‘ఆశ’ నిరాశల మధ్య..
♦ పెండింగ్‌లో ఆశ కార్యకర్తల పారితోషికాల పెంపు
♦ అధికారుల ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోని రాష్ట్ర ప్రభుత్వం
♦ కేవలం రూ. 3 కోట్లు కేటాయించడానికి వెనుకాడుతున్న వైనం
♦ రెండు నెలలుగా కొనసాగుతున్న సమ్మె
♦ పల్లెల్లో రోగులకు తప్పని ఇక్కట్లు
సాక్షి, హైదరాబాద్: ఆశ కార్యకర్తలపై సర్కారు కరుణ చూపడం లేదు. వారి సమ్మె ను విరమింపచేయాలని, వారికిచ్చే పారితోషికాలను 10% వరకు పెంచాలని ఉన్నతాధికారులు విన్నవించినా ప్రభుత్వ పెద్దల్లో కదలిక లేదు. పరిష్కారం చూపిస్తూ అధికారులు పంపిన ఫైలు కొన్నాళ్లుగా పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఫలితంగా ఆశ కార్యకర్తల సమ్మె 2 నెలలుగా కొనసాగుతూనే ఉంది. సర్కారు తీరుపై వారు మండిపడుతున్నారు.
పల్లెల్లో వైద్య సేవలకు ఆటంకం
వ్యాధుల సీజన్‌లో దాదాపు 25 వేల మంది ఆశ వర్కర్లు సమ్మె చేస్తుండటంతో పల్లెల్లో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడింది. పదేళ్ల క్రితం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్(ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) మార్గదర్శకాల ప్రకారం వీరిని నియమించారు. కుటుంబ నియంత్రణ, ఆసుపత్రిలో కాన్పు, ఇమ్యునైజేషన్ వంటి వాటితోపాటు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో వీరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎయిడ్స్ రోగులకు అవసరమైన సేవలు చేస్తున్నారు. కుష్టు, టీబీ రోగులకు మందులు పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికీ తిరిగి వ్యాధులు గుర్తిస్తున్నారు. ఇంత చేసినా వారికి నామమాత్రపు పారితోషికాలనే సర్కారు ఇస్తోంది. పనిని బట్టి ఒక్కో ఆశ వర్కర్‌కు నెలకు రూ.400 నుంచి రూ.2 వేల వరకు మాత్రమే ఇస్తున్నారు.
పారితోషికాలు కాకుండా కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పెన్షన్, గ్రాట్యుటీ, ప్రసూతి సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రమాద బీమా సౌకర్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నెల జీతం లేకుండా పనిని బట్టి పారితోషికం అంటూ తమతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారనేది కార్యకర్తల ఆరోపణ. కానీ కనీస వేతనం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తోస్తోంది. ఇదిలావుంటే కొందరు వైద్యాధికారుల్లోనూ ఆశ కార్యకర్తల సేవలపై చిన్నచూపు నెలకొంది. ఆశ వర్కర్లు సమ్మె చేస్తే వచ్చే నష్టమేమీ లేదంటున్నారు. ‘‘మనం రోజూ ఉదయాన్నే టీ తాగుతాం. అలా అలవాటు పడిపోయాం. అలాంటిది అకస్మాత్తుగా టీ తాగకుంటే ఏమవుతుంది? అలాగే కొన్నాళ్లపాటు తాగకుండా ఉంటే అలవాటుగా మారుతుంది. అంతకుమించి ఏమీ కాదుగా. అలాగే ‘ఆశ’ల సమ్మెతో వచ్చే నష్టం కానీ... గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు జరిగే ఆటంకం కానీ ఏమీ లే దు’’ కీలక స్థాయిలో ఉన్న ఒక వైద్యాధికారి వ్యాఖ్యానించారంటే ఆశ వర్కర్ల సమస్యలపై కొందరు అధికారుల్లో ఉన్న చిన్నచూపు అర్థమవుతోంది.
రూ. 3 కోట్లు కేటాయించలేరా?
ఆశ వర్కర్లు జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలోకి వస్తారు. తెలంగాణలో పనిచేసే ఆశ వర్కర్ల పారితోషికం, ఇతరత్రా ఖర్చుల కోసం ఎన్‌హెచ్‌ఎం రూ. 30 కోట్లు కేటాయిస్తోంది. అందులో 25 శాతం రాష్ట్రం వాటా. మిగిలిన 75 శాతం కేంద్రం తన వాటాగా భరిస్తుంది. ఆశ వర్కర్లు చేస్తున్న డిమాండ్ ప్రకారం వేతనాల పెంపు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించలేదని.. దీనిపై కేంద్రానికి విన్నవించామని చెబుతున్నారు. అయితే వేతనాల పెంపు కాకపోయినా కనీసం పారితోషికం పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. పారితోషికం పెంపు కోసం కేంద్రం ఇచ్చే నిధుల్లో 10 శాతం కేటాయిస్తే సరిపోతుందని.. ఆ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ. 3 కోట్లు కేటాయిస్తే చాలని వైద్య ఆరోగ్య ఉన్నతాధికారులు ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలో పేర్కొన్నట్లు సమాచారం. కానీ ఆ ఫైలు ముందుకు కదలడం లేదు. కేవలం రూ. 3 కోట్లు చెల్లించే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదా అన్న విమర్శలు వస్తున్నాయి.