![AP reforms in medical field - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/6/medicale.jpg.webp?itok=VUgXMvrB)
సాక్షి, అమరావతి/మూలపాడు (ఇబ్రహీంపట్నం): రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్యసేవల కల్పన కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు భేషుగ్గా ఉన్నాయని జర్మనీకి చెందిన అంతర్జాతీయ సంస్థ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్ (జె–పాల్) ప్రతినిధి బృందం ప్రశంసించింది. ఈ బృందం గురువారం మంగళగిరిలోని వైద్యశాఖ ప్రధాన కార్యాలయంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ జె.నివాస్‌తో సమావేశమైంది. అంతకుముందు బృందం సభ్యులు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలును పరిశీలించారు.
అధికారులను అడిగి వివరాలు, ప్రజలను అడిగి వైద్యసేవలు అందుతున్న తీరు తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ విధానం, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సర్వే, ఇతర కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం కమిషనర్‌తో సమావేశమయ్యారు. వైద్య, ఆరోగ్యరంగంలో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్ని సంస్థ ప్రతినిధులకు కమిషనర్ నివాస్ వివరించారు. నాడు–నేడు కింద ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన, 17 కొత్త వైద్యకళాశాలల ఏర్పాటు సహా పలు అంశాలను తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు.
ఈ సందర్భంగా జె–పాల్ బృంద సభ్యులు ప్రొఫెసర్ నిక్కిల్ సుదర్శనన్ (మ్యూనిచ్ టెక్నికల్ యూనివర్సిటీ), ప్రొఫెసర్ హర్షా తిరుమూర్తి (పెన్సిల్వేనియా యూనివర్సిటీ) మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణకు ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు మంచి నిర్ణయమని తెలిపారు. ఆరోగ్య సురక్ష కింద హెల్త్ క్యాంప్‌లు నిర్వహించి స్పెషలిస్ట్ వైద్య సేవల కల్పన అభినందనీయమని పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ రాష్ట్ర నోడల్ అధికారి టి.రమేష్, ఎన్టీఆర్ జెడ్పీ వైస్ చైర్మన్ గరికపాటి శ్రీదేవి, మూలపాడు పీహెచ్‌సీ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment