మనకు తెలియకుండానే..మన పిల్లల్ని అమ్మేసుకుంటున్నారు!
ఐవీఎఫ్ కేంద్రాలు, ఏజెంట్ల అక్రమాలతో విపరీత పరిణామాలు
ఐవీఎఫ్ కోసం వచ్చేవారి పిండాలను విక్రయిస్తున్న దుర్మార్గం
అండాలు, వీర్యకణాలు, సరోగసీ తల్లి.. అంతా రెడీమేడ్
ఆ పిండాలతో సరోగసీ ద్వారా పిల్లల్ని పుట్టించి అమ్ముకునే దారుణం
సరైన చట్టాలు లేక, నిబంధనల్లో లొసుగులతో వ్యవహారం
మారుతున్న జీవన పరిస్థితులు.. వ్యాధులు.. శారీరక లోపాలు.. కారణాలేవైనా కొన్ని వేల జంటలు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నాయి. అలాంటి వారికి సంతానం కల్పిస్తామంటూ వీధికో ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) కేంద్రాలు వెలుస్తున్నాయి. ఎన్నో ఆసుపత్రులూ ఐవీఎఫ్ సేవలను అందిస్తున్నాయి. కానీ ఇవి ఎన్నో అక్రమాలకు, అనైతిక వ్యవహారాలకు వేదికలుగా మారుతున్నాయి. ఐవీఎఫ్ కోసం వచ్చిన వారి నుంచి అండాలు, వీర్యకణాలు సేకరించి ఫలదీకరణం చెందించిన పిండాలను కొందరు విక్రయిస్తున్నారు. అంతేకాదు ఈ పిండాలతో సరోగసీ తల్లిద్వారా పిల్లలను పుట్టించి, వారినీ అమ్మేసుకుంటున్నారు.
నాలుగు రోజుల కింద ‘సాక్షి’ బయటపెట్టిన విశాఖ తీరాన పిల్లల విక్రయం అలాంటి వ్యవహారంలో భాగమే. అక్కడ సుజాత, వెంకట్ అనే ఇద్దరు ఏజెంట్లు ఆడపిల్లకు రెండున్నర లక్షలు, మగపిల్లాడికి నాలుగున్నర లక్షలు ఖరీదు కట్టి విక్రయిస్తూ... ఈ బాగోతాన్ని నడిపించారు. ఇంకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరెన్నో చోట్ల ఇలాంటి వ్యవహారాలు కొనసాగుతున్నాయి. అసలు ఈ ఐవీఎఫ్ ఏమిటి, అందులో లోపాలు, అక్రమాల తీరుపై ఈ వారం ‘సాక్షి’ ఫోకస్...
- భువనేశ్వరి, తెలంగాణ బ్యూరో
సంతానం కోసం తపన..
పురుషుల్లోగానీ, స్త్రీలలోగానీ లోపం ఎవరిలో ఉన్నా... పిల్లలను పొందేందుకు ఐవీఎఫ్ విధానం తోడ్పడుతోంది. స్త్రీ నుంచి అండాల్ని తీసి భాగస్వామి శుక్రకణాలతో ప్రయోగశాలలో ఫలదీకరణం చేస్తారు. అలా ఏర్పడిన పిండం (ఎంబ్రియో)ను స్త్రీ గర్భాశయంలో ప్రవేశపెడతారు. ఒకవేళ స్త్రీ గర్భాశయంలో ఏదైనా సమస్య ఉంటే సరోగసీ విధానం (మరో మహిళ గర్భాశయంలో పిండాన్ని ప్రవేశపెట్టి నెలలు నిండాక కనడం) ద్వారా బిడ్డను పొందవచ్చు. అయితే ఒకేసారి, ఒకే పిండంతో ఐవీఎఫ్ ప్రక్రియ విజయవంతం కాదు. అందువల్ల ముందు జాగ్రత్తగా స్త్రీ నుంచి ఎక్కువ సంఖ్యలో అండాలను సేకరించి, శుక్రకణాలతో ఫలదీకరణం చెందించి... రెండు, మూడు పిండాలను అభివృద్ధి చేస్తారు. వాటిని అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద జాగ్రత్తగా భద్రపరుస్తారు. మొదటి ప్రయత్నం విఫలమైతే రెండో పిండంతో ఐవీఎఫ్ ప్రక్రియ కొనసాగిస్తారు.
అవగాహన లేమి
ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కనేందుకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వీటిని తమ వద్దకు వచ్చే దంపతులకు తెలియజేయాల్సిన బాధ్యత వైద్యులదే. ఐసిఎమ్‌ఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్) నిబంధనల ప్రకారం... వైద్యానికి అవసరమైన పిండాల్ని వాడుకుని, మిగతావాటిని ఆ దంపతుల అనుమతితో క్రయోబ్యాంకుల్లో భద్రపరచవచ్చు. లేదంటే వాటిని నాశనం చేయాలి. అంతేతప్ప దానం చేయడం, విక్రయించడం వంటివి చేయకూడదు. ఒకవేళ ఐవీఎఫ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత దంపతుల్లో ఎవరైనా మరణిస్తే ఆ పిండం భవిష్యత్తు ఏమిటో కూడా దంపతులు ముందే రాతపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది.
కానీ ఈ నియమ నిబంధనలను చాలా ఐవీఎఫ్ కేంద్రాలు పాటించడం లేదు. ఇక్కడే అసలు సమస్య మొదలయింది. అండాలను, వీర్యాన్ని సేకరిస్తున్న వైద్యులు.. ఎన్ని పిండాలను రూపొందిస్తున్నారన్న సమాచారాన్ని దంపతులకు తెలియజేయడం లేదు. పెద్దగా చదువుకోనివారి విషయంలో అయితే వారికున్న సమస్య, వైద్యం ఖర్చు మినహా డాక్టర్లకు వారికి మధ్య మరెలాంటి సంభాషణా ఉండడం లేదు. దీంతో వారికి ఐవీఎఫ్ అనంతరం మిగిలిపోయిన పిండాలను వైద్యులు, ఏజెంట్లు అమ్ముకుంటున్నారు.
ఎవరికి పుట్టారో.. ఎవరి పిల్లలో..
పిండాల విక్రయం ఎంత పెద్ద నేరమో, దానికి పాల్పడ్డవారికి ఎంత పెద్ద శిక్ష వెయ్యాల్లో చెప్పలేముగానీ... దీని పర్యవసానాలు ఎంత అనైతికంగా, భయానకంగా ఉంటాయో ఊహిస్తే ఆందోళన ఆవరిస్తుంది. ఉదాహరణకు రమేష్, రాధ అనే దంపతులు ఐవీఎఫ్ ద్వారా బిడ్డల్ని పొందడానికి ఆసుపత్రికి వెళ్లారు. రాధ అండాలు, రమేష్ వీర్యంతో ఫలదీకరణ చెందించి... నాలుగైదు పిండాలను రూపొందిస్తారు. వారు మొదటి ప్రయత్నంలోనే బిడ్డను పొందారనుకుందాం. మిగతా పిండాలను దళారులు మరొకరికి విక్రయిస్తారు. వారు అద్దె గర్భం ద్వారా బిడ్డను పొందితే... ఆ బిడ్డకు రమేష్-రాధల డీఎన్‌ఏ, లక్షణాలు వస్తాయి.
ఆ బిడ్డ రమేష్ రూపురేఖలతోనో, రాధ పోలికలతోనో ఉండే అవకాశం ఎక్కువ. పిండాల విక్రయం అంటే మనకు తెలియకుండా మన బిడ్డను దొంగిలించి, అమ్ముకోవడమే. ఇక ఒక జంట నుంచి మిగిలిపోయిన రెండు పిండాల ద్వారా పిల్లలుగానీ, కవలలుగానీ పుడితే... వారిని వేర్వేరు వ్యక్తులకు విక్రయించడం, వేర్వేరుగా పెరగడం మరింత దారుణమైన అంశం. ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన ఈ వ్యవహారం గురించి తెలియగానే... పిల్లల కోసం ఐవీఎఫ్‌ను ఆశ్రయించిన వారిలో చాలా మంది ఆలోచనలో పడ్డారు.
సరైన చట్టాలే లేవు
దేశంలో ఇన్‌ఫెర్టిలిటీ కేంద్రాలకు సంబంధించి కానీ, ఆ వైద్య విధానం గురించి కానీ ప్రత్యేకంగా ఒక చట్టాన్ని రూపొందించలేదు. పదేళ్లుగా సరోగసీ, ఐవీఎఫ్ విధానంలోని లొసుగుల గురించి కేంద్రానికి కొన్ని వందల ఫిర్యాదులు అందాయి. అయినా దీనిపై ఇంకా ఎటువంటి చట్టం చేయలేదు. కేవలం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిబంధనలపైనే ఐవీఎఫ్ కేంద్రాలు నడుస్తున్నాయి. అయితే ఈ నిబంధనలనైనా ఎంతవరకు పాటిస్తున్నారనే దానిని పర్యవేక్షించే యంత్రాంగం లేకపోవడంతో.. పిండాలు, వాటి నుంచి సరోగసీ ద్వారా పుట్టించిన పిల్లల విక్రయాలు జరుగుతున్నాయి.
ఇక అండాలు, పిండాలను నిల్వ చేసే క్రయో బ్యాంకులకు సంబంధించి ప్రత్యేక చట్టం లేకపోవడం వల్ల అటు దంపతులు, ఇటు వైద్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం క్రయో బ్యాంకులకు సంబంధించి మన వైద్యులు విదేశాల్లో అమల్లో ఉన్న చట్టాల్ని అనుసరిస్తున్నారు. నిజానికి మన భారతీయ సమాజం నైతికంగా ఆ విధానాలకు పూర్తిగా విరుద్ధం. కొంతకాలం కింద ఓ విదేశీ యువతి ఇక్కడ సరోగసీ పద్ధతి ద్వారా బిడ్డను పొంది తిరుగు ప్రయాణంలో మనవాళ్లకు తలబొప్పి కట్టే సమస్యను తెచ్చిపెట్టింది.
ఆరోగ్య సమస్యలు ఉండవంటూ..
విశాఖ నర్సు సుజాత దీనికి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు చెప్పారు. ‘‘మా దగ్గర పుట్టే పిల్లలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. మానసికంగా కూడా చురుగ్గా ఉంటారు. మామూలుగా పుట్టే పిల్లలకు, మేం విక్రయించే పిండాల ద్వారా పుట్టే పిల్లలకు చాలా తేడా ఉంటుంది..’’ అని పేర్కొన్నారు. ఇందులో కొంత వరకు వాస్తవం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతులైన తల్లిదండ్రుల నుంచి పుట్టే పిల్లలు అదే విధంగా ఉంటారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిబంధనల ప్రకారం దాతలకు హెచ్‌ఐవి, హెపటైటిస్ బి, సి, హైపర్ టెన్షన్, డయాబెటిస్, లైంగిక వ్యాధులు, జన్యులోపాలు, తలసేమియా వంటి జబ్బులేమీ ఉండకూడదు.
ఇన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆ పిం డాల నుంచి ఎదిగిన పిల్లలు అ న్ని రకాలుగా ఆరోగ్యవంతులుగా ఉంటారు. దీనినే ఏ జెంట్లు సొమ్ము చేసుకుంటున్నారు. ‘‘మామూలుగా పిల్లలను యాభై వేలకు, లక్ష రూపాయలకు కొనుక్కుంటారు. కానీ మేం పూర్తి ఆరోగ్యంగా, చురు గ్గా ఉండే పిల్లలను ఇస్తున్నాం.. ఇందుకు నాలుగు లక్షలు ఖర్చుచేయడంలో తప్పులేదు కదా..’’ అంటూ విక్రయానికి ఒడిగడుతున్న వారు చెప్పుకొంటున్నారు.
భద్రత పరిస్థితి ఏమిటి?
ఐవీఎఫ్ చికిత్సకు వెళ్లిన దంపతులకు తమ అండాలు, వీర్యకణాలు, పిండాలకు సంబంధించి వైద్యులు చెప్పే సమాచారంపై సందేహాలుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలనేది తెలియదు. ఐవీఎఫ్ నిపుణులు చేస్తున్న ప్రక్రియలో ఎంతవరకు నిజాయితీ ఉందో కూడా ప్రశ్నించే పరిస్థితి లేదు. నిజానికి క్రయో బ్యాంకు (అండం, వీర్య కణాలు, పిండాన్ని భద్రపరిచే చోటు) అవసరం చాలా ఉంది. ఫలదీకరణం చెందిన తొలిదశ పిండాలను, స్త్రీ నుంచి సేకరించిన అండాన్ని భద్రపరిచే ప్రక్రియ దాదాపు ఒకేలా ఉంటుంది. వీటిని మైనస్ 190 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వచేస్తారు. అయితే ఒక్కసారిగా మైనస్ 190 డిగ్రీల చల్లదనానికి తీసుకెళితే పిండాలు చనిపోయే అవకాశం ఉంది.
కాబట్టి ముందుగా కొద్ది నిమిషాలపాటు రకరకాల చిక్కటి ద్రవాల్లో ఉంచడం ద్వారా వాటిలోని నీటి శాతాన్ని తగ్గిస్తారు. తర్వాత నిమిషానికి ఒక డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రత తగ్గించుకుంటూ మైనస్ 40 డిగ్రీల వరకూ శీతలీకరిస్తారు. దీంతో వాటిలోని జీవక్రియలన్నీ నిలిచిపోతాయి. అప్పుడు వాటిని సన్నటి నాళికల్లో ఉంచి ద్రవరూప నైట్రోజన్ ట్యాంకుల్లో ఉంచుతారు. ఈ ట్యాంకులో మైనస్ 190 డిగ్రీల చల్లదనం ఉంటుంది. అండాలను, పిండాలను తిరిగి వినియోగించాలనుకుంటే రెండు రోజుల ముందే తీసి... చల్లబరిచిన తీరుకు సరిగ్గా వ్యతిరేక పద్ధతిలో ఉష్ణోగ్రతను, నీటి శాతాన్ని పెంచుతారు. దీంతో కణం పూర్తి జవజీవాలతో పునరుత్పత్తికి సిద్ధంగా తయారవుతుంది. ఇలా నెలలు, సంవత్సరాల తరబడి క్రయో బ్యాంకుల్లో పిండాల్ని దాచుకోవచ్చు. ఒక పిండాన్ని క్రయో బ్యాంకులో భద్రపరుచుకోవాలంటే ఆరునెలలకు రూ. పదిహేను వేల నుంచి నలభై వేల వరకు ఉంటుంది.
మామూలుగా అయితే అండం ఇచ్చే స్త్రీ, వీర్య కణాలు ఇచ్చే పురుషుడు, ‘సరోగసీ’ మహిళ... వీరెవరైనా వైద్యుల సమక్షంలోనే దాతలు కాగలరు. వారి వివరాలు ఆయా ఆసుపత్రులు గోప్యంగా ఉంచాలి. కానీ కొంతకాలంగా ప్రైవేటు ఏజెంట్లు రంగంలోకి వచ్చారు. వారు అండాలు, వీర్యకణాల దాతలను, సరోగసీ తల్లుల్ని వైద్యులకు, తల్లిదండ్రులకు నేరుగా సరఫరా చేసేస్తున్నారు. ప్రత్యేక చట్టం లేకపోవడం, నిబంధనల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని రకరకాల దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. విశాఖలో వెంకట్ అనే ఏజెంటు తన దగ్గర అన్ని రకాల దాతలు ఉన్నారని బాహాటంగా మార్కెటింగ్ చేసుకుంటుండడం గమనార్హం. సాధారణంగా సరోగసీ విధానం ద్వారా తల్లి కావాలనుకుంటే... మొత్తం ప్రక్రియకు పది నుంచి పన్నెండు లక్షలు ఖర్చవుతుంది. అదే ఇలాంటి ప్రైవేటు ఏజెంట్ల ద్వారా సరోగసీ తల్లిని దంపతులే తీసుకెళితే ఎనిమిది లక్షల్లో పూర్తవుతుంది. అండం, వీర్య కణాలకు చెల్లించే సొమ్మూ తగ్గుతుంది. ఐవీఎఫ్ ప్రక్రియ కోసం ఆస్పత్రులు, కేంద్రాలు పెద్ద మొత్తంలో సొమ్ము వసూలు చేస్తుండడంతో చాలా మంది ప్రైవేటు ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు.
పరిస్థితి దయనీయంగా ఉంది..
‘‘మన దగ్గర ఐవీఎఫ్ విధానంలోని లోపాలు దంపతులను, వైద్యులను సమస్యల్లోకి నెడుతున్నాయి. దేశంలో వందల సంఖ్యలో ఐవీఎఫ్ సెంటర్లున్నాయి. ఇవన్నీ తమ క్రయో బ్యాంకు డేటాను పదేళ్లకోసారి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు అందజేయాలి. కానీ ఎన్నో సంస్థలు ఆ పని చేయడం లేదు. పిండాల్ని విక్రయించి, బిడ్డల్ని పుట్టించి అమ్ముకుంటున్నారనేందుకు అవకాశం లేదని చెప్పలేం. నిబంధనలు ఉల్లంఘించడానికి ఎన్నో అవకాశాలున్నాయి. చాలా సెంటర్లు చికిత్సకు ముందు కౌన్సెలింగ్ కూడా ఇవ్వడం లేదని కొందరు దంపతులు చెప్పారు. అలాగే ఎలాంటి ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేయించుకోవడం లేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చట్టం తేవడంతో పాటు ప్రభుత్వం ఐవీఎఫ్ సెంటర్లపై ఒక కన్నేసి ఉంచాలి.’’
- డాక్టర్ హిమదీప్తి, నోవా ఐవీఎఫ్ సెంటర్, హైదరాబాద్
దాతలను సరఫరా చేసే ఏజెంట్లు!
మామూలుగా అయితే అండం ఇచ్చే స్త్రీ, వీర్య కణాలు ఇచ్చే పురుషుడు, ‘సరోగసీ’ మహిళ... వీరెవరైనా వైద్యుల సమక్షంలోనే దాతలు కాగలరు. వారి వివరాలు ఆయా ఆసుపత్రులు గోప్యంగా ఉంచాలి. కానీ కొంతకాలంగా ప్రైవేటు ఏజెంట్లు రంగంలోకి వచ్చారు. వారు అండాలు, వీర్యకణాల దాతలను, సరోగసీ తల్లుల్ని వైద్యులకు, తల్లిదండ్రులకు నేరుగా సరఫరా చేసేస్తున్నారు. ప్రత్యేక చట్టం లేకపోవడం, నిబంధనల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని రకరకాల దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు.
విశాఖలో వెంకట్ అనే ఏజెంటు తన దగ్గర అన్ని రకాల దాతలు ఉన్నారని బాహాటంగా మార్కెటింగ్ చేసుకుంటుండడం గమనార్హం. సాధారణంగా సరోగసీ విధానం ద్వారా తల్లి కావాలనుకుంటే... మొత్తం ప్రక్రియకు పది నుంచి పన్నెండు లక్షలు ఖర్చవుతుంది. అదే ఇలాంటి ప్రైవేటు ఏజెంట్ల ద్వారా సరోగసీ తల్లిని దంపతులే తీసుకెళితే ఎనిమిది లక్షల్లో పూర్తవుతుంది. అండం, వీర్య కణాలకు చెల్లించే సొమ్మూ తగ్గుతుంది. ఐవీఎఫ్ ప్రక్రియ కోసం ఆస్పత్రులు, కేంద్రాలు పెద్ద మొత్తంలో సొమ్ము వసూలు చేస్తుండడంతో చాలా మంది ప్రైవేటు ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు.
కవలల సమస్య
ఐవీఎఫ్ చికిత్స ద్వారా బిడ్డల్ని కంటున్న వారిలో డెబ్బై శాతం మందికి కవలలు పుట్టే అవకాశం ఉంది. ఒకేసారి మూడు పిండాలు పెట్టి ఐవీఎఫ్ చేసినప్పుడు.. చాలా వరకు రెండు పిండాలు గర్భంలో జీవం పోసుకుంటాయి. దీంతో కవలలు పుడతుండడంతో తల్లిదండ్రులు, వైద్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ఫెర్టిలిటీ సెంటర్‌లో ఐవీఎఫ్ చేయించుకున్న దంపతులు ‘మేం మధ్య తరగతి వాళ్లం. ఉన్న సొమ్మంతా ఐవీఎఫ్‌కే పెట్టాం. ఇప్పుడు ఇద్దరు పిల్లలను ఎలా పోషించగలం? మాకు ఒక్కరే చాలు..’ అంటూ వైద్యులను ఇబ్బంది పెట్టారు. దీంతో వారికి నాలుగైదు సార్లు కౌన్సెలింగ్ చేసి, ఇద్దరు పిల్లల్ని అప్పగించి పంపారు. ఇక వేరొకరి పిండాల్ని విక్రయించి, సరోగసీ ద్వారా కవలలు పుట్టినప్పుడు పరిస్థితి మరీ దారుణం. ఆ బిడ్డల పరిస్థితి ఏమిటని దళారులను అడిగితే.. ‘‘ఏముంది.. ఇద్దరిని వేరు వేరు దంపతులకి అమ్మేస్తాం..’’ అని చెప్పడం మనసును కలచివేస్తుంది. ఇలా పుట్టినవారిలో శారీరక లోపాలు ఉన్నవారుంటే.. వారి పరిస్థితి ఏమిటనేదానికి సమాధానం లేదు. వారిని యాచకులకు అమ్మేస్తారనే ఆరోపణ ఉంది.
ప్రత్యేక చట్టం చేయాలి
‘‘రెండు దశాబ్దాలుగా దేశంలో లక్షల మంది ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కన్నారు, సరోగసీ ద్వారా తల్లులవుతున్నారు. ఇటు దంపతులకు కానీ, అటు వైద్యులకు కానీ చట్టపరమైన నిబంధనలు లేకపోవడం దురదృష్టకరం. ఈ ఐవీఎఫ్ కేంద్రాల్లో లొసుగులు, లోపాలను గుర్తించే యంత్రాంగం లేకపోవడం ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. ఈ విధానానికి సంబంధించి మనదేశంలో ఉన్న లొసుగులను గమనించే.. విదేశీయులు సరోగసీ తల్లి (గర్భంలో బిడ్డను మోసి, కనిచ్చే తల్లి) కావాలంటూ క్యూ కడుతున్నారు. ఇలా మన దేశంలో పుట్టి, విదేశాలకు వెళ్లిన పిల్లలు.. వారి బిడ్డగా పెరుగుతున్నారా, బానిసలుగా మారుతున్నారా అన్నది కూడా తెలియని పరిస్థితి. ఇదే పని మనం మరే ఇతర దేశంలో కూడా చేయలేం..’’
- నిశ్చిల సిద్ధారెడ్డి, ప్రభుత్వఅదనపు న్యాయవాది