ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా.. | Sakshi Guest Column On Family Doctor Concept | Sakshi
Sakshi News home page

ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా..

Published Thu, Apr 6 2023 7:45 AM | Last Updated on Thu, Apr 6 2023 7:54 AM

Sakshi Guest Column On Family Doctor Concept

( ఫైల్‌ ఫోటో )

కార్పొరేట్‌ల దోపిడీకి గురవుతూ.. ప్రభుత్వాసుపత్రుల్లో కనీస వైద్య సదుపాయాలకు నోచుకోలేక అల్లాడుతున్న జనాన్ని ఆదుకోవడానికి వైఎస్సార్‌ ‘ఆరోగ్యశ్రీ’ ప్రవేశపెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్య రంగాల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుండడంతో ఆయా రంగాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకపక్క కార్పొరేట్‌ వైద్యం పొందడానికి పేదవారికి అవకాశం కల్పిస్తూనే... మరోవైపు ప్రభుత్వాసు పత్రులను ఆధునికీకరించడం, కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం వంటి చర్యల ద్వారా ప్రభుత్వం వైద్య శాఖను పటిష్ఠం చేస్తోంది. విలేజ్‌ క్లినిక్, ‘ఫ్యామిలీ డాక్టర్‌’ల ద్వారా వైద్యాన్ని మరింతగా పేదవాడి ముంగిటికి తీసుకు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.

ఒక కుటుంబ ఆరోగ్యం బాగుంటే... సమాజ ఆరోగ్యమూ బాగుంటుంది. సమాజం బాగుంటే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి. ఆ ఆలోచనే ముఖ్య మంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ లక్ష్యసాధన వైపు పరుగులు పెట్టిస్తోంది. నాకు వైద్య ఆరోగ్య శాఖ అప్పగించడం ఆయన నాపై పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనంగా భావిస్తాను. ఊరూరికీ, ఇంటింటికీ వైద్య ఆరోగ్య సేవలు ఉచితంగా.. నాణ్యంగా అందాలన్న ఒక గొప్ప లక్ష్యంతో  ‘ఫ్యామిలీ డాక్టర్‌’ పథకాన్ని ముఖ్యమంత్రి ఈ రోజు (ఏప్రిల్‌ 6) పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆవిష్కరిస్తున్నారు. ఆ నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న నాకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పదవిని ఇవ్వడమే ఒక గొప్ప వరం అనుకుంటే... ఈ రోజు ఈ పథకాన్ని చిలకలూరిపేట నుంచి సీఎం ఆవిష్కరించడం మరో గొప్ప అను భూతిగా  భావిస్తున్నాను. ఫ్యామిలీ డాక్టర్‌ పథకం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి మానసపుత్రిక. ఈ పథకం గురించి వివరించే ముందు ఈ నాలుగేళ్ల పాలనలో వైద్య ఆరోగ్య రంగం సాధించిన అపూర్వ విజయాలను వివరించదలిచాను. 

వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల కొరత మాటే ఉండరాదని గట్టిగా నిర్ణయం తీసుకున్నారు సీఎం. పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేకుండానే జీవో జారీ చేయించారు. డాక్టర్లు, స్పెషలిస్టు  నర్సులు, ఇతర వైద్య సిబ్బందితో కలిపి మొత్తం 48 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రికే  దక్కుతుంది.‘పేదవాడికి కార్పొరేట్‌ ఆస్పత్రి వైద్యం’ అనే నినాదానికి ‘ఆరోగ్యశ్రీ’ పేరిట డాక్టర్‌ వైఎస్సార్‌ ఊపిరి పోస్తే... దాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్లింది ఆయన తనయుడు జగన్‌. ఈ రోజున రాష్ట్రంలో 90 శాతం ప్రజలు ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా కోట్లాది రూపాయల విలువైన వైద్య సేవలు అందుకోవడమే దీనికి సాక్ష్యం. ఆరోగ్యశ్రీ చికిత్సలకు సంబంధించిన ప్రొసీజర్స్‌నూ ముఖ్యమంత్రి గణనీయంగా పెంచారు. 

టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 1,059 ప్రొసీ జర్స్‌ ఉంటే... ఈ రోజు ముఖ్యమంత్రి వాటిని 3,255కు పెంచారు.  ఇవ్వాళ క్యాన్సర్‌ వ్యాధి చికిత్సకు రూ. 20 లక్షలు ఖర్చయినా వెనుకాడకుండా ఆరోగ్యశ్రీ ద్వారా భరించడం పేదవాడికి వరమే. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకం కింద గుండె, కిడ్నీ, కాలేయం మార్పిడి, బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్, కాక్లియర్‌ ఇంప్లాంట్‌ వంటి అత్యంత వ్యయంతో కూడిన చికిత్సలను సైతం పొందే సౌలభ్యాన్ని జగన్‌ మోహన్‌ రెడ్డి కల్పించారు.  919గా ఉన్న నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సంఖ్యను 2,262కు పెంచారు. హైదరాబాద్, ముంబయి, చెన్నైల లోనూ 202 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను పొందే వెసులుబాటును ముఖ్యమంత్రి  కల్పించారు.

పలాసలో కిడ్నీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు కిడ్నీ రీసెర్చి సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని పాదయాత్ర సమయంలో జగన్‌ మాటి చ్చారు. నేను కూడా  అధికారుల బృందంతో కలిసి ఉద్దానం ప్రాంతంలో పర్యటించాను. ఆ ప్రాంత కిడ్నీ బాధితుల సమస్యలను తెలుసు కున్నాను. వెంటనే యుద్ధ ప్రాతిపదికన అన్ని చర్యలు చేపట్టాం. ముఖ్యమంత్రి మాటంటే మాటే. పలాసలో రూ. 50 కోట్లతో 200 పడకల సామర్థ్యంతో ఆస్పత్రి నిర్మాణాన్ని సీఎం ప్రారంభించారు. ఈ ఆస్పత్రి అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఉద్దానం వాసులకు ముందు స్వచ్ఛమైన మంచి నీటిని అందించే కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టింది. ఇంతటితో సరిపెట్టకుండా తీవ్రంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారికి నెలనెలా పెన్షన్‌ సాయం అందించేలా ఆదేశించి జగన్‌ మోహన్‌ రెడ్డి మానవీయ స్పర్శను చూపించారు. 

కంటి చూపు సమస్యతో ఏ ఒక్కరూ బాధపడరాదని ముఖ్యమంత్రి ‘డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు’ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. రాష్ట్రంలో 66.17 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేయించారు. వీరిలో 4.38 లక్షల మందికి పైగా కంటిచూపు సంబంధిత సమస్యలున్నట్లు వైద్యులు గుర్తించారు. కళ్లజోడు అవసరమున్న 1.58 లక్షల మందికి మా ప్రభుత్వమే వాటిని పంపిణీ చేసింది. రాష్ట్రంలోని 24.65 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి 10.61 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేయడమే కాకుండా 4.70 లక్షల మందికి కేటరాక్ట్‌ సర్జరీలు చేయించి, వారి జీవితాల్లో వెలుగులు నింపింది.

రాష్ట్రంలో రూ. 8,480 కోట్ల వ్యయంతో  కొత్తగా 17 వైద్య కళా శాలలనూ ముఖ్యమంత్రి  తెస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 13 వైద్య కళాశాలల పటిష్ఠానికీ, ఉన్నతీకరణకూ రూ. 3.8 వేల కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోంది. కార్పొరేట్‌ వైద్యాన్ని ప్రభుత్వ పరంగానూ అందుబాటులోకి తేవాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యం. అదీ మారు మూల గిరిజన ప్రాంతాలకు మరింతగా వైద్య సేవలు అందాలన్నది  ఆయన ఆశయం. అందుకే వారికోసం రాష్ట్రంలో ఐదు మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రులను సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయ గూడెం, డోర్నాలల్లో రూ. 246.30 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తోంది. కడపలో రూ. 257 కోట్లతో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి, కేన్సర్‌ ఆస్పత్రి, మానసిక ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం నిర్మిస్తోంది.

కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే ఆరోగ్య రంగం పరంగా ఇంత ప్రగతిని సాధించడం ముఖ్యమంత్రి ఈ రంగంపై పెట్టిన దృష్టికి తార్కాణంగా భావించాలి. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉన్నతా శయానికి అనుగుణంగా వైద్య, ఆరోగ్య రంగానికి గత నాలుగేళ్లలో కేటాయించిన బడ్జెట్‌ మొత్తం 54.6 వేల కోట్ల రూపాయలకు పైనే ఉంది. గ్రామాల్లో ప్రతి రెండు వేల జనాభాకు ఒక క్లినిక్‌ పని చేయా లన్నది జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వ సమున్నత లక్ష్యంగా ఉంది. ఈ ఆశయానికి అనుగుణంగా 10,032 ‘డాక్టర్‌ వైఎస్సార్‌ విలేజ్‌హెల్త్‌ క్లినిక్స్‌’ ఏర్పాటవుతున్నాయి. బీఎస్సీ నర్సింగ్‌ క్వాలిఫై అయిన కమ్యూ నిటీ హెల్త్‌ ఆఫీసర్‌ (సీహెచ్‌ఓ)తో పాటు ఒక  ఏఎన్‌ఎంతో ఈ క్లినిక్స్‌ పనిచేస్తాయి. డాక్టర్‌ వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లో గ్రామస్థులకు 62 రకాల వైద్య సేవలు లభిస్తాయి. ఈ క్లినిక్స్‌ అన్నీ టెలిమెడిసిన్‌ సేవ లనూ అందిస్తాయి. స్పెషలిస్టు డాక్టర్ల కన్స ల్టేషన్‌ సేవలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. 

ఫ్యామిలీ డాక్టర్‌
ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌లో భాగంగా... పీహెచ్‌సీ లోని ఇద్దరు డాక్టర్లలో ఒకరు 104 వాహనంలో డాక్టర్‌ వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ను సందర్శిస్తారు. అక్కడే ఆ గ్రామ ప్రజలకు జనరల్‌ ఓపీ, గర్భవతులకు వైద్య పరీక్షలు, అవసరమైన చికిత్సలు నిర్వహిస్తారు. తల్లీబిడ్డల సంరక్షణ; అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల సందర్శన; రక్తహీనత కలిగిన రోగులను గుర్తించి చికిత్స అందించడం వంటి విధులూ నిర్వహిస్తారు. గ్రామంలో మంచం మీది నుంచి లేవలేని స్థితిలో ఎవరైనా ఉంటే వారి ఇంటికి వెళ్లి పరీక్షలు, చికిత్సలు,మందులు ఉచితంగా అందజేస్తారు. గ్రామ పారిశుద్ధ్యం విషయమై పంచాయతీ కార్యదర్శిని సమన్వయం చేసుకోవడం వంటి విధులనూ డాక్టర్లు నిర్వహిస్తారు. ఈ మొబైల్‌ యూనిట్లలో 14 రకాల వైద్య పరీక్షలు, 67 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. ట్రయల్‌ రన్‌లో 2023 ఫిబ్రవరి వరకు 54.3 లక్షల మంది వారి వారి గ్రామా ల్లోనే ఫ్యామిలీ డాక్టర్‌ సేవలను అందుకున్నారు. ఇవ్వాళ్ల ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్య రంగంలో మొత్తం దేశానికే ఆదర్శంగా నిలిచింది. అలా నిలవడానికి చేస్తున్న కృషిలో నేనూ భాగస్వామిని కావడం అదృష్టంగా భావిస్తున్నాను.

విడదల రజిని, వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
(నేడు ‘ఫ్యామిలీ డాక్టర్‌‘ పథకం ప్రారంభం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement