సాక్షి, విశాఖపట్నం: వరదలొస్తే విశాఖపట్నం మునిగిపోతుందని ఇటీవల జరిగిన దావోస్ సదస్సులో ఓ సంస్థ ప్రతినిధి ప్రశ్నిస్తే ఆశ్చర్యపోయానని, ఆ సమయంలో నా కళ్లలో నీళ్లు తిరిగాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ భావోద్వేగానికి గురయ్యారు. ప్రతిపక్ష పార్టీకి మేలు చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలో ఓ వర్గం మీడియా విశాఖపై విషం చిమ్ముతోందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
తాను పుట్టిన ప్రాంతమైన ఈ నగరంపై ఇంత విషప్రచారం చేస్తున్న వారికి రెండు చేతులు జోడించి దండం పెడతాను.. దయచేసి విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బతీసేలా అవాస్తవాలు ప్రచురించొద్దని వేడుకున్నారు. విశాఖ ఇమేజ్‌ను దెబ్బతీస్తే తాను సహించలేకపోయానని.. సదరు ప్రతినిధికి ఇక్కడి వాస్తవ పరిస్థితులను వివరించడంతోపాటు ఇలాంటి దుష్ప్రచారాలను నమ్మొద్దని.. దయచేసి ఎవరికీ చెప్పొద్దని కోరానని ఆయన వెల్లడించారు. ఇక్కడి సర్క్యూట్ హాస్‌లో మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
రాజకీయాలు ఎన్ని ఉన్నా.. రాష్ట్రాభివృద్ధి విషయంలో అందరూ కలిసి రావాలి. రాజకీయ స్వార్థం కోసం ఎవరూ రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని పణంగా పెట్టకూడదు. గత పాలకుల మాదిరిగా అదిగో లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని, మేం అబద్ధాలు చెప్పం. వాస్తవాలనే ప్రజల ముందు ఉంచుతాం. అందుకే దావోస్ పర్యటన అనంతరం రాష్ట్రానికి పెట్టుబడులు తదితర అంశాలు ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచాం. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం దాదాపుగా లక్ష ఎకరాలు అందుబాటులో ఉంచాం. ఇందులో ఇప్పటికే 40–50 వేల ఎకరాల్లో ఆయా పరిశ్రమలకు సంబంధించిన పనులు జరగుతున్నాయి.
రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు
దావోస్ పర్యటనలో వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సమావేశాల్లో రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు మరిన్ని నిర్మాణాత్మక పునాదులు పడ్డాయి. కోవిడ్ తర్వాత తొలిసారిగా నిర్వహించిన ఈ సదస్సులో.. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అత్యంత శక్తివంతంగా నిలిపేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో చక్కటి ఫలితాలు సాధించాం. అత్యధిక తీర ప్రాంతం కల్గిన రాష్ట్రంగా ఉన్న ఏపీలో అభివృద్ధిని, పర్యావరణ హితాన్ని సమతుల్యం చేసుకుంటున్నట్లు చెప్పేందుకు దావోస్‌లో ఏపీ పెవిలియన్‌ను ఏర్పాటుచేశాం.
దేశంలో ఉన్న వివిధ పారిశ్రామికవేత్తలతో పాటు దాదాపు 50 బహుళజాతి కంపెనీల ప్రతినిధులు, కొత్త పారిశ్రామికవేత్తలతోనూ భేటి అయ్యాం. ఈ సందర్భంగా వారందరికీ ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకుగల వనరులు, స్థితిగతులను వివరించాం. ఇక ఈ సదస్సు ద్వారా ఏపీకి రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.
కర్బన ఉద్గారాల్లేని ఆర్థిక వ్యవస్థ దిశగా..
పారిశ్రామికీకరణకు ప్రధాన కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చాలన్న లక్ష్యంతో గ్రీన్‌ఎనర్జీకి సంబంధించిన పెట్టుబడులపై అదానీ, గ్రీన్‌కో, అరబిందోలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. స్వయంగా ప్రపంచ ప్రసిద్ధ కంపెనీ (ఆర్సిలర్ మిట్టల్ గ్రీన్ ఎనర్జీ) సీఈఓ ఆదిత్య మిట్టల్ ఏపీలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణ, ఉజ్వల భవిష్యత్తు కోసం కర్బన ఉద్గారాల రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తున్నాం.
రాష్ట్రంలో దాదాపు 33వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుదుత్పత్తికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాం. ఏపీలో దానికి అవసరమైన అన్ని వనరలున్నాయి. వాటిని వినియోగించుకోవాలని కోరాం. ఇక ఈ సదస్సులో నీతిఅయోగ్ సీఈఓ అమితాబ్ కాం™త్Œ సైతం డీకార్బనైజ్డ్ ఎకనామిలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని కితాబు ఇచ్చారు. డీకార్బనైజ్డ్ మెకానిజంలో ఏపీ ఐకాన్‌గా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అత్యాధునిక సదుపాయాలున్న కార్పొరేట్ ఆసుపత్రులు ఏపీలో లేకున్నా కోవిడ్‌ని సమర్థవంతంగా ఎదుర్కొన్న విషయాన్ని.. రాష్ట్రంలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానం అక్కడ అందర్నీ ఆకట్టుకుంది.
యూనికార్న్ హబ్‌గా విశాఖ
మరోవైపు.. విశాఖను హై అండ్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దనున్నాం. ఇందుకు టెక్ మహింద్రా సీఈఓ గుర్నాని అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ వర్సిటీతో పాటు 30 స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీలు, 175 స్కిల్ హబ్స్ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. అదేవిధంగా విశాఖను యూనికార్న్ స్టార్టప్ (సుమారు రూ.7,700 కోట్ల విలువగల) హబ్‌గా తీర్చిదిద్దేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
దేశ, ప్రపంచ స్థాయి వ్యవస్థాపకులు, సీఈఓలతో యూనికార్న్ స్టార్టప్స్‌కు వేదికగా విశాఖపట్టణాన్ని తీర్చిదిద్దడానికి అంగీకారం తెలిపాం. అంతేకాక.. ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి, రవాణ రంగానికి చేయూతనిచ్చేందుకు ఈజ్ మై ట్రిప్ కూడా అంగీకారం తెలిపింది. అలాగే, ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ సంస్థలను ఆహ్వానించాం.
Comments
Please login to add a commentAdd a comment