నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): దేశంలో ఎక్కడా లేని పథకాలు ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్నాయని పలువురు వైద్యులు, వివిధ రంగాల నిపుణులు కొనియాడారు. ముఖ్యంగా వైద్య, ఆరోగ్య రంగాల్లో సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలతో ప్రతి ఒక్కరికీ ఇంటి వద్దే వైద్యం అందుతోందని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానం దేశంలో ఎక్కడా లేదన్నారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరుదైన ఆపరేషన్లు జరుగుతున్నాయని తెలిపారు.
ఇలాంటి మంచి కార్యక్రమాలు కొనసాగాలంటే సీఎం వైఎస్ జగన్‌ను మరోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్, బెటర్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరులో శుక్రవారం ‘నాడు–నేడు ఆంధ్రప్రదేశ్‌లో వైద్యం, ఆరోగ్యం’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో వివిధ రంగాల నిపుణులు మాట్లాడారు. బెటర్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించిన సమావేశంలో ఎవరేమన్నారంటే..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరుదైన ఆపరేషన్లు
రాష్ట్రంలో వైద్య సేవలను నీతి ఆయోగ్ సైతం ప్రశంసించడం అభినందించదగ్గ విషయం. వైద్య రంగంలో ఇతర రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నాయి. దేశంలోనే అత్యధిక ఆస్పత్రులతో ఏపీ అగ్రస్థానంలో ఉంది. అలాగే అత్యధిక బెడ్లు కలిగిన రాష్ట్రాల జాబితాలో రెండో స్థానంలో నిలవడం గర్వకారణం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరుదైన ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఆరోగ్య రంగంలో ఏపీకి 8 జాతీయ అవార్డులు, రెండు అంతర్జాతీయ అవార్డులు రావడం హర్షించదగ్గ విషయం. – వీవీఆర్ కృష్ణంరాజు, అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్
కొత్త వైద్య కళాశాలలతో వైద్య రంగం బలోపేతం
గతంలో ఆస్పత్రుల్లో మందులు, వైద్యులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ప్రజల ఇళ్లకే వెళ్లి వైద్యులు పరీక్షలు నిర్వహించే స్థాయికి పరిస్థితి మారింది. కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించి వైద్య రంగాన్ని ప్రభుత్వం మరింత బలోపేతం చేసింది. – మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అధ్యక్షుడు, బెటర్ ఆంధ్రప్రదేశ్
నాడు నేడు కార్యక్రమం ద్వారా ఎన్నో సంస్కరణలు
నాడు–నేడు కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్య, విద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ప్రతి ఒక్కరికీ సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహిస్తున్నారు. పేదవారికి సైతం ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ వైద్యం అందిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎవరు మంచి చేశారో వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. –బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, సాయి భాస్కర్ ఆస్పత్రుల అధినేత
Comments
Please login to add a commentAdd a comment