సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మెడికల్ అడ్మిషన్ల రిజర్వేషన్లకు చెందిన జీవో 550పై హైకోర్టులో వాదనలు ముగియడంతో తీర్పును తర్వా త వెలువరిస్తామని ధర్మాసనం ప్రకటించింది. దీనిపై మంగళవారం వాదప్రతివాదనలు జరిగాయి. వాదనల సమయంలో చెప్పిన అంశాలను లిఖితపూర్వకంగా సమర్పించాలని ఇరుపక్షాల న్యాయవాదులను ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులు మెరిట్ ప్రాతిపదికపై ఓపెన్ కేటగిరీ సీటు పొంది, ఆ తర్వాత ఆ సీటును వదిలేసుకుని రిజర్వుడ్ కోటా కింద మరో కాలేజీలో సీటు పొందినప్పుడు.. తొలుత వదులుకున్న సీటును రిజర్వుడ్ కేటగిరీ సామాజిక వర్గం అభ్యర్థితోనే భర్తీకి వీలుగా 2001 జూలై 30న అప్పటి ఏపీ ప్రభుత్వం జీవో 550 జారీ చేసింది. ఆ జీవోలోని క్లాజ్–2 అమలును హైకోర్టు నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చి ంది.
దాంతో ఇరు రాష్ట్రాల్లో ఖాళీ అయ్యే ఓపెన్ కేటగిరీ సీట్లను కాలేజీలు ప్రతిభ ఆధారంగానే భర్తీ చేస్తున్నాయంటూ పలువురు హైకోర్టును ఆశ్రయిం చారు. ఖాళీ అయిన సీటును రిజర్వుడ్ కేటగిరీ సామాజికవర్గం అభ్యర్థితో భర్తీ చేస్తే రిజర్వేషన్లు 50 శాతానికి మించి సుప్రీంకోర్టు ఉత్తర్వులకు ఉల్లంఘన అవుతుందని, ఇది రాజ్యాంగంలోని 14, 15(1) అధికరణాలకు వ్యతిరేకమంటూ ఇతరులు కూడా హైకోర్టును ఆశ్రయించారు.
కోర్టులు స్పష్టం చేయలేదు..
ఉద్యోగాలను భర్తీ చేసేప్పుడు పాటించే రోస్టర్ విధానం ఈ సీట్ల భర్తీలో వర్తించదని ధర్మాసనం అభిప్రాయపడింది. పార్కులో పిల్లలు జారుడు బల్లపై జారిన పిల్ల వాడి గుర్తింపు ఆధారంగా ఆ తర్వాత ఎవరు జారుడు బల్లపై జారాలో నిర్ణయిస్తే ఎలాగని ప్రశ్నించింది. రిజర్వుడ్ అభ్యర్థి వదిలిన సీటును ఎవరితో భర్తీ చేయాలో ఇంతవరకూ కోర్టులు స్పష్టం చేయలేదని ధర్మాసనం పేర్కొంది.
ఖాళీ అయిన సీటును తిరిగి అదే సామాజిక వర్గం అభ్యర్థితో భర్తీ చేస్తే రిజర్వేషన్లు 50 శాతానికి మించుతాయని వాదిస్తున్న వారు ఆధారాలు చూపడం లేదని ఏపీ ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ చెప్పారు. స్లైడింగ్ విధానంలో మెరిట్ సీటును రిజర్వుడ్ సామాజికవర్గం అభ్యర్థి వదిలితే తిరిగి అదే సామాజికవర్గంతో భర్తీ చేయాలని పిటిషనర్ న్యాయవాది తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment