ఇంధన పొదుపుపై కసరత్తు | AP industries department hopes potential for massive energy savings MSMEs | Sakshi
Sakshi News home page

ఇంధన పొదుపుపై కసరత్తు

Published Tue, Oct 12 2021 3:49 AM | Last Updated on Tue, Oct 12 2021 3:51 AM

AP industries department hopes potential for massive energy savings MSMEs - Sakshi

సాక్షి, అమరావతి:  సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)ల్లో భారీ స్థాయిలో ఇంధన పొదుపునకు అవకాశం ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ భావిస్తోంది. ఇంధన సామర్థ్య చర్యలను ప్రోత్సహించడం, అత్యాధునిక ఇంధన సామర్థ్య సాంకేతికతలను ప్రవేశపెట్టడం ద్వారా పెద్దఎత్తున ఇంధనాన్ని ఆదా చేయడానికి అవకాశం ఉందని నమ్ముతోంది. ఈ దృష్ట్యా ఇంధన ఆడిట్‌ నిర్వహించేలా ఎంఎస్‌ఎంఈ యజమానులను ప్రోత్సహించాలని రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులను ఆదేశించింది. 

రూ.1,200 కోట్ల విలువైన విద్యుత్‌ ఆదా
పరిశ్రమల్లో ఇంధన వినియోగం ఏటా 17,000 మిలియన్‌ యూనిట్లు ఉండగా..ఇందులో ఎంఎస్‌ఎంఈలు 5,000 మిలియన్‌ యూనిట్లు వినియోగించుకుంటున్నాయి. కనీసం 10 శాతం పొదుపు చేస్తే 500 మిలియన్‌ యూనిట్లు ఆదా అయినట్టే.  ఎంఎస్‌ఎంఈల్లో పూర్తిస్థాయిలో ఇంధన సామర్థ్య చర్యలు చేపడితే దాదాపు 2,000 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను పొదుపు చేయవచ్చని, ఇది రూ.1,200 కోట్లకు సమానమని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. 

రాష్ట్రానికి బీఈఈ ఆడిటర్లు 
భారీ పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ ఎనర్జీ ఆడిట్‌ (ఐజీఈఏ) నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్కో) సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ సంచాలకులు, జిల్లాల్లోని జనరల్‌ మేనేజర్లను తాజాగా ఆదేశించారు. ఈ క్రమంలోనే ఎంఎస్‌ఎంఈల్లో ఇంధన ఆడిట్‌ నిర్వహించేందుకు సాంకేతిక సాయం అందించడంతో పాటు గుర్తింపు పొందిన ఇంధన ఆడిటర్లను రాష్ట్రానికి పంపేందుకు బీఈఈ (బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియెన్సీ) అంగీకరించింది.

ది ఎనర్జీ రిసోర్సెస్‌ ఇనిస్టిట్యూట్‌ (టీఈఆర్‌ఐ) సమర్పించిన ఇంధన ఆడిట్‌ నివేదిక ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఫిషరీస్‌ క్లస్టర్‌లో 43 ఎంఎస్‌ఎంఈలు 455 మిలియన్‌ యూనిట్లు వినియోగిస్తున్నాయి. వీటి విద్యుత్‌ బిల్లు రూ.296 కోట్లు వస్తోంది. పైలట్‌ ప్రాజెక్టు కింద ఏపీఎస్‌ఈసీఎం రెండు ఫిషరీస్‌ ఎంఎస్‌ఎంఈలు ఆనంద ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, కదెర్‌ ఎక్స్‌పోర్ట్స్‌ సంస్థల్లో ఇంధన ఆడిట్‌ చేసింది. రూ.1.37 కోట్ల పెట్టుబడితో 1.45 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను పొదుపు చేయవచ్చని, 1,306 టన్నుల కార్బన్‌ డయాౖఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించవచ్చని ఈ ఆడిట్‌ లో తేల్చింది. 

పరిశ్రమల శాఖ మద్దతు హర్షణీయం 
టీఈఆర్‌ఐ సంస్థ  ద్వారా రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్‌ ఇప్పటికే ఇంధన ఆడిట్‌ నిర్వహించి ఫిషరీస్‌ విభాగంలో ఇంధన పొదుపునకు భారీగా అవకాశాలు ఉన్నట్టు గుర్తించింది. ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో పరిశ్రమల శాఖ సంపూర్ణ మద్దతు ఇస్తుండటం హర్షించదగ్గ విషయం. 
– నాగులాపల్లి శ్రీకాంత్, కార్యదర్శి, ఇంధన శాఖ

బీఈఈ సంస్థలతోనే ఆడిట్‌ 
పరిశ్రమల్లో ఇంధన పొదుపు తద్వారా ఆర్థిక  పొదుపు అవకాశాలను గుర్తించేందుకు ఇంధన శాఖకు చెందిన ఏపీ సీడ్కో ఐజీఈఏ (ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ ఎనర్జీ ఆడిట్‌ ) కార్యక్రమాన్ని చేపడతాయి. ఐజీఈఏను బీఈఈకి చెందిన ఇంధన ఆడిట్‌ సంస్థలే నిర్వహించనున్నాయి. ఐజీఈఏ ఖర్చు పరిశ్రమను బట్టి ఉంటుంది. 
– కరికాల వలవన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ  

ఆడిట్‌ తో అనేక ప్రయోజనాలు 
ఆడిట్‌ తో అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇంధన ఖర్చును, ఉత్పత్తి ఖర్చును, విదేశీ ఇంధన వనరులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. పర్యావరణం దెబ్బతినకుండా, కాలుష్యం పెరగకుండా చూసుకోవచ్చు. గ్రీన్‌ హౌస్‌ వాయువుల ప్రభావాన్ని తగ్గించడంతో పాటు పోటీతత్వం, ఇంధన సరఫరాను మెరుగుపర్చుకోవచ్చు. 
–జేవీఎన్‌ సుబ్రహ్మణ్యం, కమిషనర్, పరిశ్రమల శాఖ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement