
మాట్లాడుతున్న సుప్రీంకోర్టు న్యాయవాది పూనమ్ కౌశిక్
సీతంపేట(విశాఖ ఉత్తర): మహిళా వ్యతిరేక, పితృస్వామ్య స్వభావాన్ని కలిగిన సరోగసీని అంతర్జాతీయంగా అనేక దేశాల్లో నిషేధించారని ప్రగతి శీల మహిళా సంఘటన్ ప్రధాన కార్యదర్శి, సుప్రీంకోర్టు న్యాయవాది పూనమ్ కౌశిక్ అన్నారు. సరోగసీని నిషేధించాలంటూ ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో సోమవారం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన సదస్సులో ఆమె ప్రసంగించారు. కెనడా, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో వ్యాపార రహిత సరోగసీకి మాత్రమే అనుమతి ఉందన్నారు. 2015 తర్వాత థాయ్‌లాండ్ దేశంలో నిషేధించారన్నారు. నియంత్రణ లేని సరోగసీ శిశువుల వ్యాపారంగా మారుతుందని యూఎన్‌వో పేర్కొందని గుర్తు చేశారు. 2017వ సంవత్సరంలో ఒక్క భారతదేశంలోనే సరోగసీపై రూ.3వేల కోట్ల మేర వ్యాపారం జరిగిందన్నారు. సరోగసీ పూర్తిగా అమానవీయమైనదని, శాస్త్ర సాంకేతిక విజయాలను వ్యాపార సరుకుగా మారుస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాలు సాధారణ మహిళలను ఈ వ్యాపారం నుంచి కాపాడలేకపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నగరంలో పద్మశ్రీ ఆస్పత్రిలో నాగలక్ష్మికి సంబంధించిన సరోగసీ ఉదంతమూ దీనికి పెద్ద ఉదాహరణగా నిలుస్తుందన్నారు. నాగలక్ష్మికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగించాలని కోరారు. భారతదేశంలో సరోగసీనీ పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి పద్మ మాట్లాడుతూ పేద మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అద్దె గర్భాల దందాకు వ్యతిరేకంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి మాట్లాడుతూ సరోగసీ పెద్ద మాఫియాగా మారిందన్నారు. పేద మహిళలను ప్రలోభపెట్టి సరోగసీ ఉచ్చులోకి లాగుతున్నారని, ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ పేరుతో సాగుతున్న సరోగసీ వ్యాపారం అందులో పేర్కొన్న నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపించారు. సరోగసీ బాధిత మహిళ నాగలక్ష్మి ఫిర్యాదు చేస్తే పోలీస్, సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్లు, కలెక్టర్ బాధ్యత తీసుకోలేదని విమర్శించారు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు ఇచ్చిన ఆదేశాలను సైతం పట్టించుకోలేదన్నారు. సరోగసీని రద్దు చేస్తూ ప్రభుత్వాలు చట్టం చేసే వరకు మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు పోరాడాలని కోరారు. సమావేశంలో ప్రగతి శీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఎస్.వెంకటలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.జానకి, జిల్లా ప్రధాన కార్యదర్శి రోహిణి, కార్యదర్శి యు.ఇందిర, వివిధ ప్రజా సంఘాల నాయకులు లలిత, టి.శ్రీరామమూర్తి, వై.నూకరాజు, పి.వి.రమణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment