మధ్యలో మానేస్తే రూ. 50 లక్షల జరిమానా
- రెండేళ్లు రాష్ట్రంలో పని చేయకుంటే చెల్లించాలి
- స్పెషాలిటీ కోర్సులపై రాష్ట్ర ప్రభుత్వ నిబంధన
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత విద్యా సంవత్సరానికి సూపర్‌స్పెషాలిటీ కోర్సుల(డీఎం, డీసీహెచ్) సీట్ల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పూచీకత్తు నిబంధనను అమల్లోకి తెచ్చింది. సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో చేరేవారు తప్పనిసరిగా రూ.50 లక్షల పూచీ కత్తు (బాండ్)ను సమర్పించాలని పేర్కొంటూ బుధవారం ఉత్త ర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో సూపర్‌స్పెషాలిటీ కోర్సు పూర్తి చేసిన వారు.. తప్పనిసరిగా రెండేళ్లపాటు రాష్ట్రంలో వైద్య సేవలు అందించాలని లేకుంటే రూ.50 లక్షలు చెల్లించాలని నిబంధన పెట్టింది. సూపర్ స్పెషాలిటీ కోర్సులకు ఆర్టికల్ 371(డి) వర్తించదని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందున ప్రభుత్వం ఈ నిబంధన విధించింది.
దేశవ్యాప్తంగా దాదాపు 2,185 సూపర్ స్పెషాలిటీ సీట్లున్నాయి. తెలంగాణలో 152, ఏపీలో 87 సీట్లు ఉన్నాయి. ఆర్టికల్ 371(డి) నేపథ్యంలో తొలి విడత కౌన్సెలింగ్‌లో తెలుగు రాష్ట్రాల్లోని సీట్లను భర్తీ చేయలేదు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రెండో విడత కౌన్సెలింగ్‌లో తెలుగు రాష్ట్రాల సీట్లను భర్తీ చేయనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు ఈ సీట్ల కోసం పోటీ పడను న్నారు. రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌లో సూపర్ స్పెషాలిటీ కోర్సులున్నాయి.
రెండో దశ కౌన్సెలింగ్ మొదలు
2017–18 సూపర్ స్పెషాలిటీ కోర్సుల(డీఎం, డీసీహెచ్) సీట్ల భర్తీ కోసం బుధవారం నుంచి రెండో దశ కౌన్సెలింగ్ మొదలైంది. జాతీయ స్థాయిలో నీట్ ర్యాంకుల ఆధారంగా మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) ఈ ప్రక్రియను నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 6, 7 తేదీల్లో సీట్ల కోసం ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 8న సీట్ల అలాట్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేసి 9న వివ రాలను వెల్లడిస్తారు. కౌన్సెలింగ్‌లో కేటాయించిన ప్రకారం సెప్టెం బర్ 10 నుంచి 14 లోపు అభ్యర్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలి. ఈ మేరకు ఎంసీసీ షెడ్యూల్ విడుదల చేసింది.