సాక్షి, అమరావతి బ్యూరో : ఆయుష్ శాఖలో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఆయుష్ పారా మెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం ఆర్‌అండ్‌బీ విశ్రాంతి గృహం వద్ద జగన్ ను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్‌ఆర్‌ఎం) పథకం కింద ఆయుష్ వైద్యశాలల్లో రెగ్యులర్ డాక్టర్లు లేరన్న కారణంతో 800 మంది పారామెడికల్ ఉద్యోగులను తొలగించారని, ప్రభుత్వం తక్షణమే తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, తొలగించిన వారిని విధుల్లోకి తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని జగన్ కు విజ్ఞప్తి చేశారు.
సోమవారం ఉదయం గెస్ట్‌హౌస్ నుంచి అసెంబ్లీకి బయల్దేరిన వైఎస్ జగన్ పెనుమాక, కృష్ణాయపాలెం గ్రామాల్లో తన రాక కోసం వేసిచూస్తున్న వృద్ధులను, మహిళలను, విద్యార్థినులను కలిసి ఆప్యాయంగా పలకరించారు. విద్యార్థులకు ఆటోగ్రాఫ్ ఇచ్చారు. వృద్ధుల క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ నుంచి సాయంత్రం గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నాక.. అక్కడ జగన్ కోసం వేచి ఉన్న యువతను పలకరించి సెల్ఫీలు దిగారు. అనంతరం ఎమ్మెల్యేలు, నాయకులతో ఆయన బిజీగా గడిపారు.