‘ఆరోగ్య మిషన్’కు సుస్తీ | 'Health Mission' motionsickness | Sakshi
Sakshi News home page

‘ఆరోగ్య మిషన్’కు సుస్తీ

Published Sat, Aug 2 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM

‘ఆరోగ్య మిషన్’కు సుస్తీ

‘ఆరోగ్య మిషన్’కు సుస్తీ

  • జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ నిధుల వినియోగంలో నిర్లక్ష్యం
  •  గత ఏడాది నిధులు ఖర్చుచేయని పంచాయతీలకు ఈ సారి మొండిచేయి
  •  గ్రామాల్లో పడకేసిన పారిశుద్ధ్యం     
  •  పట్టించుకోని వైద్యాధికారులు
  • మచిలీపట్నం : వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా విడుదలైన నిధులు నిరుపయోగంగా మారాయి. పీహెచ్‌సీలకు విడుదలైన ఈ నిధుల ఖర్చుపై పర్యవేక్షణ లోపించడం, గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టకపోవడంతో వీధులన్నీ మురుగు, చెత్తతో దర్శనమిస్తున్నాయి. సర్పంచుల హవా కొనసాగుతున్న కొన్ని పంచాయతీల్లో ఈ నిధులు స్వాహా అవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

    జిల్లాలో 969 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో వర్షాకాలంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా ఒక్కొక్క పంచాయతీకి రూ.10 వేల చొప్పున నిధులు విడుదలవుతాయి. ఈ నిధులు పంచాయతీలో పనిచేసే సబ్‌సెంటరు, ఏఎన్‌ఎం, పంచాయతీ కార్యదర్శి జాయింట్ అకౌంట్‌లో పీహెచ్‌సీ ద్వారా జమ చేయాల్సి ఉంది. ఈ నగదుతో వర్షాకాలంలో నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లించడం, తాగునీటి కుండీలను శుభ్రపరచడం, శుద్ధి చేసిన తాగునీటిలో క్లోరినేషన్ చేయించడం వంటి పనులు చేయాలి.

    జిల్లా వ్యాప్తంగా 86 పీహెచ్‌సీలు ఉండగా జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా విడుదలైన నిధులు ఆయా పీహెచ్‌సీల ఖాతాల్లోకి వెళ్లాయి. కొన్ని చోట్ల గత ఏడాది విడుదలైన నిధులే ఖర్చు చేయని పరిస్థితి నెలకొంది. మరికొన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో లేకపోవడంతో ఈ నిధులను డ్రా చేసే పరిస్థితి లేకుండాపోయింది. ఈ నెల 5వ తేదీ నుంచి గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరిచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. దీని కోసం జిల్లాలోని పలు మండలాల్లో రెండు రోజులుగా పారిశుద్ధ్యం మెరుగుదలకు పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు గ్రామైక్య సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే జాతీయ ఆరోగ్యమిషన్ నిధులను ఖర్చు చేసేందుకు ఆయా పీహెచ్‌సీల్లో ప్రజాప్రతినిధులతో ఇంత వరకు సమావేశాలు ఏర్పాటు చేయకపోవటం గమనార్హం.
     
    మచిలీపట్నం మండలంలోని 34 పంచాయతీలకు 14 మంది కార్యదర్శులే ఉన్నారు. జాతీయ ఆరోగ్యమిషన్ ద్వారా విడుదలైన నిధులు కొన్ని పంచాయతీలకు ఇంకా చేరనేలేదు. వర్షాకాలంలో దోమల వ్యాప్తి ఇప్పటికే పెరిగింది. అయినప్పటికీ ఆరోగ్యమిషన్ నిధులతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టేందుకు చర్యలు తీసుకున్న వారే లేరు. ఈ నిధులు ఎక్కడున్నాయో, ఎలా ఖర్చు చేయాలో పట్టించుకోని దాఖలాలు నెలకొన్నాయి.
     
    కృత్తివెన్ను మండలంలోని 16 పంచాయతీలకు గత ఏడాది ముగ్గురు పంచాయతీ కార్యదర్శులే ఉన్నారు. దీంతో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా పంచాయతీలకు విడుదలైన నిధులను ఖర్చు చేయలేదు. గత ఏడాది నిధులు ఖర్చు చేయకపోవటంతో ఈ సంవత్సరం నిధులు నిలిచిపోయాయి. ఇంతా జరుగుతున్నా పీహెచ్‌సీ వైద్యులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది.
     
    నందిగామ మండలంలోని పంచాయతీలకు నిధులు విడుదలైనా అరకొరగా ఖర్చు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారి వర్షపునీరు ఇళ్ల మధ్య నిలిచి, దోమలు ప్రబలుతున్నాయి. అయితే వాటి నిర్మూలనకు తీసుకున్న చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
     
    మైలవరం మండలంలోని గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టేందుకు నిధులు విడుదలైనా వాటిని ఖర్చు చేసేందుకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ నిధులను ఖర్చు చేసే విషయంలో ఎంపీపీలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాల్సిన ప్రజాప్రతినిధులు నిధుల వినియోగంలో తమ మాటే నెగ్గాలని పంతాలకు పోవడం గమనార్హం.
     
    గూడూరు మండలంలో 27 పంచాయతీలకు గత ఏడాది విడుదలైన నిధులను 12 పంచాయతీల్లో ఖర్చు చేశారు. మిగిలిన 15 పంచాయతీల్లో నిధులు అలానే ఉండిపోయాయి. దీంతో ఈ ఏడాది నిధుల విడుదల నిలిచిపోయింది.
     
    గుడివాడ మండలంలో 21 పంచాయతీలకు గత ఏడాది రూ 2.10 లక్షలు విడుదలవగా పది పంచాయతీల్లో నిధులు వినియోగించలేదు. దీంతో ఈ సంవత్సరం నిధులు విడుదల కాలేదు. దీంతో మండలంలోని గ్రామాల్లో పారిశుద్ధ్యం ఆధ్వానంగా మారింది.
     
    నందివాడ మండలంలో 23 పంచాయతీలకు నిధులు విడుదలైనా ఐదు పంచాయతీల్లోనే ఖర్చు చేశారు. మిగిలిన పంచాయతీల్లో ఈ నిధులను ఖర్చు చేయకుండా, గ్రామాల్లో పారిశుద్ద్య చర్యలు చేపట్టకుండా జాప్యం చేశారు. 2012 సంవత్సరం నుంచి ఈ మండలంలో జాతీయ ఆరోగ్య మిషన్  నిధులను ఖర్చు చేయకుండా ఉంచటం గమనార్హం.
     
    అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, అవనిగడ్డ మండలాల్లో 91 పంచాయతీలు ఉన్నాయి. గత ఏడాది వీటికి రూ. 9.10 లక్షల నిధులు విడుదలవగా రూ.2.50 లక్షలు నిధులను వినియోగించలేదు. ఈ ఏడాది జాతీయ ఆరోగ్యమిషన్ ద్వారా ఇంకా నిధులు విడుదల కాలేదు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement