సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో మరో 25 భారీ యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. గత మూడేళ్లలో 107 భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించగా వచ్చే మూడు నెలల్లో మరో 25 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం కింద ఏర్పాటైన బ్లూస్టార్, యాంబర్ ఎంటర్‌ప్రైజెస్‌లకు చెందిన ఎయిర్ కండీషనర్స్, దేశంలోనే తొలి లిథియం బ్యాటరీ తయారీ యూనిట్ వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించనున్నాయి.
రూ.6,700 కోట్లతో అనకాపల్లి జిల్లాలో ఏర్పాటైన అన్‌రాక్ అల్యూమినియం, కర్నూలు జిల్లాలో రూ.2,938 కోట్లతో ఏర్పాటైన స్టీల్ పరిశ్రమ, అనకాపల్లి జిల్లాలోని రూ.2,000 కోట్లతో స్థాపించిన సెయింట్ గోబిన్, రూ.1,500 కోట్లతో నెలకొల్పిన శారద మెటల్స్ ఫెర్రో అల్లాయిస్ నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభించనున్నాయి. మొత్తం 25 యూనిట్ల ద్వారా రూ.16,148 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవరూపంలోకి రానున్నాయని, వీటి ద్వారా 19,475 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని అధికారులు వెల్లడించారు.
మరో 20 భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన
ఉత్పత్తిని ప్రారంభించడంతోపాటు కొత్త ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు జారీ చేయడం ద్వారా నిర్మాణ పనులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వచ్చే మూడు నెలల్లో రూ.64,555 కోట్ల విలువైన 20 భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసే విధంగా పరిశ్రమల శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా సుమారు రూ.300 కోట్లతో ఏర్పాటవుతున్న అసాగో బయోఇథనాల్ ప్రాజెక్టుకు శుక్రవారం భూమి పూజ జరగనుంది. వీటితో పాటు త్వరలోనే విశాఖలో రూ.14,634 కోట్లతో అదానీకి చెందిన వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్, ఐటీ పార్క్ పనులు ప్రారంభం కానున్నాయి.
రూ.43,143 కోట్లతో నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద ఇండోసోల్ సోలార్ కంపెనీ సౌర విద్యుత్‌కు చెందిన ఉపకరణాల తయారీ యూనిట్‌కు సంబంధించిన పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో 2.25 మిలియన్ టన్నుల జిందాల్ స్టీల్ ప్లాంట్ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 20 యూనిట్లు నిర్మాణం పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభిస్తే 44,285 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఫిబ్రవరి చివరి వారంలో జరిగే పెట్టుబడుల సదస్సు నాటికి యూనిట్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పూర్తి చేయాలని పరిశ్రమల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
పెట్టుబడుల ప్రవాహం
గత మూడేళ్లలో 107 పెద్ద యూనిట్లు ప్రారంభం కావడం ద్వారా రూ.46,002 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఇదే సమయంలో 1,06,249 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటు కావడం ద్వారా 7,22,092 మందికి ఉపాధి లభించింది. ఇవి కాకుండా మరో రూ.91,243.13 కోట్ల విలువైన 57 ప్రాజెక్టుల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవీ పూర్తయితే 1,09,307 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.
రాష్ట్రానికి దిగ్గజ సంస్థలు
రాష్ట్రంలోకి టాటా, బిర్లా, అదానీ, సంఘ్వీ లాంటి దిగ్గజ కంపెనీలతో పాటు ఇన్ఫోసిస్, రాండ్‌స్టాండ్, యాసెంచర్ లాంటి ప్రముఖ ఐటీ కంపెనీల యూనిట్లు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా ఉత్తుత్తి పెట్టుబడుల ఒప్పందాలు కాకుండా వాస్తవం రూపం దాల్చేలా యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. ముఖ్యంగా పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్ ప్రధానంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఒకేసారి నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.
– గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ శాఖ మంత్రి
ప్రభుత్వ ప్రోత్సాహంతో పరిశ్రమల సైరన్
Published Thu, Nov 3 2022 2:58 AM | Last Updated on Thu, Nov 3 2022 7:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment