానిపాడులోని గిరిజన ప్రజలకు వైద్య సౌకర్యం కూడా అందుబాటులో లేదు. దీంతో గ్రామంలో ఎవరికైనా జబ్బుచేస్తే మంచంతో కావడి కట్టుకుని నలుగురు వ్యక్తులు కలిసి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉల్వనూరు అరోగ్య కేంద్రానికి వెళ్లాల్సిన దుస్థితి. కనీసం టీకాలు వేయడానికి కూడా గ్రామంలోకి వైద్యసిబ్బంది రారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేది లేక నాటు వైద్యంపైనే ఆధారపడుతున్నారు.

గ్రామంలో చదువుకుంటున్నది ఇద్దరే.. 
గిరిజన పిల్లలు చదువుకోవాలంటే పాఠశాల లేదు. గ్రామంలోని 120 మందిలో కేవలం ఇద్దరు మాత్రమే చదువుకుంటున్నారు. వారిలో అక్కా చెల్లెళ్లు లక్ష్మి భద్రాచలం గిరిజన ఆశ్రమ కళాశాలలో ఇంటర్, కోసమ్మ ఉల్వనూరులోని ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. వారు కూడా ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. ఇక మిగితా పిల్లలెవరూ చదువుపై అసక్తి చూపడం లేదు.

తాగునీరు లేక పాట్లు..  
చిరుతానిపాడు గ్రామంలో తాగునీరు సౌకర్యం లేదు. దీంతో గిరిజనులు వర్షకాలం, వేసవిలోకూడా గ్రామ సమీపంలో ఉన్న కుంటలు, వాగులు, వంకలో ప్రవహించే నీటినే తాగుతున్నారు. కలుషితంగా ఉండే ఆ నీటిని తాగడంతో అనారోగ్యాల పాలవుతున్నారు. కనీసం ఒక  బోరు వేయడానికి కూడా అటవీశాఖ అధికారులు అంగీకరించడం లేదు.

నిత్యావసర సరుకులకు 4 కిలోమీటర్లు..
చిరుతానిపాడు గ్రామంలోని గిరిజనులకు అవసరమైన నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలంటే నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఉల్వనూరు గ్రామానికి నడిచి వెళ్లాల్సిందే. వారం, పది రోజులకు ఒకసారి వెళ్లి తాము సేకరించిన అటవీ ఉత్పత్తులను విక్రయించి నిత్యావసర సరుకులను తెచ్చుకుంటారు. గ్రామంలోని గిరిజనులకు ఒక్కరికి కూడా బ్యాంక్‌ ఎకౌంట్‌ లేదు. జీసీసీ సరుకులు కూడా అందని దుస్థితి నెలకొంది.

పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు..  
అటవీ ప్రాంతంలో అభివృద్దికి ఆమడదూరంలో జీవనం సాగిస్తున్న వలస ఆదివాసీ గిరిజన సమస్యలను ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. గ్రామంలో ఉన్న ప్రజలకు ఓటరు గుర్తింపు కార్డులు, ఆధార్‌ కార్డులు ఉన్నాయి. ఎన్నికల్లో ఓట్లు వేయించుకునేందుకు మాత్రం నాయకులు తమపై కపట ప్రేమ చూపుతారని, ఆ తర్వాత గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడరని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మాకు ప్రభుత్వ పథకాలంటే తెలియదు 
మా గ్రామంలో చాలావరకు ఓటరు కార్డులు, ఆధార్‌ కార్డులు ఉన్నాయి. మేము కూడా జనాభా లెక్కల్లో ఉన్నాం. కానీ ప్రభుత్వం అందించే ఏ ఒక్క పథకం కూడా మాకు రావడం లేదు. అసలు మా గ్రామంలో ఇంతవరకు ఎవరికీ బ్యాంకు ఖాతాలు లేవు. – జోగారాం, చిరుతానిపాడు   ఐటీడీఏ కూడా పట్టించుకోవడం లేదు

ఏళ్ల తరబడి ఇదే గూడెంలో నివాసం ఉంటున్నాం. అడవిని నమ్ముకుని బతుకుతున్నాం. అడవిలో చెట్ల నుంచి వచ్చే ఉత్పత్తులను అమ్ముకుని వచ్చిన డబ్బుతో అవసరమైన సరుకులు కొనుక్కుంటాం. ఆదివాసీ గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన భద్రాచలం ఐటీడీఏ కూడా మా గోడు పట్టించుకోవడం లేదు. – లక్ష్మి, చిరుతానిపాడు   
మాపై చిన్నచూపు ఎందుకు..?  

ఆదివాసీ గ్రామంలో ఉంటున్న మాపై అధికారులు, నాయకులు చిన్నచూపు చూస్తున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలేదు. కనీసం రోడ్డు కూడా లేదంటే మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో తెలుస్తుంది. మంచినీళ్లు లేక ఎండిన చెరువులో చెలిమలు తీసుకుని నీళ్లు తాగుతున్నాం. – కోవాసి మంగమ్మ, చిరుతానిపాడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement