సాక్షి, అమరావతి: ప్రభుత్వ సంస్థలు, ఇతర సంస్థల నుంచి బకాయిలు వసూలు కాక ఇబ్బందులు పడుతున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈలకు) అండగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఎస్‌ఎంఈల వివాదాల పరిష్కారానికి కొత్తగా నాలుగు చోట్ల ఏపీ ఎంఎస్‌ఎంఈ ఫెసిలిటేషన్ కౌన్సిల్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతవరకు విజయవాడలో రాష్ట్ర స్థాయి ఫెసిలిటేషన్ కౌన్సిల్ మాత్రమే ఉండటంతో వివాదాల పరిష్కారానికి ఇంత దూరం రావడానికి ఎంఎస్‌ఎంఈలు ఇబ్బందులు ఎదుర్కొనేవి.
ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలులో ప్రాంతీయ కౌన్సిల్స్‌ను ఏర్పాటు చేసింది. కన్సిలేషన్స్ (ఇరు పార్టీలను కూర్చొపెట్టి మాట్లాడి పరిష్కరించడం) స్థాయి వివాదాలను ప్రాంతీయ స్థాయిలో పరిష్కరించేలా, ఆర్బిట్రేషన్ స్థాయి వివాదాలను రాష్ట్రస్థాయి కౌన్సిల్‌లో పరిష్కరించేలా చట్టంలో మార్పులు తెస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందుకోసం నలుగురు సభ్యులతో కూడిన ప్రాంతీయ ఫెసిలిటేషన్ కౌన్సిళ్లని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కౌన్సిల్ ఎక్స్ అఫిషియో చైర్మన్‌గా జిల్లా స్థాయి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి, ఫెడరేషన్ ఆఫ్ ఏపీ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (ఫ్యాప్సియా) సూచించిన ప్రతినిధి, ఏపీఎస్‌ఎఫ్‌సీ జిల్లా బ్రాంచ్ మేనేజర్, ఏపీఐఐసీ సూచించిన వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. బకాయిల కోసం కోర్టులకు వెళ్లి సుదీర్ఘ సమయం వృథా చేసుకునే అవసరం లేకుండా వేగంగా పరిష్కరించే చట్టపరమైన హక్కులు ఈ కౌన్సిల్‌కు ఉంటాయి.
ప్రభుత్వ అండతో వేగంగా పరిష్కారం
వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. మరోపక్క ఏపీ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిల్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల బకాయిలు త్వరితగతిన పరిష్కారమవుతున్నాయి. బకాయిల కోసం కౌన్సిల్‌ను సంప్రదించే పరిశ్రమల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ కౌన్సిల్‌కు రూ.654 కోట్ల బకాయిలకు సంబంధించిన 534 ఫిర్యాదులు రాగా వాటిలో 149 ఫిర్యాదులను పరిష్కరించింది. తద్వారా రూ.97 కోట్ల బకాయిలకు పరిష్కారం చూపింది.
ఈ సంఖ్య పెరుగుతుండటంతో వివాదాలను మరింత వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రాంతీయ కౌన్సిల్స్ ఏర్పాటు చేసింది. వాటికి స్పష్టమైన పరిధి, విధివిధానాలను నిర్దేశించింది. దీంతో చిన్న పారిశ్రామికవేత్తల ఆర్థిక ఇబ్బందులు తీరనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై ఎంఎస్‌ఎంఈ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సుదీర్ఘకాల డిమాండ్‌ను నెరవేరుస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఫెడరేషన్ ఆఫ్ ఏపీ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (ఫాఫ్సియా) అధ్యక్షుడు మురళీకృష్ణ ప్రభుత్వానికి, పరిశ్రమల శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రాంతీయ కౌన్సిళ్ల పరిధిలోకి వచ్చే జిల్లాలివీ..
విశాఖపట్నం ప్రాంతీయ కౌన్సిల్: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాలు
విజయవాడ కౌన్సిల్: కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు
తిరుపతి కౌన్సిల్ : ప్రకాశం, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలు
కర్నూలు కౌన్సిల్: కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్‌ఆర్ కడప జిల్లాలు
Comments
Please login to add a commentAdd a comment