సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణల్లో మెడికల్ సీట్ల భర్తీ సమయంలో రిజర్వేషన్ల అమలు వివాదంపై ఉమ్మడి హైకోర్టు ఎన్టీఆర్/కాళోజీ వైద్య విశ్వవిద్యాలయాల వివరణ కోరింది. రెండు రాష్ట్రాల వైద్య విద్య ప్రవేశాల్లో రిజర్వేషన్లు, ప్రతిభ ఆధారిత కోటా సీట్ల భర్తీలో ఇరువర్గాలు నష్టపోకుండా హైకోర్టు రెండు సూచనలు చేసింది. గతంలో హైకోర్టు ఉత్తర్వుల అమలును అధికారులు గందరగోళపరుస్తున్నారని దాఖలైన వ్యాజ్యాలను ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎన్.బాలయోగిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది.
మొత్తంగా రిజర్వేషన్లు 50 శాతానికి మించుతున్నా యా లేక రిజర్వేషన్ల కేటగిరీ కోటా తగ్గుతోందా, జీవో 550 అమలు గురించి రెండు వైద్య విశ్వవిద్యాలయాలు శుక్రవారం పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశాలిచ్చింది. ప్రతిభ ఆధారంగా మెడికల్ సీటు పొందిన విద్యార్థి ఆ సీటును కాదని రిజర్వేషన్ కోటాలో మరో కాలేజీలో చేరితే, ఖాళీ అయిన సీటును అదే రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థితో భర్తీ చేసినప్పుడు రిజర్వేషన్లు 50 శాతానికి మించుతున్నాయో లేదో స్పష్టం చేయాలని రెండు విశ్వవిద్యాలయాలను ధర్మాసనం ఆదేశించింది. సీటు వదులుకోకుండా (స్లైడింగ్ విధానం అమలు చేయకుండా) ప్రధాన వైద్య కళాశాల్లో సీట్లు భర్తీ చేస్తే ఎలా ఉంటుందో కూడా చెప్పాలని కోరింది.
సీటును తిరిగి రిజర్వేషన్ కేటగిరీలోని ప్రతిభ ఉన్న అభ్యర్థికే కేటాయించినప్పుడు రిజర్వేషన్లు ఎంత శాతానికి పెరుగుతాయి? అలా వదిలి పెట్టిన సీటును జనరల్ కేటగిరీలో ప్రతిభ ఉన్న అభ్యర్థికి కేటాయించితే రిజర్వేషన్ల శాతాలు ఎలా ఉంటాయి? రిజర్వేషన్లు 50 శాతానికి మించుతున్నాయా? తగ్గుతున్నాయా? అనే వివరాలు తెలియజేయాలని కోరింది. 2001 జూలై 30న సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో జీవో 550 జారీ అయింది. జీవోలోని క్లాజ్–2ను హైకోర్టు గతంలో రద్దు చేసిన నేపథ్యంలో జీవో అమల్లో లోపాల కారణంగా తెలంగాణలో 300, ఏపీలో 496 సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు నష్టపోతున్నారనే వ్యాజ్యాలపై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment