78 జీవోను రద్దు చేయాలి
- - అసెంబ్లీలో రోజా డిమాండ్
తిరుపతి : తిరుపతిలో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి అనుబంధంగా నిర్మించిన 300 పడకల ఆస్పత్రిని స్విమ్స్‌కు అప్పగించడాన్ని నగరి శాసనసభ్యురాలు ఆర్‌కే.రోజా తీవ్రంగా వ్యతిరేకించారు. ఆందుకు సంబంధించిన జీవో 78ని రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో రోజా మెటర్నిటీ ఆస్పత్రి అంశాన్ని లేవనెత్తారు. రాయలసీమకు తలమానికంగా ఉన్న తిరుపతి ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రి పేద మహిళలకు విశిష్ట సేవలు అందిస్తోందన్నారు.
ఆస్పత్రికి కాన్పుల కోసం వచ్చే గర్భిణీలు, గైనిక్ సంబంధ జబ్బులతో వచ్చే మహిళారోగుల సంఖ్య విపరీతంగా పెరిగిన నేపథ్యంలో గతంలో జీవోనెంబర్ 87 ద్వారా నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ నిధులతో 300 పడకల ఆస్పత్రి మంజూరైందన్నారు. అయితే ఆ ఆస్పత్రిని జీవో 78 ద్వారా కార్పొరేట్ సేవలకు ప్రతీకగా ఉన్న స్విమ్స్‌కు అప్పగించడం అనుచితమైన చర్యగా రోజా పేర్కొన్నారు.
జీవో 78ని రద్దు చేసి 300 పడకల భవనాన్ని మెటర్నిటీ ఆస్పత్రికి అనుబంధంగానే కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు. జీవో 78 కి వ్యతిరేకంగా మూడు వారాలుగా జూనియర్ డాక్టర్ల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళనను ఆమె ఈసందర్భంగా గుర్తు చేశారు.