ఆయుష్ ప్రైవేటు ఫీజులు పెంపు
- బీ-కేటగిరీ సీట్లకు రూ.42 వేల నుంచి రూ.50 వేలు
- సీ-కేటగిరీ సీట్లకు రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఆయుష్ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని సీట్ల ఫీజులను పెంచుతూ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. 2011 తర్వాత ఈ ఏడాది ఫీజులను పెంచారు. ప్రైవేటు ఆయుష్ మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా (50 శాతం) సీట్ల ఫీజును మాత్రం పెంచలేదు. గతంలో ఉన్నట్లుగానే రూ.21 వేలు ఏడాదికి వసూలు చేస్తారు. బీ-కేటగిరీ (10 శాతం) సీట్లకు గతంలో ఉన్న రూ.42 వేలను ఇప్పుడు రూ.50 వేలకు పెంచారు. రూ.లక్ష ఉన్న సీ-కేటగిరీ (40 శాతం) సీట్ల ఫీజును రూ.1.25 లక్షలకు పెంచారు. పెంచిన ఫీజులు ఈ ఏడాది అడ్మిషన్ల నుంచి అమలులోకి వస్తాయి. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ఎటువంటి క్యాపిటేషన్ ఫీజును వసూలు చేయకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కోర్సు ప్రారంభంలోనే ఫీజును వసూలు చేసుకోవాలని యాజమాన్యాలకు ప్రభుత్వం సూచించింది. ఒకేసారి కానీ... వాయిదా పద్ధతిలో కానీ వసూలు చేసుకోవచ్చని పేర్కొంది.
తొలి విడత వెబ్ కౌన్సెలింగ్ పూర్తి...
కాళోజీ నారాయణరావు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆయుష్ కోర్సులకు శుక్రవారం వెబ్ కౌన్సెలింగ్ పూర్తయింది. విద్యార్థుల ఆప్షన్లకు అనుగుణంగా సీట్ల కేటాయింపు పూర్తి చేశారు. మొత్తం 1,800 మంది కౌన్సెలింగ్‌కు హాజరుకాగా... వారి ర్యాంకుల ప్రకారం సీట్ల కేటాయింపు చేసినట్లు వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఏ, బీ కేటగిరీ సీట్లకు కూడా తామే కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. సీ కేటగిరీ సీట్లను ప్రైవేటు కాలేజీలు నింపుకోవడానికి వీలుంది. ప్రభుత్వ కాలేజీల్లో ఆయుర్వేద, హోమియో కోర్సులకు 100 చొప్పున సీట్లున్నాయి. రెండు ప్రైవేటు కాలేజీల్లో కలిపి 200 సీట్లున్నాయి. వెబ్ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు వచ్చే నెల ఒకటో తేదీ సాయంత్రం 4 గంటల్లోగా వారికి కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుందని వీసీ తెలిపారు. సీట్లు మిగిలితే రెండో విడత కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తామన్నారు. 15 రోజుల్లోగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.