సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరికరాల మరమ్మతుల కాంట్రాక్టులో అవకతవకలపై నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో అధికారుల్లో కలకలం మొదలైంది. దీనికి సంబంధించి గత ఏప్రిల్ 14న ‘నిర్వహణ’లో దోపిడీ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. కాంట్రాక్టు దక్కించుకున్న టీబీఎస్ సంస్థ పరికరాల మరమ్మతులు సరిగా చేయటంలేదని పలువురు బోధనాసుపత్రుల సూపరింటెండెంట్‌లు రాసిన లేఖలను కూడా ‘సాక్షి’ ప్రచురించింది.
వెయ్యి విలువ చేయని గ్లూకోమీటర్ రూ.5 లక్షలట
ప్రభుత్వాసుపత్రుల్లో రూ.480 కోట్ల విలువైన పరికరాలు ఉన్నట్లు కాంట్రాక్టు దక్కించుకున్న టీబీఎస్ సంస్థ నిర్ధారించింది. వీటి నిర్వహణ కోసం ఏడాదికి 8 శాతం చొప్పున వసూలు చేసింది. కేవలం రూ.900 విలువ చేసే గ్లూకోమీటర్‌ను రూ.5 లక్షలుగా స్వయానా సీఎం కోర్‌డాష్ బోర్డులోనే చూపించి డబ్బులు కొల్లగొట్టినా అధికార వర్గాలు పట్టించుకోలేదు.
కొన్ని వైద్య పరికరాలు వారెంటీలో ఉన్నా నిర్వహణ పేరుతో వాటికీ డబ్బులు వసూలు చేశారు. తాజాగా వెంకటరామరాజు అనే వ్యక్తి టీబీఎస్ సంస్థ అక్రమాలకు పాల్పడిందంటూ ఉమ్మడి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ధర్మాసనం ఏమందంటే..
రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వాసుపత్రుల్లో బయో మెడికల్ పరికరాల నిర్వహణ కాంట్రాక్టు పొందిన టీబీఎస్ టెలిమాటిక్ అండ్ బయో మెడికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.కోట్ల మేర అక్రమాలకు పాల్పడిందని, దీనిపై విచారణ జరపాలంటూ వచ్చిన ఫిర్యాదుపై ఏసీబీ అధికారులు స్పందించకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.
టీబీఎస్ అక్రమాలపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ జరపాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్‌ను గురువారం ఆదేశించింది. 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. పిటిషనర్ ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారని ఏసీబీ న్యాయవాదిని ప్రశ్నించింది. పరిశీలిస్తున్నామని బదులివ్వగా.. ఇంకా పరిశీలించడమేమిటని నిలదీసింది. ఫిర్యాదు వచ్చినప్పుడు దానిపై ప్రాథమిక విచారణ చేయాల్సిన బాధ్యత మీకు లేదా? అని ప్రశ్నించింది.
Comments
Please login to add a commentAdd a comment