ప్రసవానికి వస్తే ప్రాణం పోయింది
పండంటి బాబుకు జన్మనిచ్చి ప్రాణాలొదిలిన మహిళ
వైద్యుల నిర్లక్ష్యంతోనేనని బంధువుల ఆరోపణ
తీవ్ర రక్తస్రావంతో మృతిచెందినట్లు వైద్యుల వివరణ
భద్రాచలంటౌన్ : భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రసవానికి వచ్చిన ఓ మహిళ మగశిశువుకు జన్మనిచ్చాక తీవ్ర రక్తస్రావంతో మృతిచెందిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. పట్టణంలోని రామాలయ సమీపంలో నివాసముంటున్న శ్రీరాముల రమ్య(22) రెండో కాన్పు కోసం మూడు రోజుల క్రితం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికు వచ్చింది. సోమవారం మధ్యాహ్నం ఆమెకు వైద్యులు శస్త్ర చికిత్స చేయగా మగశిశువుకు జన్మనిచ్చింది.
అనంతరం వార్డుకు తరలించగా రమ్యకు తీవ్రంగా రక్తస్రావం అవుతుండటాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే వైద్యులకు సమాచారమిచ్చారు. వైద్యులు వచ్చి చూసేసరికే రమ్య అపస్మారక స్థితిలోకి వెళ్లింది. పరిస్థితి విషమించడంతో వైద్యులు బాధిరాలి కుటుంబసభ్యులకు పరిస్థితి వివరించి అనంతరం వారి అనుమతితో పట్టణంలోని బస్టాండ్‌కు ఎదురుగా ఉన్న ప్రైవేట్ ఎమర్జెన్సీ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూనే సోమవారం రాత్రి రమ్య మృతిచెందింది. కాగా వైద్యుల నిర్లక్ష్యంతోనే రమ్య మృతిచెందిందని ఆమె భర్త కృష్ణ మంగళవారం ఆరోపించాడు. అప్పటి వరకు బాగున్న రమ్య ఆపరేషన్ అనంతరమే మృతిచెందిందని, ఇందుకు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వైద్యులే బాధ్యులని అన్నారు.
తీవ్ర రక్తస్రావంతోనే రమ్య మృతి :
డాక్టర్ కోటిరెడ్డి, సూపరింటెండెంట్, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డిని ఈ విషయమై ‘సాక్షి’ వివరణ కోరగా ఆపరేషన్ అనంతరం జరిగిన తీవ్ర రక్తస్రావంతోనే రమ్య మృతి చెందిందన్నారు. ప్రసవం అనంతరం గర్భసంచి మూసుకుపోతుందని, కానీ రమ్య విషయంలో గర్భసంచి ఆ విధంగా జరగకపోవడంతో తీవ్ర రక్త స్రావమైందని, ఇలాంటి కేసులు అరుదుగా జరుగుతుంటాయన్నారు. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఏమి లేదని, రమ్యను చివరి నిమిషం వరకు కాపాడటానికి తమ వంతు కృషి చేశామని వివరించారు.