‘ఢిల్లీ’ వైద్య బృందం ఆకస్మిక తనిఖీ
సిద్దిపేట జోన్: ఢిల్లీ వైద్య బృందం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, మాతా శిశు సంక్షేమ కేంద్రం, హైరిస్క్ కేంద్రం, పొన్నాల పీహెచ్‌సీలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) నిధుల వినియోగం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పథకం నిధులతో అందుతున్న సేవలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తోంది.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ స్థాయి హోదా కలిగిన అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందం సిద్దిపేటకు చేరుకుంది. జాతీయ స్థాయిలోని వైద్య, ఆరోగ్య సంక్షేమ శాఖ నేతృత్వంలో ఏటా జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులకు ఎన్‌ఆర్‌హెచ్‌ఎం కింద నిధులు విడుదలవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సముచిత వైద్య సేవలను అందించడానికి వీటిని వినియోగస్తుంటారు.
ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇండియా డాక్టర్ కె.జె. రామ్, కేంద్ర రీజినల్ డెరైక్టర్ మహేష్, డా. అజిత్ సుడుకె, భారత ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కన్సల్టెంట్‌లు రాజేష్, జనార్ధన్, ఫైనాన్స్ విభాగం కన్సల్టెంట్ గుప్తాతో కూడిన ప్రత్యేక బృందం మొదట మాతా శిశు సంక్షేమ కేంద్రాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా ఆస్పత్రి స్థితిగతులు, వైద్యుల సంఖ్య, ఆస్పత్రిలో అందుతున్న సేవలపై బృందం ఆరా తీసింది. అనంతరం హైరిస్క్ కేంద్రాన్ని సందర్శించి కేంద్రం ఇన్‌చార్జి డా. కాశీనాథ్‌తో పరిస్థితులపై సమీక్షించారు. అత్యవసర వైద్య సేవల కేంద్ర వినియోగం, కేంద్రానికి వచ్చే కేసులు, నిధుల వినియోగం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ఏరియా ఆస్పత్రిని సందర్శించి రికార్డులను పరిశీలించారు.
నిధుల పెంపుపై నివేదిక
బృందం టీమ్ లీడర్, రీజనల్ డెరైక్టర్ డా. మహేష్ మాట్లాడుతూ తెలంగాణ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జాతీయ, గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా మంజూరైన నిధుల వినియోగంపై నివేదిక కోసం రెండు బృందాలు పర్యటిస్తున్నాయన్నారు. వీటిలో ఒక బృందం ఆదిలాబాద్‌లో ఉండగా రెండో బృందం మెదక్ జిల్లాలో పర్యటిస్తుందన్నారు.
మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎన్‌ఆర్‌హెచ్‌ఎం కింద అమలవుతున్న వైద్య సేవలు గురించి వివరాలు సేకరిస్తామన్నారు. ప్రధానంగా ఖాళీల సమస్య, నిధుల శాతాన్ని 20 నుంచి 30కి పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నామన్నారు. ము ఖ్యంగా పిల్లలకు వైద్య సేవలను సముచితంగా ఈ నిధుల ద్వారా అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం కింద మంజూరైన నిధుల వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు.