న్యూఢిల్లీ: ఆరోగ్య రంగానికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.61,398 కోట్లను కేటాయించారు. అందులో రూ.6,400 కోట్లను ఆయుష్మాన్ ప్రధానమంత్రి జనారోగ్య యోజన(ఆయుష్మాన్ భారత్)కు ప్రత్యేకించారు. గత ఏడాది కన్నా ఈసారి ఆరోగ్య రంగానికి 16 శాతం అధికంగా కేటాయింపులు జరపడం గమనార్హం. ఇతర విశేషాలు..
► జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్(ఎన్‌ఆర్‌హెచ్‌ఎం)లో భాగంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్, వెల్‌సెంటర్ల ఏర్పాటుకు రూ.250 కోట్ల కేటాయింపు.
► జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద హెల్త్ అండ్ వెల్‌నెస్ కేంద్రాల ఏర్పాటు నిమిత్తం రూ.1,350.01 కోట్ల కేటాయింపు.
► ఈ పథకం కింద 2022 నాటికి దేశవ్యాప్తంగా 1.5 లక్షల ఉప ఆరోగ్య కేంద్రాల్ని హెల్త్ అండ్ వెల్‌నెస్ కేంద్రాలుగా తీర్చిదిద్దుతారు. రక్తపోటు, డయాబెటిస్, కేన్సర్, వృద్ధాప్య సంబంధ వ్యాధులకు ఈ కేంద్రాల్లో చికిత్స అందిస్తారు.
► జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం) పథకానికి రూ.31,745 కోట్లు కేటాయించారు.
► ఎన్‌హెచ్‌ఎంలో అంతర్భాగమైన రాష్ట్రీయ స్వస్థ్య బీమా యోజన కు రూ. 156 కోట్లు కేటాయించారు. ఈ మొత్తం గతేడాది కన్నా రూ.1,844 కోట్లు తక్కువ కావడం గమనార్హం.
► ఎయిడ్స్, అసురక్షిత లైంగిక వ్యాధుల నివారణ కార్యక్రమానికి రూ.2,500 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఈ మొత్తం రూ.400 కోట్లు అధికం.
► ఎయిమ్స్‌కు రూ.3,599.65 కోట్లు కేటాయించారు.
► జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమానికి కేటాయింపులను రూ.50 కోట్ల నుంచి రూ.40 కోట్లకు తగ్గించారు.
► కేన్సర్, డయాబెటిస్, హృద్రోగ సంబంధ వ్యాధుల నివారణ, నియంత్రణ కార్యక్రమానికి కేటాయింపులను రూ.295 కోట్ల నుంచి రూ.175 కోట్లకు తగ్గించారు.
► టెర్షరీ కేర్(ప్రత్యేక సంరక్షణ, చికిత్సలు) కార్యక్రమాలకు కేటాయింపులను రూ.750 కోట్ల నుంచి రూ.500 కోట్లకు తగ్గించారు.
► నర్సింగ్ సేవల ఆధునీకరణకు రూ.64 కోట్లు, ఫార్మసీ స్కూల్స్, కళాశాలల బలోపేతానికి రూ.5 కోట్లు, జిల్లా ఆసుపత్రులు, రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కళాశాలల(పీజీ సీట్లు) ఆధునీకరణకు రూ.800 కోట్లు కేటాయించారు.
► ప్రభుత్వ మెడికల్ కళాశాలలు(డిగ్రీ సీట్లు), కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి రూ.1,361 కోట్ల కేటాయింపు. కొత్త వైద్య కళాశాలల స్థాపనకు రూ.2 వేల కోట్లు, రాష్ట్రాల్లో ప్రభుత్వ పారామెడికల్ కళాశాలల ఏర్పాటుకు రూ.20 కోట్లు కేటాయించారు.
‘ఆయుష్మాన్’తో 3 వేల కోట్లు ఆదా: పీయూష్
ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఇప్పటిదాకా ఉచితంగా వైద్యం చేయించుకున్న సుమారు 10 లక్షల మంది పేదలు రూ.3 వేల కోట్లను ఆదాచేసుకున్నారని పీయూష్ గోయల్ చెప్పారు. జన ఔషధి కేంద్రాల ద్వారా ప్రభుత్వం చౌక ధరలకే ఔషధాల్ని అందిస్తోందని, గుండెలో అమర్చే స్టెంట్లు, కృత్రిమ మోకాలి చిప్పల ధరల తగ్గింపుతో లక్షలాది మంది పేదలు ప్రయోజనం పొందారని తెలిపారు. దేశంలో ప్రస్తుతం 21 ఎయిమ్స్ ఆసుపత్రులు పనిచేస్తున్నాయని, అందులో 14 ఆసుపత్రుల్ని ఎన్డీయే ప్రభుత్వమే ప్రారంభించిందని అన్నారు. పేదలకు ఆరోగ్య సేవల్ని చేరువచేసేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని ఉటంకిస్తూ..2030 నాటికి ఎలాంటి అవాంతరాలు లేని సమగ్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఏర్పాటుచేసేలా పనిచేస్తున్నామని వెల్లడించారు. అలాంటి ఆరోగ్య భారత నిర్మాణంలో మహిళలనూ సమాన భాగస్వాముల్ని చేస్తామని తెలిపారు.
దీర్ఘాయుష్మాన్ భవ...
ఇప్పటికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సైతం నోచుకోని పల్లెలున్న భారతమిది. ఇక్కడ నిరుపేదకు సుస్తీ చేస్తే చావే శరణ్యం. కాబట్టి కార్పొరేట్ వైద్యాన్ని సాకారం చేసే సార్వత్రిక ఆరోగ్య బీమానిచ్చే ఏ పథకాన్నయినా దీర్ఘాయుష్మాన్ భవ అంటూ దీవించాల్సిందే. కాకపోతే గత బడ్జెట్‌లో ప్రకటించి ఊరుకున్నారు. ప్రయోగాలకే పరిమితమయ్యారు. ఈ సారి ఎన్నికలొస్తున్నాయి కనక పూర్తి స్థాయి కేటాయింపులు చేస్తూ... వెల్‌నెస్ సెంటర్ల నుంచి ఎయిమ్స్ దాకా పూర్తిస్థాయి వైద్య సదుపాయాల్ని అందుబాటులోకి తెచ్చే విజన్‌నూ ఆవిష్కరించారు. ఏ ప్రభుత్వమున్నా ఆ విజన్ సాకారం కావాలన్నదే నిరుపేదల ఆకాంక్ష. ఎందుకంటే వారికి కావాల్సింది వైద్యం మరి.
ఆరోగ్యం..ఆయుష్మాన్!
Published Sat, Feb 2 2019 4:37 AM | Last Updated on Sat, Feb 2 2019 10:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment