Government Area Hospital
-
కుట్ల నొప్పి తట్టుకోలేని తల్లి.. ఉరినే భరించింది!
కోల్‌సిటీ (రామగుండం): పెళ్లయిన 11 ఏళ్లకు గర్భం దాల్చి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ తల్లి. సిజేరియనైనా కొడుకు పుట్టాడన్న ఆనందంలో నొప్పిని భరించింది. వారమైనా కుట్లు సరిగ్గా అతుక్కోకపోవడంతో ప్రసూతి వార్డులోనే ఉండాల్సి వచ్చింది. రెండుసార్లు కుట్లేసినా అతుక్కోకపోవడం, ఇన్ఫెక్షన్ తగ్గకపోవడం, మూడోసారి కుట్లేస్తామని వైద్యులు చెప్పడంతో హడలిపోయింది. ఓ పక్క నొప్పి.. మరోపక్క వైద్యుల నిర్లక్ష్యంతో మనోవేదన చెంది ఆదివారం వేకువజామున ప్రసూతి వార్డులోని బాత్రూమ్లో చున్నీతో ఉరేసుకుంది. వెంటనే గమనించి ఉరి నుంచి తప్పించిన కుటుంబీకులు వైద్యులకు సమాచారమిచ్చినా పట్టించుకోకపోవడంతో కళ్లముందే చనిపోయింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. నొప్పితో తల్లడిల్లి.. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం రొంపికుంట గ్రామానికి చెందిన గుమ్మడి ఉమ (29)ను ప్రసవం కోసం ఈ నెల 11న గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేరింది. నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో మర్నాటి రాత్రి ఉమకు సిజేరియన్‌చేసి వైద్యులు మగబిడ్డకు పురుడు పోశారు. ఉమతో పాటు శిశువును ప్రసూతి వార్డుకు తరలించారు. ఉమ (ఫైల్) సిజేరియన్ చేసిన వైద్యులు కుట్లు సరిగా వేయలేదో ఏమోగాని అవి అతుక్కోలేదు. దీంతో ఇన్ఫెక్షన్ వచ్చింది. 18న వైద్యులు రెండోసా రి కుట్లేశారు. అయినా ఇన్ఫెక్షన్ తగ్గలేదు. శనివారం పరిశీలించిన వైద్యులు మరోసారి కుట్లు వేయాల్సి వస్తుందన్నారు. అప్పటికే కుట్లు వేసిన ప్రాంతంలో నొప్పిగా ఉందని తల్లడిల్లిందని ఉమ తల్లి రాజేశ్వరి, అత్త మల్లమ్మ, ఆడబిడ్డ స్వప్న తెలిపారు. వేకువజామున ఉరేసుకొని.. బిడ్డను తన అత్త మల్లమ్మ వద్ద పడుకోబెట్టిన ఉమ.. ఆదివారం వేకువజామున 4.50 సమయంలో బాత్రూమ్కు వెళ్లింది. ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానంతో అత్త, ఆడపడుచు వెళ్లిచూడగా షవర్‌కు చున్నీతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను ఉరి నుంచి తప్పించి బెడ్‌పైకి తరలించారు. విషయం ఆస్పత్రి సిబ్బందికి తెలిపినా ఎవరూ పట్టించుకోలేదని, అరగంటైనా వైద్యులు రాకపోవడంతో చనిపోయిందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో ఆక్సిజన్ అందించి చికిత్స చేస్తే ప్రాణాలు దక్కేవని.. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఉమ తమ కళ్లముందే ప్రాణాలు కోల్పోయిందని చెప్పారు. బాలింత మృతికి ఆస్పత్రి వైద్యులు, సిబ్బందే కారణమని, వాళ్ల నిర్లక్ష్యంతోనే ఇన్ఫెక్షన్ సోకిందని కుటుంబీకులు ఆందోళనకు దిగారు. డీసీహెచ్ఎస్ విచారణ ఉమ మృతిపై డీసీహెచ్ఎస్ డాక్టర్ వాసుదేవరెడ్డి ఆస్పత్రిలో విచారణ చేపట్టారు. ఉమకు సిజేరియన్ చేసిన డాక్టర్, శనివారం రాత్రి డ్యూటీలోని డాక్టర్, సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు యత్నించిందని తెలిసిన తర్వాత సిబ్బంది ఎప్పటిలోగా వెళ్లారు వంటి వివరాలను నమోదు చేసుకున్నారు. మృతురాలి భర్త సంజీవ్‌తో మాట్లాడారు. నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తామని డీసీహెచ్ఎస్ తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం లేదు వైద్యుల నిర్లక్ష్యం లేదు. డీసీహెచ్ఎస్ దర్యాప్తు చేస్తున్నారు. కొందరిలో కుట్లు మానకపోవడమనేది జరుగుతుంది. – డాక్టర్ భీష్మ, ఆర్ఎంవో నా బిడ్డను పొట్టనబెట్టుకున్నారు రెండుసార్లు కుట్లేసినా ఇన్ఫెక్షన్ తగ్గలేదు. మూడోసారి కుట్లు వేస్తామని డాక్టర్లు చెప్పారు. శనివారం రెండు గంటలు లేబర్ రూంలో డ్రెస్సింగ్ చేసి నరకం చూపించారు. లేబర్ రూం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి మంట, నొప్పి అంటూ తల్లడిల్లిపోయింది. ప్రైవేట్‌కు తీసుకుపోవాలనుకున్నాం. ఇంతలోనే ఆత్మహత్య చేసుకుంది. డాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. – రాజేశ్వరి, మృతురాలి తల్లి -
కొండాపూర్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు కరోనా
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలోని నగర వాసులను కరోనా వైరస్ వణికిస్తోంది. ఇటీవల జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కారు డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించిన విషయం తెలిసిందే. తాజాగా కొండాపూర్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. గత మూడు రోజులుగా సూపరింటెండెంట్ అధిక జ్వరంతో బాధ పడుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయనకు పాజిటివ్ అని తేలడంతో అదే హాస్పిటల్లో ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. సూపరింటెండెంట్‌తో ప్రైమరీ కాంటాక్ట్ అయినవారి కోసం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో హాస్పిటల్ సిబ్బంది అందరికి రంగారెడ్డి ఆరోగ్య శాఖ కరోనా టెస్టులు నిర్వహించనుంది. (‘వారిని పశువుల కన్నా హీనంగా చూస్తున్నారు’) -
కాయకల్పలో నంబర్ వన్
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పారిశుధ్య నిర్వహణ, రోగులకు అందుతున్న సేవలకు అరుదైన గౌరవం దక్కింది. ప్రభుత్వం కాయకల్ప అవార్డుకు ఎంపిక చేసింది. రాష్ట్రంలో కామారెడ్డి ఆస్పత్రికి ప్రథమ స్థానం దక్కడం గమనార్హం. ఏరియా ఆస్పత్రుల విభాగంలో బాన్సువాడ ద్వితీయ స్థానంలో నిలవగా.. ఉత్తమ పీహెచ్సీగా భిక్కనూరు, ఉత్తమ అర్బన్ సెంటర్‌గా రాజీవ్‌నగర్ కాలనీ సెంటర్ ఎంపికయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కాయకల్ప అవార్డులను ప్రకటించింది. రెండో తేదీన హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఈ అవార్డులను అందించనున్నారు. కామారెడ్డి ఆసుపత్రికి అవార్డుతో పాటు రూ. 50 లక్షలను అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్యశాఖ కాయకల్ప అవార్డులకోసం రాష్ట్రంలో ఉన్న జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో అందిస్తున్న సేవలకు మార్కులు ఇ చ్చింది. కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రి 89.80 శాతం మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది. 82.80శాతం మార్కులతో సంగారెడ్డి, కొం డాపూర్ జిల్లా ఆస్పత్రులు రెండో స్థానంలో నిలిచాయి. ఏరియా ఆస్పత్రుల్లో.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులలో 92.80 శాతం మార్కులతో భద్రాచలం ఏరియా ఆస్పత్రి ప్రథమ స్థానంలో నిలి చింది. ఈ విభాగంలో కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ ఏరి యా ఆస్పత్రి 89.30 శాతం మార్కులతో ద్వితీ య స్థానం పొందింది. ఉత్తమ పీహెచ్సీగా.. రాష్ట్రంలో ఉత్తమ సేవలందిస్తున్న పీహెచ్ సీలకు సైతం అవార్డులను ప్రకటించారు. ఈ విభాగం లో 96 శాతం మార్కులతో భిక్కనూరు పీహెచ్ సీ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. అర్బ న్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల విభాగంలో 87.50 శాతం మార్కులతో కామారెడ్డి రాజీవ్‌నగర్ కాల నీ అర్బన్ సెంటర్ ప్రథమ స్థానం పొందింది. రేపు అవార్డుల అందజేత రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్ సుల్తాన్ బజార్‌లోని హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమంలో కాయకల్ప అవార్డులను ప్రదానం చేయనున్నారు. సమష్టి కృషితో అవార్డు.. కాయకల్పలో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి రాష్ట్రంలో ప్రథమ స్థానం దక్కినందుకు సంతోషంగా ఉంది. మా ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బంది సమష్టి కృషితో ఈ అవార్డు వచ్చింది. ఈ స్ఫూర్తితో మరింత ఉత్తమ సేవలను అందిస్తాం. ఆస్పత్రి అభివృద్ధికి సహకరిస్తున్న కలెక్టర్, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు. – అజయ్‌కుమార్, డీసీహెచ్ఎస్, కామారెడ్డి -
అద్దెబతుకు.. శ్మశానమే దిక్కు!
సిరిసిల్లటౌన్: కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వృద్ధురాలు చనిపోతే తమ ఇంటికి అరిష్టమని ఇంటి యజమానులు చెప్పడంతో బతికుండగానే ఓ అవ్వను కుటుంబ సభ్యులు శ్మశానానికి తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. స్థానిక ప్రగతినగర్‌కు చెందిన గుంటుకు తులసవ్వ(85) భర్త వెంకటి చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు. తులసవ్వకు ఇద్దరు కూతుళ్లు. చిన్నకూతురు లలిత షోలాపూర్‌లో ఉంటుండగా పెద్దకూతురు శోభ వద్ద ఆమె ఉంటోంది. ప్రగతినగర్‌లో శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో వీరు అద్దెకు ఉంటున్నారు. ఆర్నెల్లుగా తులసవ్వ అనారోగ్యం బారినపడగా పేదరికంలో ఉన్న కూతురు చేతిలో డబ్బు లేక సరైన వైద్యం చేయించలేకపోయింది. మూడురోజులుగా తులసవ్వ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో ఇంటి యజమాని శ్రీనివాస్.. శనివారం మధ్యాహ్నం వృద్ధురాలితోపాటు ఆమె కూతురును తన ఇంట్లోంచి బయటకు గెంటేశాడు. దీంతో వేరే దారిలేక కూతురు శోభ తల్లితోపాటు శ్మశానానికి చేరుకుంది. వీరి దీన స్థితిని చూసి చలించిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు. ఎస్సై శేఖర్ వెంటనే ఇంటి యజమాని శ్రీనివాస్‌కు కౌన్సెలింగ్ ఇచ్చారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న తులసవ్వను జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. -
ప్రసవానికి వస్తే ప్రాణం పోయింది
పండంటి బాబుకు జన్మనిచ్చి ప్రాణాలొదిలిన మహిళ వైద్యుల నిర్లక్ష్యంతోనేనని బంధువుల ఆరోపణ తీవ్ర రక్తస్రావంతో మృతిచెందినట్లు వైద్యుల వివరణ భద్రాచలంటౌన్ : భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రసవానికి వచ్చిన ఓ మహిళ మగశిశువుకు జన్మనిచ్చాక తీవ్ర రక్తస్రావంతో మృతిచెందిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. పట్టణంలోని రామాలయ సమీపంలో నివాసముంటున్న శ్రీరాముల రమ్య(22) రెండో కాన్పు కోసం మూడు రోజుల క్రితం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికు వచ్చింది. సోమవారం మధ్యాహ్నం ఆమెకు వైద్యులు శస్త్ర చికిత్స చేయగా మగశిశువుకు జన్మనిచ్చింది. అనంతరం వార్డుకు తరలించగా రమ్యకు తీవ్రంగా రక్తస్రావం అవుతుండటాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే వైద్యులకు సమాచారమిచ్చారు. వైద్యులు వచ్చి చూసేసరికే రమ్య అపస్మారక స్థితిలోకి వెళ్లింది. పరిస్థితి విషమించడంతో వైద్యులు బాధిరాలి కుటుంబసభ్యులకు పరిస్థితి వివరించి అనంతరం వారి అనుమతితో పట్టణంలోని బస్టాండ్‌కు ఎదురుగా ఉన్న ప్రైవేట్ ఎమర్జెన్సీ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూనే సోమవారం రాత్రి రమ్య మృతిచెందింది. కాగా వైద్యుల నిర్లక్ష్యంతోనే రమ్య మృతిచెందిందని ఆమె భర్త కృష్ణ మంగళవారం ఆరోపించాడు. అప్పటి వరకు బాగున్న రమ్య ఆపరేషన్ అనంతరమే మృతిచెందిందని, ఇందుకు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వైద్యులే బాధ్యులని అన్నారు. తీవ్ర రక్తస్రావంతోనే రమ్య మృతి : డాక్టర్ కోటిరెడ్డి, సూపరింటెండెంట్, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డిని ఈ విషయమై ‘సాక్షి’ వివరణ కోరగా ఆపరేషన్ అనంతరం జరిగిన తీవ్ర రక్తస్రావంతోనే రమ్య మృతి చెందిందన్నారు. ప్రసవం అనంతరం గర్భసంచి మూసుకుపోతుందని, కానీ రమ్య విషయంలో గర్భసంచి ఆ విధంగా జరగకపోవడంతో తీవ్ర రక్త స్రావమైందని, ఇలాంటి కేసులు అరుదుగా జరుగుతుంటాయన్నారు. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఏమి లేదని, రమ్యను చివరి నిమిషం వరకు కాపాడటానికి తమ వంతు కృషి చేశామని వివరించారు. -
మరోసారి ఇలా జరగొద్దు
చేవెళ్ల: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల సమయంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆరా తీశారు. ‘ఆపరేషన్ కష్టాలు’, బెడ్లు సరిపోక ఇబ్బందులకు గురైన మహిళలు’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ఈనెల 23న ప్రచురితమైన వార్తకు ఆయన స్పందించారు. బుధవారం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చి ఈవిషయంపై ఇంచార్జి వైద్యాధికారి డాక్టర్ రాజేంద్రప్రసాద్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పలు మండలాలకు చెందిన మహిళలకు ఒకేసారి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం, బెడ్లు, వసతులు సరిపోకపోవడంతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన ఎమ్మెల్యే యాదయ్య దృష్టికి తీసుకొచ్చారు. మరోసారి అలా జరగొద్దని ఎమ్మెల్యే చెప్పారు. ఆపరేషన్ల కోసం వచ్చే మహిళలకు సరైన వసతులు, వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. ఈ విషయంపై తాను జిల్లా వైద్యాధికారులతో మాట్లాడతానని తెలిపారు. బెడ్లు, వసతులు సరిపోని పక్షంలో ఒక్కో మండలవాసులకు ఒక్కోరోజు ఆపరేషన్లు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య వైద్యులకు సూచించారు. -
‘ఢిల్లీ’ వైద్య బృందం ఆకస్మిక తనిఖీ
సిద్దిపేట జోన్: ఢిల్లీ వైద్య బృందం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, మాతా శిశు సంక్షేమ కేంద్రం, హైరిస్క్ కేంద్రం, పొన్నాల పీహెచ్‌సీలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) నిధుల వినియోగం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పథకం నిధులతో అందుతున్న సేవలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ స్థాయి హోదా కలిగిన అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందం సిద్దిపేటకు చేరుకుంది. జాతీయ స్థాయిలోని వైద్య, ఆరోగ్య సంక్షేమ శాఖ నేతృత్వంలో ఏటా జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులకు ఎన్ఆర్హెచ్ఎం కింద నిధులు విడుదలవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సముచిత వైద్య సేవలను అందించడానికి వీటిని వినియోగస్తుంటారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇండియా డాక్టర్ కె.జె. రామ్, కేంద్ర రీజినల్ డెరైక్టర్ మహేష్, డా. అజిత్ సుడుకె, భారత ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కన్సల్టెంట్లు రాజేష్, జనార్ధన్, ఫైనాన్స్ విభాగం కన్సల్టెంట్ గుప్తాతో కూడిన ప్రత్యేక బృందం మొదట మాతా శిశు సంక్షేమ కేంద్రాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా ఆస్పత్రి స్థితిగతులు, వైద్యుల సంఖ్య, ఆస్పత్రిలో అందుతున్న సేవలపై బృందం ఆరా తీసింది. అనంతరం హైరిస్క్ కేంద్రాన్ని సందర్శించి కేంద్రం ఇన్చార్జి డా. కాశీనాథ్‌తో పరిస్థితులపై సమీక్షించారు. అత్యవసర వైద్య సేవల కేంద్ర వినియోగం, కేంద్రానికి వచ్చే కేసులు, నిధుల వినియోగం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ఏరియా ఆస్పత్రిని సందర్శించి రికార్డులను పరిశీలించారు. నిధుల పెంపుపై నివేదిక బృందం టీమ్ లీడర్, రీజనల్ డెరైక్టర్ డా. మహేష్ మాట్లాడుతూ తెలంగాణ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జాతీయ, గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా మంజూరైన నిధుల వినియోగంపై నివేదిక కోసం రెండు బృందాలు పర్యటిస్తున్నాయన్నారు. వీటిలో ఒక బృందం ఆదిలాబాద్‌లో ఉండగా రెండో బృందం మెదక్ జిల్లాలో పర్యటిస్తుందన్నారు. మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎన్ఆర్హెచ్ఎం కింద అమలవుతున్న వైద్య సేవలు గురించి వివరాలు సేకరిస్తామన్నారు. ప్రధానంగా ఖాళీల సమస్య, నిధుల శాతాన్ని 20 నుంచి 30కి పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నామన్నారు. ము ఖ్యంగా పిల్లలకు వైద్య సేవలను సముచితంగా ఈ నిధుల ద్వారా అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఎన్ఆర్హెచ్ఎం కింద మంజూరైన నిధుల వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. -
ఆస్పత్రి ఆధునికీకరణకు రూ. 23 కోట్లు
భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఆధునికీకరణకు ప్రభుత్వం రూ. 23 కోట్ల నాబార్డు నిధులు విడుదల చేసిందని ఐటీడీఏ పీఓ వీరపాండియన్ అన్నారు. గురువారం ఏరియా ఆస్పత్రిని సందర్శించిన ఆయన భవన నిర్మాణాలు చేపట్టాల్సిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ నాబార్డు నిధులతో భవన నిర్మాణాలతో పాటు ఆహ్లాదాన్నిచ్చే మొక్కలు నాటాలని, ఆస్పత్రిని సుందరంగా తీర్చిదిద్దాలని అన్నారు. లే-అవుట్ ఫిక్షేషన్లో నూతన భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణ అందంగా తీర్చిదిద్దేందుకు లాన్‌గ్రాస్, కూర్చునేందుకు బల్లాలు, అందమైన మొక్కలు ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదనలు ఉండాలని హార్టీకల్చర్ అధికారులను ఆదేశించారు. వాహనాల పార్కింగ్ కోసం షెడ్లు, స్టోర్‌రూంలు ఉండేలా, ఆస్పత్రిలో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణంతో పాటు ముఖ్యమైన మౌళిక సదుపాయాలు ఉండేలా చూడాలని ఆదేశించారు. ఆయన వెంట అదనపు జిల్లా వైద్యాధికారి పి పుల్లయ్య, ఏపీఓ అగ్రికల్చర్ వై నారాయణరావు, టీఏ బీవీవీ గోపాలరావు, యుగంధర్, శ్రీనాధ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.