చిన్ననాటి రమ్యశ్రీ (ఫైల్) , అరుదైన వ్యాధికి గురైన రమ్యశ్రీ
హైదరాబాద్: ‘నాకు బతకాలని ఉంది. వైద్యం అందించి ప్రాణభిక్ష పెట్టండి..’ఎంజైమ్ లోపం కారణంగా అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఓ యువతి ఆక్రందన ఇదీ. తనకు జీవించే హక్కు ఉందని, సరైన వైద్యం అందించడం లేదంటూ ఐదు నెలల క్రితం ఆమె హైకోర్టును ఆశ్రయించింది. దీనికి స్పందించిన న్యాయస్థానం తక్షణమే ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో యంత్రాంగంలో కదలిక వచ్చింది. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ బాధిత యువతికి సమాచారం అందించడంతో ఆమె గురువారం ఆస్పత్రిలో చేరింది. ప్రస్తుతం ఆమెకు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. కాగా, ఆమె వైద్యానికి ఏడాదికి రూ.3.25 కోట్లు ఖర్చు అవుతుందని సమాచారం. అయితే ఈ స్థాయిలో నిధులు ఎలా సమకూర్చుకోవాలో తెలియక ఆస్పత్రి యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది.
జన్యులోపంతో జీవన్మరణ పోరాటం..
నగరంలోని హస్తినాపురానికి చెందిన శ్రీనివాస్, విజయ దంపతుల కుమార్తె మంగిన నాగసాయి రమ్యశ్రీ(19) పుట్టుకతోనే మ్యూకోపొలి శాకరిడోసిస్–6(ఎంపీఎస్–6) అనే అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. పుట్టినప్పుడు ఆరోగ్యంగా ఉన్న రమ్య వయసు పెరుగు తున్న కొద్దీ శరీరంలోని అవయవాల్లో ఎదుగుదల లేదు. ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చూపించినా వ్యాధి నిర్థారణ జరగలేదు. దీంతో వైద్యుల సూచన మేరకు ఢిల్లీలోని సెంట్రల్ ల్యాబొరేటరీలో పరీక్షలు నిర్వహించి ఆమె శరీరంలో నాగల్‌జైమో అనే ఎంజైమ్ లోపం ఉందని, దీంతో శరీరంలోని అవయవాలు క్రమంగా బలహీనపడి మృత్యువుకు చేరువవుతుందని నిర్థారించారు. ఈ ఎంజైమ్‌ను ఇంజెక్షన్ ద్వారా శరీరంలోకి ఎక్కించాలని, దీనిని అమెరికా నుంచి ప్రత్యేకంగా తెప్పించాలని గాంధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ రకమైన ఎంజైమ్ రీప్లేస్‌మెంట్ చికిత్సకు ఏడాదికి రూ.3.25 కోట్ల్ల వ్యయం అవుతుందన్నారు.
వైద్య సేవలు అందిస్తున్నాం:గాంధీ సూపరింటెండెంట్
హైకోర్టుతోపాటు వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రమ్యశ్రీని అడ్మిట్ చేసుకుని వైద్యసేవలు అందిస్తున్నామని గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. వైద్యానికయ్యే ఖర్చు విషయమై అధికారుల ఆదేశాల మేరకు తగిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
నాగల్‌జైమో ఇంజెక్షన్ డేంజర్: నిపుణుల కమిటీ
అమెరికాలో తయారయ్యే నాగల్‌జైమో ఇంజెక్షన్ ప్రాణాంతకమని, ఎంజైమ్ రీప్లేస్‌మెంట్ థెరపీ అత్యంత అనుభవజ్ఞులైన వైద్యులే చేయాలని నిపుణుల కమిటీ తీర్మానించినట్లు తెలిసింది. రమ్యశ్రీ వైద్యానికి సంబంధించి పది మంది వైద్యనిపుణులతో కమిటీని ఏర్పాటు చేయగా, గురువారం సాయంత్రం కమిటీ సభ్యులు సమావేశమై పలు అంశాలపై చర్చించి నివేదిక రూపొందించారు. నాగల్‌జైమో ఇంజెక్షన్‌ను ఇక్కడకు తెప్పించేందుకు అవసరమైన లైసెన్స్ ఇండియన్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఇవ్వలేదని కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ ఇంజెక్షన్ వలన చాలా సైడ్‌ఎఫెక్ట్స్ ఉన్నట్లు, ఎంజైమ్ వినియోగించవద్దని యూరోపియన్ డ్రగ్ కమిటీ రూపొందించిన పత్రాలను నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. రమ్యశ్రీకి నాడీమండల వ్యవస్థ మూసుకుపోతోందని, ఈ సమయంలో నాగల్‌జైమో ఇంజెక్షన్ ఇస్తే ప్రాణాపాయ పరిస్థితి వస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇక ఎంజైమ్ రీప్లేస్‌మెంట్ థెరపీపై ఇక్కడి వైద్యులకు అవగాహన లేదని, అనుభవలేమితో వైద్యం అందించి యువతి ప్రాణాలను పణంగా పెట్టలేమని తమ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. సదరు నివేదికను శుక్రవారం హైకోర్టుకు సమర్పించేందుకు వైద్యశాఖ ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు.
అమెరికా వెళ్లి చదువుకుంటా..: రమ్యశ్రీ
ప్రస్తుతం తాను ఇందిరాగాంధీ నేషనల్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు రమ్యశ్రీ తెలిపింది. మనదేశంలో సరైన వైద్యం అందకుంటే తనకు మెడికల్ వీసాపై అమెరికా పంపిస్తే అక్కడ వైద్యం చేయించుకుంటూ ఉన్నతవిద్య అభ్యసిస్తానని ఆమె ఆత్మవిశ్వాసంతో చెపుతోంది. ప్రధాని మోదీని కలిసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని.. సామాజిక మాధ్యమాల ద్వారా విషయాన్ని ప్రధానికి చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నానని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment