ఖాళీలు భర్తీ చేయరా? | Outsourcing was unconstitutional | Sakshi
Sakshi News home page

ఖాళీలు భర్తీ చేయరా?

Published Sun, Sep 18 2016 1:15 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

ఖాళీలు భర్తీ చేయరా? - Sakshi

ఖాళీలు భర్తీ చేయరా?

ఔట్‌సోర్సింగ్ రాజ్యాంగ విరుద్ధం.. తక్షణమే రద్దు చేయండి : హైకోర్టు
- ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయరా?
- ఔట్‌సోర్సింగ్.. ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజీల చట్టానికి విరుద్ధం
- ఉద్యోగ నియామకాలకు ఔట్‌సోర్సింగ్ సరైన విధానం కాదు
- ప్రభుత్వాసుపత్రుల్లో పోస్టులను 6 నెలల్లో భర్తీ చేయండి
- నిధుల కొరతతో ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోజాలదు
- నర్సింగ్, పారా మెడికల్ సేవలు ఔట్‌సోర్సింగ్‌కు వద్దు    
 
 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో అవసరమైన సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ విధానంలో నియమిస్తుండడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయకుండా ఔట్‌సోర్సింగ్ విధానాన్ని ఇంకెన్నాళ్లు కొనసాగిస్తారని నిలదీసింది. తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడాన్ని పరోక్షంగా ప్రశ్నించింది. ఉద్యోగ నియామకాలకు ఔట్‌సోర్సింగ్ సరైన విధానం కాదని తేల్చి చెప్పింది. ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన వైద్య రంగంలో ఈ విధానం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజీల చట్ట నిబంధనలకు సైతం ఇది విరుద్ధమని పేర్కొంది. ఖాళీల భర్తీలో ఔట్‌సోర్సింగ్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇకపై వైద్య రంగంలో నర్సింగ్, పారా మెడికల్ సేవలను ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వొద్దని తెలిపింది. ప్రభుత్వాసుపత్రుల్లో శాశ్వత ప్రాతిపదికన మంజూరు చేసిన పోస్టులను ఆరు నెలల్లో భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు ఇటీవల కీలక తీర్పు వెలువరించారు. అక్రమ నియామకాలు వేలాది మంది నిరుద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీస్తాయంటూ 1994లో తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ (రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్‌మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ పాట్రన్ అండ్ పే స్ట్రక్చర్) చట్టంలో ప్రభుత్వం పేర్కొందని న్యాయమూర్తి గుర్తు చేశారు. వైద్య రంగంలో సేవలందిస్తున్న తమను తొలగిస్తూ ఆయా జిల్లాల ఆసుపత్రులు తీసుకున్న నిర్ణయాలను సవాలు చేస్తూ పలువురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు తీర్పు వెలువరించారు. తీర్పులోని కీలక అంశాలు....

 ఇష్టానుసారంగా నియామకాలా?
 అధికారులు, ఆయాశాఖల అనధికార అధిపతులు తమ ఇష్టాయిష్టాల మేరకు నియామకాలు చేపట్టడం ఆనవాయితీగా మారిపోయింది. ఇది చివరకు సర్వీసుల క్రమబద్ధీకరణ డిమాండ్లకు దారి తీస్తోంది. రోజువారీ వేతన నియామకాలను, తాత్కాలిక నియామకాలను నిషేధిస్తూ 1994లో అప్పటి ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. 2016 ఆగస్టు 8న ఔట్‌సోర్సింగ్ విధానానికి సంబంధించి సమగ్ర మార్గదర్శకాలతో జీవో 151 జారీ అయింది. వైద్యులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించేందుకు సుశిక్షితులైన సిబ్బంది సాయం అవసరం. సరైన వైద్యసాయం పొందడం ప్రజల ప్రాథమిక హక్కు. ప్రజలకు సమర్థవంతమైన వైద్య సేవలనుఅందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆసుపత్రుల్లో ఏ సేవ కూడా ‘ముఖ్యమైనది కాదు’ అని చెప్పడానికి వీల్లేదు. ఈ వ్యాజ్యాల్లో ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు కౌంటర్లు దాఖలు చేశారు. వాటిని పరిశీలిస్తే.. కొత్త పోస్టుల మంజూరు, ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు వెళ్లాయని అర్థమవుతోంది. అయితే, ప్రభుత్వం పోస్టుల భర్తీకి అనుమతినివ్వడానికి బదులు, ఔట్‌సోర్స్ సిబ్బంది సేవలనే ఉపయోగించుకుంటోంది.

 ప్రభుత్వం తప్పించుకోజాలదు
 వైద్య రంగంలో ఖాళీల భర్తీ ఆవశ్యకత గురించి ఇప్పటికే ఇదే హైకోర్టుకు చెందిన ఇరువురు న్యాయమూర్తులు వేర్వేరు సందర్భాల్లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయినా ప్రభుత్వం ఖాళీల భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఔట్‌సోర్సింగ్ వ్యవస్థనే కొనసాగిస్తోంది. వైద్యం కోసం వచ్చే రోగులకు రాజ్యాంగం ప్రకారం మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వాసుపత్రుల్లో ఖాళీలను భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నిధుల కొరత పేరిట ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోజాలదు. జిల్లాలోని ఆసుపత్రి అభివృద్ధి సొసైటీలకు కలెక్టర్లు నేతృత్వం వహిస్తున్నారు. ఆ సొసైటీలకు ప్రభుత్వం నుంచి నిధులు అందడం లేదు. పోస్టులు మంజూరు కాక, నిధులు లేక జిల్లాల్లోని ఆసుపత్రులు నామమాత్రంగా తమ మనుగడ కోసం పనిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పేదలు మరో గత్యంతరం లేక మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.

 అధ్యయనం చేయకుండానే...
 ప్రైవేట్ ఏజెన్సీలు నిర్వహిస్తున్న ప్రజా విధులపై చాలా చర్చే జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తగిన అధ్యయనం చేయకుండానే ‘ఔట్‌సోర్సింగ్’పై ఉత్సాహం చూపుతోంది. దీని ఫలితమే సేవల్లో మెరుగుదల లేకపోవడం, ఉద్యోగం విషయంలో అభద్రతాభావం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ రూల్స్‌లో పోస్టుల భర్తీకి ఔట్‌సోర్సింగ్ ఓ విధానమని ఎక్కడా చెప్పలేదు.  

 తాత్కాలిక పద్ధతిని ప్రోత్సహించరాదు
 రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం... జీవించే హక్కు అందరికీ ఉంది. అందులో భాగమే ఆరోగ్య హక్కు. ప్రజారోగ్యం మెరుగుపడేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. తగిన ఉద్యోగానికి తగిన వ్యక్తుల ఎంపిక అంశంలోనూ ప్రభుత్వానికి బాధ్యత ఉంది. వైద్య సంరక్షణ విషయంలో తాత్కాలిక పద్ధతిని పోత్సహించరాదు. ఔట్‌సోర్సింగ్ అనేది ఓ పద్ధతి కానే కాదు.ప్రభుత్వాసుపత్రుల్లో సాంకేతిక, నర్సింగ్ సిబ్బంది సేవలను ఔట్‌సోర్సింగ్ ద్వారా పొందడం సర్వీసు రూల్స్‌కే కాక ఆంధ్రప్రదేశ్ (రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్‌మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ పాట్రన్ అండ్ పే స్ట్రక్చర్) చట్టం-1994 ఉద్దేశాలకు, లక్ష్యాలకు కూడా విరుద్ధం. సమాన అవకాశాలన్న రాజ్యాంగ అధికరణకు, ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజీల చట్ట నిబంధనలకు కూడా వ్యతిరేకమే.
 
 పోస్టుల భర్తీలో పిటిషనర్లకు ప్రాధాన్యం ఇవ్వాలి
 ఖాళీల భర్తీకి ఆయా ఆసుపత్రులు ప్రతిపాదనలు పంపినా.. వైద్యం వంటి ముఖ్యమైన రంగంలో కూడా ఔట్‌సోర్సింగ్ ద్వారానే సేవలు పొందాలని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుత కేసుల్లో పిటిషనర్ల నియామకం విషయానికొస్తే వారు ఔట్‌సోర్సింగ్ ద్వారా నియమితులయ్యారు. వారు రెగ్యులర్ విధానంలో ఎంపికైన వారు కాదు. అందువల్ల ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుంటూ పిటిషనర్ల సేవలను క్రమబద్ధీకరించాలనే ఆదేశాలు ఇవ్వడం లేదు. ఇక సర్వీసులో పిటిషనర్ల కొనసాగింపు విషయానికొస్తే, ఔట్‌సోర్సింగ్ విధానం ద్వారా వారు కొంతకాలంగా కొనసాగుతూ వస్తున్నారు. ఆయా ఆసుపత్రులకు వారి సేవలు అవసరం.

సర్వీసు క్రమబద్ధీకరణను దొడ్డిదారిన చేపట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆయా ఆసుపత్రుల్లో పోస్టులను భర్తీ చేసే సమయంలో పిటిషనర్ల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో శాశ్వత ప్రాతిపదికనమంజూరు చేయాల్సిన పోస్టులను గుర్తించడంతోపాటు, ఖాళీలను ప్రాధాన్యతల ఆధారంగా భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఔట్‌సోర్సింగ్‌ను రద్దు చేయాలి. ఈ విధానంలో కొనసాగుతున్న పిటిషనర్లను ఖాళీలను భర్తీ చేసేంత వరకూ వారి పోస్టుల్లో కొనసాగనివ్వాలి. పోస్టుల భర్తీ సమయంలో పిటిషనర్లు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వారు అందించిన సేవలకు ప్రభుత్వం వెయిటేజీ ఇవ్వాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement