న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో ప్రతిష్టంభన వీడలేదు. ముస్లిం మహిళల(వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లుపై చర్చను ప్రారంభించాలని ప్రభుత్వం... సెలెక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్షం పట్టుబట్టడంతో గురువారం ఎలాంటి చర్చ జరగకుండానే సభ వాయిదాపడింది. ట్రిపుల్ తలాక్‌పై ప్రతిపక్ష సభ్యుల సవరణ తీర్మానాన్ని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ చెల్లనిదిగా ప్రకటించడంతో ప్రతిపక్షం నిరసన కొనసాగించింది. బిల్లుపై అధికార, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం రానట్లయితే చర్చ సాధ్యం కాదని స్పష్టం చేస్తూ సాయంత్రం 6 గంటల సమయంలో ఆయన సభను శుక్రవారానికి వాయిదా వేశారు. కాగా నేడే శీతాకాల సమావేశాల చివరి రోజు కావడంతో.. బిల్లు ఆమోదంపై సందిగ్ధత కొనసాగుతోంది.
గురువారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభ చర్చకు చేపట్టింది. కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ, తృణమూల్ ఎంపీ సుఖేందు రాయ్‌లు బుధవారం ప్రవేశపెట్టిన సవరణ తీర్మానాలు నిబంధనలకు అనుగుణంగా లేదని.. దానిని తిరస్కరించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కోరారు. అయితే తన తీర్మానంపై చర్చించాలని ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. ఆ తీర్మానం చెల్లదని డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రకటించడంతో ప్రతిపక్ష సభ్యులు నిరసన కొనసాగించారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఏకాభిప్రాయం రాకుండా చర్చ సాధ్యం కాదని సభకు కురియన్ స్పష్టం చేశారు.
ఇంతలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రియాన్ లేచి ‘ముస్లిం మహిళలకు ప్రతిపక్షం సాధికారతను కోరుతుంటే ప్రభుత్వం మాత్రం వారిని నిరాశ్రయుల్ని చేయాలని చూస్తోంది’ అని ఆరోపించారు. వెంటనే కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ స్పందిస్తూ.. ‘ప్రతిపక్షం నిజంగానే మహిళల సాధికారతను కోరుతుంటే.. వెంటనే బిల్లుపై చర్చించాలి’ అని సూచించారు. ప్రతిపక్షాల ఆందోళన కొనసాగడంతో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చించకుండానే గురువారం రాజ్యసభ వాయిదా పడింది. అంతకుముందు ఉదయం సభ ప్రారంభం కాగానే మహారాష్ట్రలో కుల ఘర్షణల్ని రాజ్యసభ తీవ్రంగా ఖండించింది. ఘర్షణలపై నిష్పాక్షిక, త్వరితగతి విచారణ నిర్వహించి దోషుల్ని శిక్షించాలని సభ్యులు డిమాండ్ చేశారు.
జడ్జీల జీతాల పెంపు బిల్లుకు ఆమోదం
సుప్రీంకోర్టు, 24 హైకోర్టుల్లో న్యాయమూర్తుల జీతాల్ని రెండింతలకు పైగా పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ గురువారం ఆమోదించింది. మరోవైపు ద నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(సవరణ) బిల్లు, ఇన్‌సాల్వెన్సీ అండ్ బాంక్ట్రప్సీ కోడ్(సవరణ) బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుల్లో సవరణలను ఇంతకుముందే రాజ్యసభ ఆమోదించింది.
‘న్యాయవ్యవస్థ పరిధి మీరొద్దు’
శాసన సంబంధ విషయాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం పరిధులు దాటరాదని లోక్‌సభ అభిప్రాయపడింది. న్యాయవ్యవస్థ జోక్యాన్ని గనుక నిలువరించకుంటే వచ్చే పదేళ్లలో న్యాయ, శాసస వ్యవస్థల మధ్య సంక్షోభం తలెత్తుతుందని తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ కార్యకలాపాల మాదిరిగానే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో విచారణలను నేరుగా ప్రసారం చేయాలని కొందరు సూచించారు.
చర్చలతో పరిష్కరించుకోండి
రాజ్యసభ సజావుగా నడిచేందుకు సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు సూచించారు. పలు అంశాలపై రాజ్యసభలో గందరగోళం కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన వివిధ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా అది సభ ప్రతిష్టను పెంచేందుకేనని, సభ్యులు కూడా అదే విధంగా ప్రవర్తించాలని ఆయన కోరారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై విభేదాల్ని అధికార, ప్రతిపక్ష సభ్యులు పరిష్కరించుకోవాలని వెంకయ్య సూచించినట్లు సమాచారం. రాజకీయ ఎజెండా కోసం తరచూ సభకు అంతరాయం కలిగించడం, వాయిదా పడటం సరైందా? కాదా? అనే అంశంపై పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ప్రధాన పార్టీలు సభకు అంతరాయం కలిగిస్తూ.. చిన్న పార్టీలకు అవకాశం రాకుండా చేస్తున్నాయని కొందరు సమావేశంలో ఫిర్యాదు చేశారు.
తొలగని ప్రతిష్టంభన
Published Fri, Jan 5 2018 3:19 AM | Last Updated on Fri, Jan 5 2018 3:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment