సాక్షి, హైదరాబాద్: ‘ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతులు లేవు. సిబ్బంది నియామకంపై దృష్టి పెట్టలేదు. తల్లీబిడ్డల సంరక్షణ అంశాలను అమలు చేయడంలేదు. బాలింతలు, శిశువులు ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మొత్తం మీద ఎన్‌ఆర్‌హెచ్‌ఎం (జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్) కింద రాష్ట్రంలో అమలు చేస్తున్న సంతాన సాఫల్యత, శిశు సంరక్షణ కార్యక్రమం సంతృప్తికరంగా లేదు. రాష్ట్రంలో ఆరోగ్య సేవలు.. భారత ప్రజారోగ్య ప్రమాణాలను (ఐపీహెచ్‌ఎస్) అందుకోలేదు’అని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో వైద్య సేవలు, కుటుంబ సంక్షేమ పథకాల నిర్వహణ సరిగా లేవంది. కేంద్ర నిధులను ఖర్చు చేయడంలోనూ కుటుంబ సంక్షేమ శాఖ విఫలమవుతోందని చెప్పింది.
కాగ్ పేర్కొన్న అంశాలివీ..
మందుల పంపిణీ: పేదలకు అత్యవసర మందులను ఉచితంగా పంపిణీ చేయాల్సిన వైద్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఉచిత అత్యవసర మందుల కోసం 2014–17 మధ్య రూ.83.99 కోట్లు కేటాయిస్తే రూ.10.11 కోట్లే ఖర్చు చేసింది. ఏ ఏడాది నిధులను కూడా పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేదు. నిధుల వినియోగం 2012–14 వరకు కేవలం 38 నుంచి 44 శాతం, 2014–17 వరకు 39 నుంచి 46 శాతం ఉంది.
ప్రసూతి వైద్యం: ప్రసూతి వైద్యం నిధుల వినియోగంలో కొరత 2014–17 మధ్య 31 నుంచి 50 శాతం వరకు ఉంది. పిల్లల ఆరోగ్య పరిరక్షణకు 2014–17 మధ్యలో ఒక్క ఏడాది కూడా 26 శాతం మించి ఖర్చు చేయలేదు. వైద్య సేవల్లో నాణ్యతకు కేటాయించిన మొత్తాలను వినియోగించలేదు. రాష్ట్ర ఆరోగ్య సంఘం దగ్గర రూ.3.12 కోట్లు (99 శాతం) ఖర్చు కాకుండా మిగిలిపోయాయి.
ప్రసవాలు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు తగ్గాయి. 2013–14లో 69 శాతం ఉంటే 2016–17లో 42 శాతానికి తగ్గిపోయాయి. ఇదే సమయంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పులు 31 శాతం నుంచి 58 శాతానికి పెరిగాయి. తెలంగాణలోనే శస్త్ర చికిత్స ద్వారా కాన్పులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. మొత్తం ప్రసవాల్లో 45 శాతం శస్త్ర చికిత్స ద్వారానే జరుగుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇది 67 శాతం వరకు ఉంది.
జనన నిష్పత్తి: 2012–13లో వెయ్యి మగ శిశువుల జననాలకు, 925 మంది ఆడపిల్లల జననాలు నమోదయ్యేవి. 2015–16లో అది 915కు తగ్గిపోయింది. 2016–17లో పరిస్థితి కొంచెం మెరుగుపడి 959కి పెరిగింది.
పిల్లలకు వ్యాధి నిరోధక వైద్యం: ఏడాది లోపు పిల్లలకు వ్యాధి నిరోధక వైద్యం విషయంలో రాష్ట్రం 100 శాతం లక్ష్యాలను సాధించింది. అయితే మిషన్ ఇంద్రధనుష్ కింద డ్రాపౌట్ పిల్లలు కూడా కలిపి లెక్కించారు.
19 పీహెచ్‌సీల్లో సిబ్బంది లేరు: కాగ్ బృందం మూడు జిల్లాల్లోని ఆస్పత్రుల మౌలిక వసతుల పరిస్థితిని తనిఖీ చేసింది. 13వ ఆర్థిక సంఘం గ్రాంటు, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నిధులతో 2012–17 మధ్య నిర్మించిన 21 పీహెచ్‌సీలను పరిశీలిస్తే.. 19 చోట్ల సిబ్బంది లేరు, పరికరాలు లేవు. సబ్‌సెంటర్లలో పురుష సహాయకుల కొరత 100 శాతం, పీహెచ్‌సీలో సిబ్బంది కొరత 43 శాతం ఉంది. తనిఖీ చేసిన వైద్యశాలల్లో సమాచార సాంకేతిక వ్యవస్థ, నెట్‌వర్కింగ్, సిబ్బంది తగినంత లేరు. దీని వల్ల ఆరోగ్య నిర్వహణ సమాచార వ్యవస్థ (హెచ్‌ఎంఐఎస్) పోర్టల్‌కు సమాచారం సకాలంలో అందజేయడంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి.
నాణ్యత సమితులు: వైద్య సేవల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు రాష్ట్ర నాణ్యత హామీ సమితి ఏర్పాటైనా.. తగినన్ని సమావేశాలు నిర్వహించలేదు. జిల్లా నాణ్యత సమితులు ఇంకా ఏర్పాటు కాలేదు. దీంతో వైద్య సేవల పరిస్థితిపై అంచనాలు తెలియడంలేదు.
సమీక్షలు: రాష్ట్రంలో ప్రసూతి మరణాల సమీక్ష (ఎండీఆర్), శిశు మరణాల సమీక్ష (ఐడీఆర్) నిర్వహించడం లేదు. తల్లీపిల్లల మరణాలకు దారితీసేç పరిస్థితులను గుర్తించి ఎన్‌ఆర్‌హెచ్‌ఎం కింద చర్యలు చేపట్టడంలేదు.
ప్రసూతి మరణాల రేటు: ప్రసూతి మరణాల రేటు, ఫెర్టిలిటీ రేటు తగిన స్థాయిలోనే ఉన్నాయి. అయితే ఆదిలాబాద్ (ప్రతి లక్ష మందికి 152), ఖమ్మం (99), మహబూబ్‌నగర్ (98) జిల్లాల్లో ప్రసూతి మరణాల నిష్పత్తి ఎక్కువగా ఉంది. ఇక రాష్ట్ర సగటు 92గా ఉంది. 2015–17లో శిశు మరణాల రేటు (వెయ్యి జననాలకు) 28 ఉంది. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నిర్దేశించిన నిష్పత్తి (25) కంటే ఇది ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఒక్క లక్ష్యాన్నీ సాధించలేదు..
2012–13 నుంచి 2016–17 వరకు రికార్డులను పరిశీలించిన కాగ్ అన్ని అంశాల్లోనూ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం 2005 ఏప్రిల్‌లో మొదలు కాగా, ఆ పథకం కింద సంతాన సాఫల్యత, పిల్లల ఆరోగ్యం, గర్భిణుల ఆరోగ్య పరిరక్షణ, నవజాత శిశువుల రక్షణ, వ్యాధి నిరోధక చికిత్సలు, పోషకాహార లోపాల నివారణ చర్యలు అమలు చేయాలి. కుటుంబ నియంత్రణ, రక్తహీనతకు చికిత్స అందించాలి. సామాజిక ఆరోగ్య కేంద్రాలను పటిష్ట పరిచి అత్యవసర ప్రసూతి వైద్యం అందించాలని ఎన్‌ఆర్‌హెచ్‌ఎం విధివిధానాల్లో స్పష్టం చేశారు. ప్రసూతి మరణాల రేటును 1,00,000:100 కన్నా దిగువకు తగ్గించాలని, పసిపిల్లల మరణాల రేటును 1,000:25కు తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించారు. అయితే వీటిలో ఏ లక్ష్యాన్నీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సాధించలేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment