చట్టాలు మారాలి
⇒ మారుతున్న మానవ బంధాలతో కొత్త సమస్యలు
⇒ సరోగసీపై స్పష్టమైన చట్టం అవసరం
⇒ అంతర్జాతీయ సదస్సులో సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు
సాక్షి, అమరావతి: మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలు మారకపోవడంతో తీర్పులు వెల్లడించడానికి ఇబ్బందిగా మారు తోందని సుప్రీం, హైకోర్టు జడ్జిలు అభిప్రాయ పడ్డారు. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలు, మారుతున్న మానవ సంబం ధాలతో కొత్త కొత్త సమస్యలు తలెత్తుతున్నాయని, వీటికి అనుగుణంగా మన చట్టాలు కూడా మారాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ అభిప్రాయపడ్డారు.
విజయవాడలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో రెండో రోజు వాణిజ్య లావాదేవీలు, ఆర్బిట్రేషన్, మాట్రి మోని యల్, పిల్లల హక్కులు, ఆస్తి తగాదాలు తదితర అంశాలపై మేధోమథనం జరిగింది. ఈ సందర్భంగా లోకూర్ మాట్లాడుతూ... సహజీవనం, సరోగసీ, ఎన్నారై విడాకులకు చెందిన సరైన చట్టాలు లేకపోవడం సమస్య జఠిలంగా మారుతోందని తెలిపారు. ఈ విషయాలపై కొత్త చట్టాలను తీసుకురా వడంపై చట్టసభలు దృష్టిసారించాలన్నారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ చాలా వ్యయంతో కూడుకున్నది కావడంతో దేశీయంగా ఈ అంశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. సరోగసీ విధానానికి అంతర్జాతీయంగా ఇండియా ప్రధాన కేంద్రంగా మారుతోందని, దీంతో న్యాయపరంగా అనేక వివాదాలు తలెత్తుతు న్నాయని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణి ఆందోళన వ్యక్తంచేశారు. మనదేశంలో కూడా సరోగసీ విధానానికి సంబంధించి స్పష్టమైన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
మెడ్–ఆర్బ్‌తో అవకాశాలు అనేకం
ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దాన్ని కోర్టుల వరకు రాకుండానే మీడియేటర్ (మధ్యవర్తి) ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రాధాన్యత ను ఇస్తున్నారని సుప్రీం కోర్టు మాజీ జడ్జి ఆర్.వి.రవీంద్రన్ చెప్పారు. ఇందులో ఒకరు ఓడిపోవడం మరొకరు గెలవడం ఉండదని, ఇద్దరి సమస్యను మీడియేటర్ పరిష్కరిస్తార న్నారు. ఒకవేళ ఈ సమస్యను మీడియేటర్ పరిష్కరించకపోతే అప్పుడు ఆ కేసు ఆర్బిట్రేటర్ వద్దకు చేరుతుందన్నారు. దీన్ని న్యాయ భాషలో మెడ్–ఆర్బ్‌గా వ్యవహరిస్తు న్నట్లు తెలిపారు. మెడ్–ఆర్బ్‌లో అవకాశాలు పెరుగుతుండటంతో న్యాయవాదులు దీనిపై దృష్టిసారించాలని సూచించారు. నూతన రాజధాని అమరావతి ఆర్బిట్రేషన్‌కు కేంద్రంగా ఎదుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జి ఎన్.వి.రమణతో పాటు రిటైర్జ్ జడ్జిలు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.