ఒకవైపే ఉన్న రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాం
చిన్నశంకరంపేట(మెదక్): సికింద్రాబాద్–నిజామాబాద్ రైల్వే మార్గంలో గతంలో ఎంతో చరిత్ర కలిగిన మిర్జాపల్లి రైల్వే స్టేషన్ నేడు వెలవెలబోతుంది. ఈ స్టేషన్ గత వైభవం కోసం చేస్తున్న ప్రయత్నాలు నేరవేరకపోవడంతో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి రైల్వే స్టేషన్ సికింద్రాబాద్–నిజామాబాద్ రైల్వే మార్గంలో సమాన దూరం ఉండడంతో పాటు ఇక్కడ రైల్వే రన్నింగ్ రూంతో పాటు రైళ్లకు అవసరమైన బొగ్గు, నీరు ఇక్కడే నింపుకునేవారు. దీంతో ఇక్కడ ప్రతి రైలు ఆగడంతో ప్రయాణికులతో పాటు ఉద్యోగులతో కిటకిటలాడేది. రైల్వే ఉద్యోగులకు క్వార్టర్స్‌తో పాటు రన్నింగ్ రూం ద్వారా రైల్వే ఉద్యోగులకు విశ్రాంతి వసతి సౌకర్యం ఉండేది.
అలాంటి స్టేషన్‌లో నేడు అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగకుండనే దూసుకుపోతున్నాయి. దీంతో నగరాలకు ఉద్యోగాలకు వెళ్లేవారితో పాటు పుణ్యక్షేత్రాలకు, దూర ప్రాంతాలకు వెళ్లేవారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో అజాంత ఎక్స్‌ప్రెస్, జైపూర్ ఎక్స్‌ప్రెస్, అజ్మీర్ ఎక్స్‌ప్రెస్ సికింద్రబాద్–నిజామాబాద్ మార్గలో బోల్లారం, మిర్జాపల్లి, కామారెడ్డి మాత్రమే హల్టీంగ్ ఉండేవి. ప్రస్తుతం ఈ రైళ్లు మిర్జాపల్లిలో ఆగడం లేదు. మరో వైపు కొత్తగా వచ్చిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్, విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు మరికొన్ని వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు మిర్జాపల్లి రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తున్నప్పటికీ ఇక్కడ హల్టీంగ్ లేకపోవడంతో మిర్జాపల్లి గ్రామాస్తులను నిరాశపరుస్తున్నాయి.
నెరవేరని హామీ..
మిర్జాపల్లి రైల్వే స్టేషన్‌లో అదనపు ప్లాట్ ఫాం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. రెండు రైళ్లు క్రాసింగ్ ఉన్న సమయంలో ఉన్న ఒక్క ప్లాట్ ఫాంపై ట్రైన్ ఉండగా, మరో రైలు ఎక్కేందుకు ప్రయాణికులు ఎత్తైన ప్లాట్ ఫాం నుంచి పట్టాలపైకి దిగడం నరకాన్ని తలపిస్తోంది. అలాగే ట్రైన్ కోసం పరుగులు పెట్టే సమయంలో అదుపుతప్పి ప్రమాదాలకు గురైతున్న సంఘటనలున్నాయి. మరో వైపు చిన్నారులు, వృద్ధులు లాగేజీతో ప్లాట్ ఫాం దిగడం ఎక్కడం ఇబ్బందిగా మారింది.
గత జనవరిలో అప్పటి జీఎం వినోద్ కూమార్ సికింద్రాబాద్–నిజామాబాద్ రైల్వే మార్గంతో ప్రయాణిస్తూ స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. ఈ సమయంలో మిర్జాపల్లిలో అజాంత ఎక్స్‌ప్రెస్, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ హల్టీంగ్‌తో పాటు అదనపు ప్లాట్ ఫాం, పుట్‌వేర్ బ్రిడ్జి మంజూరు కోసం ప్రతిపాదనలు అందించారు. అదనపు ప్లాట్ ఫాం, పుట్‌వేర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికి వాటి పనులు మాత్రం మొదలు కాలేదు. దీంతో ప్రయాణికుల ఇబ్బందులు తప్పడం లేదు. రైల్వే అధికారులు తమ సమస్యలు తీర్చి మిర్జాపల్లి రైల్వేస్టేషన్‌కు పూర్వ వైభవం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
పట్టాలు దాటలేకపోతున్నాం..
రైలు కోసం ప్లాట్ ఫాం ఎక్కడం దిగడానికి ఇబ్బందులు పడుతున్నాం. రెండు రైళ్లు క్రాసింగ్ ఉన్నప్పుడు మొదటి ఫ్లాట్ ఫాంపై ఉన్న రైలును దాటుకుని పట్టాలపైకి వెళ్లడం నరకాన్ని తలపిస్తోంది. ఆడవాళ్లతో పాటు వృద్ధులు, చిన్నపిల్లలు చాల బాధపడుతున్నారు. వెంటనే రెండో ఫ్లాట్ ఫాం నిర్మించేలా చర్యలు తీసుకోవాలి. –పోచమ్మ, మిర్జాపల్లి.
బాల్యంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లలో వెళ్లేవాళ్లం...
నిజామాబాద్–సికింద్రాబాద్ వెళ్లాలంటే అజాంత, జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో వెళ్లేవాళ్లం. దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలన్న ఎంతో సౌకర్యంవంతంగా ఉండేది. మీటర్ గేజ్ టైమ్‌లో మిర్జాపల్లిలో ఆగని ట్రైన్ లేకుండే. ఆ టైంలో ఎక్కడెక్కోడోల్లో వచ్చి మిర్జాపల్లి నుంచి రైలు ప్రయాణం చేసేవాళ్లు. ప్రస్తుతం అజాంత, జైపూర్ రైలళ్లు ఆగకపోవడంతో ఎంతో ఇబ్బదులు పడుతున్నాం. అధికారులు మిర్జాపల్లిలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిపేందుకు చర్యలు చేపాట్టాలి. –బ్రహ్మయ్య, చిన్నశంకరంపేట
Comments
Please login to add a commentAdd a comment