
డీఎన్‌ఏతో సరోగసీ చిన్నారులకు పాస్‌పోర్ట్
హైదరాబాద్ పాస్‌పోర్టు అధికారుల నిర్ణయం
దేశంలోనే తొలిసారిగా ఎన్నారై దంపతుల సరోగసీ బిడ్డకు టెస్టుట
హైదరాబాద్: పిల్లలకు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేస్తే అందులో తల్లిదండ్రుల పేర్లు తప్పనిసరి.. తల్లిదండ్రుల చిరునామా, వారి పాస్‌పోర్టులు, గుర్తింపు ఆధారంగానే పిల్లలకు పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. మరి ఒక తండ్రి, ఇద్దరు తల్లులు ఉంటే పాస్‌పోర్టులో తల్లి పేరుగా ఎవరిది ఉండాలి? అద్దె గర్భం (భర్త వీర్యకణాలు, భార్య అండాలను ఫలదీకరించి.. మరో మహిళ గర్భంలో బిడ్డను పెరిగేలా చేసే ప్రక్రియ - సరోగసీ) ద్వారా సం తానాన్ని పొందుతున్న వారి సమస్య ఇది. ఇలా ‘సరోగసీ’ విస్తృతమవుతున్న నేపథ్యంలో... బిడ్డలకు తల్లిదండ్రులెవరో తేల్చేం దుకు డీఎన్‌ఏ పరీక్షలు చేయాలని హైదరాబాద్ పాస్‌పోర్టు అధికారులు నిర్ణయించారు. దేశంలోనే తొలిసారిగా ఓ ప్రవాస భారతీయ దంపతుల సరోగసీ బిడ్డకు డీఎన్‌ఏ పరీక్ష చేయించాలని ఆదేశించారు.
తల్లి ఎవరనే దానిపైనే వివాదం..
తల్లిదండ్రులకు పాస్‌పోర్ట్ ఉండి బిడ్డకు జనన ధ్రువీకరణ పత్రం ఇస్తే చాలు రెండుమూడు రోజుల్లోనే బిడ్డకు పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. కానీ సరోగసీ వల్ల పుట్టే బిడ్డకు తల్లి విషయంలో వివాదాలు వస్తున్నాయి. అండం ఇచ్చిన తల్లి పేరును పాస్‌పోర్ట్‌లో చేర్చాలా? నవమాసాలు మోసి కన్న తల్లిని చేర్చాలా? అన్నది తేలలేదు. సరోగసీ బిడ్డల పాస్‌పోర్ట్ విషయమై మార్గదర్శకాలు ఇవ్వాలని గతంలోనే హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి విదేశీ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. కానీ, దీనిపై ఇప్పటికీ మార్గదర్శకాలు రాలేదు. దీంతో ‘సరోగసీ’ బిడ్డలకు డీఎన్‌ఏ పరీక్షలు చేయించి, పాస్‌పోర్టు ఇవ్వాలని నిర్ణయించారు.
వాన్‌బ్యూరెన్ కేసు వివాదంతోనే..
జమైకాకు చెందిన వాన్‌బ్యూరెన్ అనే మహిళ అమెరికా జాతీయుడిని పెళ్లి చేసుకున్నారు. కొన్ని కారణాలతో వారికి పిల్లలు పుట్టే అవకాశం లేదని తేలడంతో సరోగసీని ఆశ్రయించారు. భారత్‌లోని ఓ మహిళ ద్వారా వారికి మగబిడ్డ జన్మించాడు. కానీ ఈ బిడ్డకు పాస్‌పోర్టు కోసం ఆమె పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లగా.. ధ్రువపత్రాలు పరిశీలించిన అధికారులు తిరస్కరించారు. దీంతో ఆమె పాస్‌పోర్ట్ కార్యాలయం వద్దే పిల్లాడ్ని వదిలేసి వెళ్లిపోయారు. తర్వాత సంతాన సాఫల్య కేంద్రం యాజమాన్యం బిడ్డను తీసుకెళ్లి తిరిగి వాన్‌బ్యూరెన్‌కు ఇచ్చింది. ఆ తర్వాత ఆమె ఢిల్లీకి వెళ్లి అక్కడి అధికారులతో మాట్లాడి బిడ్డతో సహా అమెరికాకు వెళ్లగలిగింది.
తాజాగా ఎన్నారై దంపతులు..
వాన్‌బ్యూరెన్ వివాదం తర్వాత ఒక ప్రవాస భారతీయ జంట తమ సరోగసీ బిడ్డకు పాస్‌పోర్ట్ కోసం హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి వచ్చారు. దీనిపై పాస్‌పోర్ట్ అధికారి అన్ని ధ్రువపత్రాలూ పరిశీలించాక.. ఆ బిడ్డకు డీఎన్‌ఏ టెస్టు చేయించాలన్నారు. ఎన్నారై దంపతులు అంగీకరించడంతో... గత డిసెంబర్‌లో దంపతుల రక్తనమూనాలను సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ)కి పంపించి పరీక్షలు చేయించారు. ఈ డీఎన్‌ఏ పరీక్ష ఫలితాల నివేదిక ఇటీవలే పాస్‌పోర్ట్ కార్యాలయానికి అందింది. దాని ఆధారంగా త్వరలోనే ఆ బిడ్డకు పాస్‌పోర్ట్ అందజేయనున్నట్టు పాస్‌పోర్ట్ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో డీఎన్‌ఏ టెస్టు ద్వారా తల్లిదండ్రులను నిర్ణయించి పాస్‌పోర్ట్ అందజేస్తున్న తొలి ఘటనగా ఇది రికార్డులకెక్కనుంది.