![Padmasree Hospital MD Pres Meet On Sarogasi Case - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/25/sarogasi.jpg.webp?itok=TRS22JEH)
మాట్లాడుతున్న ఆస్పత్రి ఎండీ సుధా పద్మశ్రీ
అక్కయ్యపాలెం(విశాఖ ఉత్తర): సరోగసి నిబంధనల ప్రకారం లీగల్ అగ్రిమెంట్ పరిశీలించిన తర్వాతే అద్దె గర్భంలో ఎంబ్రియో ప్రవేశపెట్టానని పద్మశ్రీ ఆస్పత్రి ఎండీ డాక్టర్ సుధాపద్మశ్రీ అన్నారు. అండాలు తీసుకుంటామని చెప్పి, తనకి తెలియకుండా గర్భంలో పిండాలు ప్రవేశపెట్టారంటూ దళిత మహిళ నేతల నాగలక్ష్మి ప్రగతి శీల మహిళా సంఘం ప్రతినిధులతో కలసి బుధవారం అక్కయ్యపాలెం దరి శాంతిపురంలోని పద్మశ్రీ ఆస్పత్రి వద్ద ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆస్పత్రి ఎండీ డాక్టర్ సుధా పద్మశ్రీ గురువారం శంకరమఠం రోడ్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓ మహిళ ఆరోపణలు చేయడం, దానికి మహిళా సంఘాలు మద్దతు పలకడం సరికాదన్నారు.
తమపై వచ్చిన ఆరోపణలు వాస్తవమా? కాదా? అని అడిగి తాము చెప్పిన సమాధానం సంతృప్తి లేకుంటే ఆందోళన చేస్తే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఎంసీఎంఆర్ నిబంధనల మేరకు అనుమతులతో ఈ కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేశానని తెలిపారు. నేతల నాగలక్ష్మి ఆరోపిస్తున్నట్టుగా తాను ఎలాంటి మత్తు మందు ఇచ్చి, ఆమె గర్భంలో పిల్లలను పెంచడం లేదని స్పష్టం చేశారు. బయలాజికల్ పేరెంట్స్‌తో కలసి నాగలక్ష్మి, కేర్‌టేకర్ కిలాడి ఉషా కలసి మార్చి 22న తన వద్దకు వచ్చారన్నారు. బేబీ కోసం ఫలానా మహిళతో ఒప్పందం చేసుకున్నట్టు లీగల్ అగ్రిమెంట్‌తో వచ్చారని చెప్పారు. నాగలక్ష్మి అగ్రిమెంట్‌పై సంతకం కూడా చేసిందన్నారు. దీని ఆధారంగానే సరోగసి చేసేందుకు ముందుకు వెళ్లానని స్పష్టం చేశారు.
సరోగసి మహిళకు ఇష్టం లేకుండా.. ఆమెకు చెప్పకుండా.. తొమ్మిది నెలల పాటు గర్భంలో పిల్లలను పెంచడం చాలా కష్టమన్నారు. నాగలక్ష్మి ఇష్టపూర్వకంగానే మందులు వేశామన్నారు. ఆ తర్వాత ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేశామని చెప్పారు. 14 రోజుల తర్వాత పరీక్ష చేయగా నాగలక్ష్మి గర్భంలో రెండు పిండాలు పెరుగుతున్నట్టు నిర్ధారణ అయిందన్నారు. భర్త, పిల్లలు లేరని చెప్పిన నాగలక్ష్మి ఈ నెల 21న భర్తతో కలసి ఆస్పత్రికి వచ్చి, నీరసంగా ఉందని గర్భం తీసే యాలని కోరిందన్నారు. ఒప్పందం కుదుర్చుకు న్న బయలాజికల్ పేరెంట్స్‌తో మాట్లాడుకోవా లని, వారు అంగీకరిస్తే తీసేస్తామని చెప్పామ న్నారు. ఈ విషయంలో డబ్బుల వ్యవహారంతో తమకు సంబంధం లేదన్నారు.
పద్మశ్రీ ఆస్పత్రిలో తనిఖీలు
అక్కయ్యపాలెంలోని పద్మశ్రీ ఆస్పత్రిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి రోణంకి రమేష్ గురువారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. బయలాజికల్ పేరెంట్స్‌తో నాగలక్ష్మి చేసుకున్న ఒప్పంద పత్రాలు, ఆస్పత్రికి ఉన్న అనుమతులను పరిశీలించారు. నివేదిక అనంతరం కలెక్టర్, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయని డీఎంహెచ్‌వో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment