వైద్య ఆరోగ్యశాఖకు రూ.7 వేల కోట్లు
ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో రూ.7 వేల కోట్లు కేటాయించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రతిపాదించారు. బడ్జెట్ కసరత్తులో భాగంగా వివిధ విభాగాల అధిపతులతో మంత్రి లక్ష్మారెడ్డి, ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీ పలు విడతలుగా సమీక్ష సమావేశాలు జరిపారు. ఈ సందర్భంగా వచ్చిన ప్రతిపాదనలను అంచనా వేసి రూ.7 వేల కోట్లు ఉండాలని నిర్థారణకు వచ్చినట్లు తెలిసింది. 2015-16 బడ్జెట్‌లో (ప్రణాళిక వ్యయం రూ.2,500 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.2,400 కోట్లు) మొత్తం రూ.4,900 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. 2016-17 బడ్జెట్‌లో ప్రణాళికా వ్యయం రూ.4 వేల కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.3 వేల కోట్లుగా నిర్థారించారు.
ప్రణాళిక బడ్జెట్‌లో అత్యధికంగా వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) విభాగానికి రూ.2 వేల కోట్లు కేటాయించాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. ప్రభుత్వం కొత్త వైద్య కళాశాల, ఆరోగ్య విశ్వవిద్యాలయ భవనాల ఏర్పాటు, కొత్త పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టనున్న నేపథ్యంలో భారీగా కేటాయింపులు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే ఆరోగ్యశ్రీకి కేటాయించే నిధులను కూడా డీఎంఈ పరిధి పద్దులోనే ఉంచారు. తర్వాత అధికంగా నిమ్స్‌కు రూ.400 కోట్లు, వైద్య విధాన పరిషత్‌కు రూ.200 కోట్లు కేటాయించే అవకాశాలున్నాయి. కాగా, ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి నిధులను నేరుగా విడుదల చేయడంలేదు. డీఎంఈ కార్యాలయం ద్వారా ఆసుపత్రుల బిల్లులను పరిశీలించి ఆ తర్వాత ఆరోగ్యశ్రీకి పంపిస్తున్నారు. దీంతో నెలలుగా బిల్లుల జాప్యం జరుగుతోందన్న విమర్శలున్నాయి. దీనివల్ల ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలోకి వచ్చే పేదలు, ప్రభుత్వ ఉద్యోగులకు వైద్య సేవలు గగనంగా మారాయి. ఈసారీ అదే తరహాలో నిధులు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.