సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖ వేదికగా జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సును విజయవంతం చేసేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ, ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు సంయుక్తంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ)తో కలిసి రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు ఉన్న కీలక రంగాలపై భారీ సదస్సులను నిర్వహించనున్నాయి.
రాష్ట్రంలో 974 కి.మీ. మేర తీరప్రాంతం ఉండటంతోపాటు ఒకేసారి 4 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లతో పాటు పోర్టు ఆధారిత పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. వీటి ఆధారంగా రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా నవంబర్ 18న విశాఖలో మారిటైమ్ సదస్సు నిర్వహించనున్నారు. అలాగే, వ్యవసాయం దాని అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తూ విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా రైతులకు అధిక ఆదాయం వచ్చే విధంగా ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునే విధంగా గిడ్డంగులు, శీతల గిడ్డంగుల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ వివరాలను తెలియచేసేవిధంగా డిసెంబర్ మొదటి వారంలో అగ్రి ఎక్స్‌పోను నిర్వహించనున్నారు.
డిసెంబర్‌లో ఎంఎస్‌ఎంఈ కాన్‌క్లేవ్
అలాగే రాష్ట్రంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈ రంగానికి అనేక ప్రోత్సహకాలిస్తూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఏటా రాయితీలు విడుదల చేస్తుండటంతో ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేవిధంగా ఎంఎస్‌ఎంఈ కాన్‌క్లేవ్‌ను డిసెంబర్ మూడో వారంలో నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ చట్టం చేయడమే కాకుండా ఆయా సంస్థలకు అవసరమైన మానవ వనరులను అందించే విధంగా ప్రతి శాసనసభ నియోజకవర్గ స్థాయిలో స్కిల్ హబ్స్, పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో స్కిల్ కాలేజీలు, తిరుపతి, చెన్నైలో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తుండటంతో రాష్ట్రంలోని నైపుణ్యాభివృద్ధిలోని అవకాశాలను వివరించే విధంగా స్కిల్ ఆంధ్రా పేరుతో మరో కాన్‌క్లేవ్‌ను నిర్వహించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్న మారిటైమ్, వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ, స్కిల్ డెవలప్‌మెంట్ వంటి రంగాలపై సదస్సులు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ వెల్లడించారు. వీటితో పాటు హైదరాబాద్, ముంబై, పుణే, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్‌లలో రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరిస్తూ రోడ్ షోలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment