విప్‌ ఊరు.. ఉప్పు నీరు | Everything Problem In That Village In Pedabayalu | Sakshi
Sakshi News home page

విప్‌ ఊరు.. ఉప్పు నీరు

Published Mon, Jun 18 2018 10:40 AM | Last Updated on Mon, Jun 18 2018 10:40 AM

Everything Problem In That Village In Pedabayalu - Sakshi

కిడారి సొంతూరు నడిమివాడలో కలుషిత ఊటనీటిని సేకరిస్తున్న మహిళలు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం, పెదబయలు : అరకు నియోజకవర్గం.. పెదబయలు మండలం.. గిన్నెలకోట పంచాయతీ నడిమివాడ గ్రామం... తొమ్మిది కుటుంబాలు,  55 మంది  జనాభా ఉన్న మన్యంలోని అతి చిన్న పల్లెల్లో ఒకటి. ఒకప్పుడు 35కుటుంబాల వారు నివాసమున్నప్పటికీ అక్కడ కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కిలోమీటరు దూరంలో ఉన్న గుండాలగరువుకు వెళ్ళిపోయారు. కానీ ఆ 9 కుటుంబాల గిరిజనులు మాత్రం అక్కడే దశాబ్దాలుగా నివాసముంటున్నారు.


     ఇప్పుడు ఆ చిన్న పల్లె గురించి ప్రస్తావన ఎందుకుంటే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు సొంతూరు అది. అక్కడే ఆయన పుట్టి పెరిగారు. ఆ తర్వాత కిడారి కుటుంబం  జి.మాడుగుల మండలం కిల్లంకోట గ్రామానికి వలస వెళ్ళిపోయింది. ఆయన రాజకీయాల్లోకి వచ్చి మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చలువతో ఎమ్మెల్సీ, ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఆశీస్సులతో అరకు ఎమ్మెల్యేగా గెలుపొందారు. శాసనసభ్యుడైన తొలి నాళ్ళలోనే ఆయన తన సొంతూరు నడిమివాడకు వచ్చి పల్లె రూపురేఖలు మారుస్తానని హామీనిచ్చారు. ఇక్కడే  నివాసముంటున్న గిరిజనులకు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని వాగ్దానం చేశారు. అప్పుడు ఆయన మాటలకేమో గానీ తమ పల్లె బిడ్డ ఎమ్మెల్యే అయినందుకు ఆ గ్రామస్తులు మురిసిపోయారు. సంబరం చేసుకున్నారు.  అంతే... అక్కడితో కిడారి ఆ ఊరి సంగతే మరచిపోయారు.


నాలుగేళ్ళుగా ఊరివైపు కన్నెత్తి చూడలేదు..
2016లో  కిడారి తన నయవంచన రూపాన్ని బయటపెట్టారు. రాజకీయ జీవితం ఇచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీ పంచన చేరారు. కేవలం అభివృద్ధి కోసమే ఫిరాయిస్తున్నట్టు చెప్పారు. ఆ సందర్భంలో మళ్ళీ ఊరి ప్రస్తావన తెచ్చారు. నడిమివాడను వీలైనంత త్వరగా అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు. కానీ షరా మామూలుగానే పట్టించుకోలేదు. ఇక ఆర్నెల్ల కిందట ప్రభుత్వ విప్‌ అయ్యారు. ఎమ్మెల్యేగా గెలిపించిన పార్టీకి ద్రోహం చేసినందుకు గాను తెలుగుదేశం పార్టీ ఆయనకు క్యాబినెట్‌ హోదాతో విప్‌ పదవిని ఇచ్చింది. కనీసం ఆ పదవిలోకి వచ్చిన తర్వాతైనా ఆ ఊరి గురించి పట్టించుకుంటారని భావించిన గ్రామస్తుల ఆశలు అడియాసలే అయ్యాయి. ఇంకా దారుణమేమిటంటే ఈ నాలుగేళ్ళలో మళ్ళీ ఆ ఊరివైపు ఆయన కన్నెత్తి చూడలేదు. ఎప్పుడైనా ఆయన అరకు అరుదెంచిన సందర్భాల్లో నడిమివాడ గ్రామస్తులు కలిసి మొరపెట్టుకున్నా కనీసంగా కూడా పట్టించుకోలేదు.


గ్రామం పరిస్థితి ఎలా ఉందంటే.... 
ఒక్కోసారి వంటకు వర్షపు నీరే గతి. నడిమివాడలో గ్రామస్తులు తాగేందుకు మంచినీటి సరఫరా కూడా లేదు. రెండేళ్ల క్రితం వరకు పుట్టపర్తి సత్యసాయిబాబా ట్రస్ట్‌ నుంచి గ్రావిటీ పథకం ద్వారా నీరు వచ్చేది. కానీ ఆ పైపు లైన్లలో అవాంతరాలు రావడంతో ప్రస్తుతం ఆ నీరు కూడా సరిగ్గా రావడం లేదు. దీంతో  గ్రామస్తులు ఊట గెడ్డ( వాగు) నీటిపైనే ఆధారపడుతున్నారు. ఆ నీరు ఉప్పగా ఉన్నా... ఎలా ఉన్నా... అదే వారికి దిక్కు. ఇక వర్షాకాలాల్లో ఊటగెడ్డకు బురద నీరు చేరితే... చివరికి ఇంటి పైకప్పు నుంచి పడిన వర్షం నీటితో వండుకుని తిన్న రోజులే ఎక్కువని గ్రామస్తులు  చెబుతున్నారంటే అక్కడి దయనీయ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.


నెలకు 20 రోజులు అంధకారమే
గ్రామానికి పేరుకు మాత్రమే విద్యుత్‌ సౌకర్యం ఉంది గానీ... నెలలో 20రోజులు కరెంటు రాదు. ఇక వర్షాకాలంలో  నెలల తరబడి రాత్రిళ్ళు చీకట్లోనే మగ్గాలి. గతంలో  కిరోసిన్‌ సక్రమ సరఫరా వల్ల  ఆ బుడ్డీలన్నీ వెలిగించుకునే వాళ్ళమని, ఇప్పుడు కిరోసిన్‌ కోటాలో  కోతతో చాలా ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.  ప్రస్తుతం ప్రమిదల్లో రిఫైండ్‌ అయిల్‌ వేసి దీపంలో వెలుగులో ఉండాల్సిన పరిస్థితి  ఉందని అంటున్నారు.


అర్హులు ఉన్నా... మంజూరు కాని పెన్షన్లు
గ్రామంలో వృద్ధాప్య పింఛను, వికలాంగ పింఛన్‌ కోసం ఐదుగురు అర్హులు గడుతూరి రామూర్తిపడాల్, గడుతూరి దేవుడమ్మ,మ తమర్భ జంగంరాజు, గడుతూరి హరినాధ్‌ పడాల్, తమర్భ చంద్రమ్మలు ఎన్నోఏళ్ళుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా... నేటికీ మంజూరు కాలేదు.  గ్రామంలో మహిళలు శ్రీకోరబమ్మ ఎస్‌హెచ్‌జీ  ఏర్పాటు చేసుకుని పదేళ్ల నుంచి  పొదుపు చేస్తున్నప్పటికీ ప్రభుత్వ తరఫున సాయం మాత్రం అందడం లేదు. మొత్తం గ్రామంలో 9 కుటుంబాలు ఉంటే.. మూడు కుటుంబాలకు రేషన్‌ కార్డులు లేవు.

ఊరికి రోడ్డే లేదు..
నడిమివాడ వెళ్ళేందుకు కనీసం రోడ్డు లేదు. గ్రామస్తులు కష్టపడి ఏర్పాటు చేసుకున్న కాలిబాట వర్షాకాలంలో పనికిరాదు. బొయితిల పంచాయతీ చామగెడ్డ జంక్షన్‌ నుంచి  5 కిలో మీటర్ల మేర మట్టి రోడ్డు ఉంది. వాస్తవానికి ఆ మట్టి రోడ్డు కూడ అధ్వాన్నమే. ఆ మట్టిరోడ్డు నుంచి  కిలో మీటర్‌ దూరం కాలిబాటలోనే నడిమివాడకు వెళ్ళాలి. ఇక ఊరికి ఆనుకుని ఉన్న గెడ్డపై వంతెన లేకపోవడంతో వర్షాకాలంలో గెడ్డలు పొంగిన సందర్భాల్లో చుట్టు పక్కల గ్రామాలతో సంబంధాలు తెగిపోతుంటాయి.


కనీస వసతులు కల్పించండి చాలు..
గ్రామానికి కనీస సౌకర్యాలైన రోడ్డు, తాగునీరు, పక్కా గృహాలు, అర్హులకు పింఛన్లు, డ్వాక్రా మహిళలకు రుణాలు, రేషన్‌కార్డులు మంజూరు చేయాలి. ఇవన్నీ ఎమ్మెల్యే తలచుకుంటే వెంటనే అయిపోతాయి.. కానీ ఆయన పట్టించుకోవడం లేదు.
– కిడారి వినాయక కృష్ణమూర్తి,
రైతు, నడిమివాడ గ్రామం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement