‘ఫ్యామిలీ డాక్టర్‌’ ట్రయల్‌ రన్‌ | Family Doctor Trial Run In AP On October 21 | Sakshi
Sakshi News home page

‘ఫ్యామిలీ డాక్టర్‌’ ట్రయల్‌ రన్‌

Published Fri, Oct 21 2022 8:19 AM | Last Updated on Fri, Oct 21 2022 8:45 AM

Family Doctor Trial Run In AP On October 21 - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజలు, ప్రభుత్వ వైద్యుల మధ్య బంధాన్ని బలపరచడం ద్వారా మరింత మెరుగ్గా ఆరోగ్య సంరక్షణపై వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రామీణ ప్రజలు చిన్న అనారోగ్యాలకు పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, పెద్దాస్పత్రులు, ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సొంతూరిలోనే వైద్య సేవలు పొందేలా చర్యలు చేపట్టింది.

ఈ క్రమంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతిష్టాత్మకంగా ‘ఫ్యామిలీ డాక్టర్‌’ విధానాన్ని శుక్రవారం నుంచి ట్రయల్‌ రన్‌ ప్రాతిపదికన మొదలు పెడుతోంది. ఇందుకోసం వైద్య శాఖ యలో ఎక్కడైనా చిన్నచిన్న సమస్యలుంటే సంక్రాంతి లేదా ఉగాది నాటికి సరిదిద్ది ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తారు. ఈ విధానం లక్ష్యం, ఎవరి పాత్ర ఏమిటి? అనే అంశాలపై క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్ల నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేలా పలుమార్లు శిక్షణ ఇచ్చారు. ప్రత్యేకంగా యాప్‌ కూడా సిద్ధం చేశారు. 

ఏమిటీ ఫ్యామిలీ డాక్టర్‌?
సాధారణంగా ఆర్థిక స్థితి మెరుగ్గా ఉన్న కుటుంబాలు స్వల్ప అనారోగ్య సమస్య తలెత్తినా తమకు బాగా పరిచయం ఉన్న ఒక వైద్యుడిని ఫ్యామిలీ డాక్టర్‌గా ఎంచుకుని సంప్రదిస్తాయి. లక్షణాల ఆధారంగా జబ్బును గుర్తించి చిన్న సమస్యలైతే ప్రాథమిక వైద్యం అందించి స్పెషలిస్ట్‌ వైద్యం అవసరమైతే ఆయన రిఫర్‌ చేస్తారు. ఇలా వారి ఆరోగ్యం పట్ల కుటుంబ వైద్యుడు నిరంతరం శ్రద్ధ తీసుకుంటారు. ఆ కుటుంబంలోని వ్యక్తుల ఆరోగ్యంపై ఆయనకు సమగ్ర అవగాహన ఉంటుంది. తద్వారా ఒక చక్కటి అనుబంధం ఏర్పడుతుంది. ఇదే తరహాలో గ్రామీణ  పేద ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ అందించాలనేది ఫ్యామిలీ డాక్టర్‌ విధానం లక్ష్యం. 

ఎలా నిర్వహిస్తారు..?
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ)లో ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్‌ నర్సులు, ఇతర సిబ్బంది కలిపి 14 మంది ఉండేలా చర్యలు తీసుకుంది. పీహెచ్‌సీలోని ఇద్దరు వైద్యులకు ఆ పరిధిలోని గ్రామ సచివాలయాలను విభజిస్తారు. వైద్యులు తమకు కేటాయించిన సచివాలయాలను నెలలో రెండు సార్లు సందర్శిస్తారు. 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌(ఎంఎంయూ)తో పాటు గ్రామానికి వెళ్లి రోజంతా అక్కడే ఉండి ప్రజలకు వైద్య సేవలు అందచేస్తారు. మధ్యాహ్నం వరకూ 104 ఎంఎంయూ వద్ద ఓపీలు నిర్వహిస్తారు. ఆ తరువాత నిర్దేశిత గృహాలను సందర్శిస్తారు. అంగన్‌వాడీ స్కూళ్లు, ప్రభుత్వ పాఠశాలలను  సందర్శించి విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తారు. 

67 రకాల మందులు.. 14 రకాల పరీక్షలు
రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్హత కలిగిన కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌(సీహెచ్‌వో)తో పాటు సచివాలయ ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు వీటిలో అందుబాటులో ఉంటారు. ప్రతి క్లినిక్‌లో 67 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలకు సంబంధించిన కిట్‌లు ఉంటాయి. ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో విలేజ్‌ క్లినిక్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. సీహెచ్‌వో, ఏఎన్‌ఎం, ఆశాలు వైద్యుడు గ్రామానికి వచ్చే ముందు రోజే ప్రజలకు సమాచారం అందజేస్తారు. బాలింతలు, గర్భిణులు, సాంక్రమిక, అసాంక్రమిక సమస్యలతో బాధపడే వారికి వైద్య సేవలు అందేలా చూస్తారు.  

వైద్యులకు ఫోన్లు
వైద్యుడు గ్రామానికి రాని రోజుల్లో ప్రజలకు ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురైతే వెంటనే సంప్రదించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పీహెచ్‌సీ వైద్యుడికి మొబైల్‌ ఫోన్‌ను ప్రభుత్వం సమకూర్చింది. రాష్ట్రవ్యాప్తంగా 1,142 పీహెచ్‌సీల్లో పని చేస్తున్న వైద్యులకు సుమారు రూ.3 కోట్లతో 2,300 ఫోన్లను అందజేశారు. వైద్యుడు మారినా ఫోన్‌ నంబర్‌ మారకుండా శాశ్వత నంబర్‌ కేటాయించారు. వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌/సచివాలయంలో ఆ గ్రామానికి కేటాయించిన వైద్యుడు, ఫోన్‌ నంబర్, ఇతర వివరాలను ప్రదర్శిస్తారు.

సమర్థంగా అమలుకు ట్రయల్‌ రన్‌ – ఎం.టి.కృష్ణబాబు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి
ఫ్యామిలీ డాక్టర్‌ విధానం సీఎం వైఎస్‌ జగన్‌ మానస పుత్రిక. దీన్ని సమర్థంగా అమలు చేసేందుకు తొలుత ట్రయల్‌ రన్‌ చేపట్టాలని నిర్ణయించాం. క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకుని మెరుగ్గా తీర్చిదిద్దుతాం. ఈ ఏడాది ఆఖరు వరకూ ట్రయల్‌ రన్‌ ఉంటుంది. ఎక్కడైనా సమస్యలుంటే పరిష్కరించి కొత్త సంవత్సరంలో సమర్థంగా కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు.

ఈ లోగా కొత్తగా కొనుగోలు చేస్తున్న అదనపు 104 ఎంఎంయూలు అందుబాటులోకి వస్తాయి. న్యాయపరమైన ఇబ్బందులతో ఆగిన సీహెచ్‌వోల నియామకం పూర్తవుతుంది. ట్రయల్‌ రన్‌ కోసం ప్రతి జిల్లాకు అడిషనల్‌ డీఎంహెచ్‌వో స్థాయి అధికారిని నోడల్‌ ఆఫీసర్‌గా ఎంపిక చేశాం. ఎక్కడైనా పీహెచ్‌సీ వైద్యుడు సెలవు పెడితే ఆ రోజు సేవలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. నియోజకవర్గానికి ఒకరు చొప్పున 175 మంది వైద్యులను ఆయా సీహెచ్‌సీల్లో ఉంచుతున్నాం. జిల్లాకు నలుగురు చొప్పున వైద్యులను డీఎంహెచ్‌వోల కార్యాలయాలకు కేటాయించాం. వీరి సేవలను పీహెచ్‌సీల్లో వైద్యులు సెలవులు పెట్టినప్పుడు ప్రత్యామ్నాయం కింద వినియోగించుకుంటాం. మిగిలిన రోజుల్లో సీహెచ్‌సీ, డీఎంహెచ్‌వో కార్యాలయంలో విధుల్లో ఉంటారు. 

వైద్యుల విధులు
- ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఔట్‌పేషెంట్‌ సేవలు. బీపీ, షుగర్, ఇతర జీవన శైలి జబ్బులకు రోగులకు రెగ్యులర్‌ చెకప్‌. 
- గర్భిణులు, బాలింతలకు యాంటీ నేటల్, పోస్ట్‌ నేటల్‌ హెల్త్‌ చెకప్స్‌.  
- నవజాత, శిశు సంరక్షణ. అంగన్‌వాడీలను సందర్శించి రక్తహీనతతో బాధ పడుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితి పరిశీలన.
- పిల్లల్లో ఎదుగుదల, పౌష్టికాహార లోపాలను గుర్తించేందుకు పరీక్షలు.  
- మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు హోమ్‌ విజిట్స్‌. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయిన రోగుల ఆరోగ్య పరిస్థితిపై ఫాలో అప్‌ సేవలు. 
- మంచానికి పరిమితం అయిన వృద్ధులు, వికలాంగులు, ఇతర రోగులకు ఇళ్ల వద్దే వైద్య సేవలు. క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి పాలియేటివ్‌ కేర్‌ సేవలు. పాఠశాల విద్యార్థులకు జనరల్‌ చెకప్‌. రక్త హీనత నివారణకు ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రల పంపిణీపై పర్యవేక్షణ.

సీహెచ్‌వో
టెలీ మెడిసిన్‌ ద్వారా గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్‌ మెడిసిన్, స్పెషలిస్ట్‌ సేవలు ప్రజలకు అందించడం. 30 ఏళ్లు పైబడిన వారిలో బీపీ, షుగర్, క్యాన్సర్‌ లాంటి జబ్బులను గుర్తించేందుకు స్క్రీనింగ్‌. మొత్తంగా గ్రామ స్థాయిలో 12 రకాల వైద్య సేలను ప్రజలకు అందిస్తారు. 

ఏఎన్‌ఎం
గ్రామ ఆరోగ్య మిత్రగా వ్యవహరిస్తారు. మెరుగైన వైద్యం కోసం పెద్దాస్పత్రులకు రిఫర్‌ చేసిన ఆరోగ్యశ్రీ కేసులను ఫాలోఅప్‌ చేస్తారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన రోగులకు సీఎం వైఎస్‌ జగన్‌ సందేశంతో కూడిన లేఖలను అందజేస్తారు. ఆరోగ్యశ్రీ సేవలపై ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటారు. 104 ఎంఎంయూ వద్ద వైద్య సేవలు అందించాల్సిన యాంటీనేటల్, పోస్ట్‌ నేటల్‌ కేసులను నిర్ధారిస్తారు. ఆరోగ్య కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. 
- ఆశ వర్కర్‌ ఫ్యామిలీ డాక్టర్‌ వైద్య సేవలు పొందడానికి ప్రజలను సమీకరిస్తారు. బాలింతలు, గర్భిణులు, కౌమార దశ పిల్లలకు వైద్య సేవలు అందేలా చూస్తారు. వైద్యుడు గృహాలను సందర్శించేందుకు మంచానికి పరిమితం అయిన రోగులు, వృద్ధుల వివరాలు సేకరిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement