‘ఆశ’ గోస చూడండి! | Regarded medical health proposal | Sakshi
Sakshi News home page

‘ఆశ’ గోస చూడండి!

Published Mon, Oct 12 2015 3:50 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM

‘ఆశ’ గోస చూడండి! - Sakshi

‘ఆశ’ గోస చూడండి!

♦ ‘ఆశ’ వర్కర్ల పారితోషికంపై కేంద్రానికి నివేదన
♦ ఎంతోకొంత పెంచాలంటూ వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదన
♦ నెల రోజులుగా జరుగుతున్న సమ్మెకు తెరదించాలని నిర్ణయం    
♦ నికర వేతనం పెంపు అసాధ్యమంటున్న అధికారులు
 
 సాక్షి, హైదరాబాద్: ‘ఆశ’ వర్కర్లు నెల రోజులుగా చేస్తున్న సమ్మెకు తెరదించాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. వారి పారితోషికం పెంపు డిమాండ్‌ను కేంద్రానికి నివేదించాలని నిర్ణయించింది. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలోకి ఆశ వర్కర్లు వస్తారని... దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు. సమ్మెను విరమింపజేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయన్న విమర్శలున్నాయి. సమ్మెను ఉధృతం చేసిన ఆశ వర్కర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపి పెద్దఎత్తున అరెస్టులు చేసింది. అయినా సమ్మెను కొనసాగించేందుకే ఆశ వర్కర్లు సిద్ధమయ్యారు.

 వెట్టిచాకి రిలో వర్కర్లు
 దాదాపు 25 వేల మంది చేస్తున్న సమ్మెతో గ్రామాలు వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్నాయి. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, విషజ్వరాలతో పల్లెలు గజగజ వణుకుతున్న తరుణంలో సమ్మె మరింత ఇబ్బందిగా మారింది. పారితోషికాలు కాకుండా కనీస వేతనం రూ. 15 వేలు ఇవ్వాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. నెల జీతం లేకుండా పనిని బట్టి పారితోషికం అంటూ తమను వెట్టిచాకిరీ చేయిస్తున్నారని వాపోతున్నారు. పదేళ్ల క్రితం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ మార్గదర్శకాల ప్రకారం నియమితులైన వీరు.. కుటుంబ నియంత్రణ, ఆసుపత్రిలో కాన్పు, ఇమ్యునైజేషన్ వంటి వాటితోపాటు కేంద్ర కార్యక్రమాలను జయప్రదం చేస్తున్నారు. అలాగే 104, 108, ఆరోగ్యశ్రీ పథకాలకు సహకరిస్తున్నారు. హెచ్‌ఐవీ రోగులకు సేవలు చేస్తున్నారు. కుష్ఠు, టీబీ రోగులకు మందుల పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికీ తిరిగి ప్రజలకు వచ్చే వ్యాధులను గుర్తిస్తున్నారు. ఇంత చేసినా వారికి పనిని బట్టి నెలకు 400 నుంచి రూ. 2 వేల వరకే ఇస్తున్నారు.

 రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించాలి
 కేంద్ర ప్రభుత్వ పథకం అయినందున పారితోషికం పెంచడం సాధ్యం కాదని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. తమిళనాడులో అసలు ఆశ వర్కర్లు లేరని, వీరి స్థానంలో ఏఎన్‌ఎంలే సేవలందిస్తున్నారని అంటున్నారు. ఏఎన్‌ఎంలు అయితే ప్రాథమిక చికిత్సలో శిక్షణ కలిగి ఉంటారని... ఆశ వర్కర్లు కేవలం ఇంటింటికి తిరిగి వ్యాధులను గుర్తించడం వరకే పరిమితమవుతారని అధికారులు చెబున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్య సేవల్లోనే ఆశ వర్కర్లు పనిచేస్తున్నందున తెలంగాణ సర్కారే కనీస వేతనం పెంచాలని తెలంగాణ వాలంటరీ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించాల్సిందేనని ఆమె అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement