ఢిల్లీ: శివసేన, ఎన్సీపీ విభేదాలకు సంబంధించి దాఖలైన అనర్హత పిటిషన్‌లను పరిష్కరించడానికి మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌కు సుప్రీంకోర్టు నేడు తుది గడువును విధించింది. శివసేన విబేధాలపై డిసెంబర్ 31, 2023 నాటికి, ఎన్సీపీ అనర్హత పిటిషన్‌లపై జనవరి 31, 2024లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ వర్గాలకు వ్యతిరేకంగా దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ శివసేన సభ్యుడు సునీల్ ప్రభు (ఉద్ధవ్ ఠాక్రే), ఎన్సీపీ సభ్యుడు జయంత్ పాటిల్ (శరద్ పవార్) దాఖలు చేసిన రిట్ పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. కాగా.. శివసేన పార్టీలో చీలికకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే, ఏక్‌నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి ఫిబ్రవరి 29, 2024 వరకు సమయం కావాలని కోరిన మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ వైఖరిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విబేధాలపై ఇంతకాలం కాలయాపన చేసి మళ్లీ గడువు కోరడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
స్పీకర్ రాహుల్ నార్వేకర్ తరఫున వాదనలు వినిపించిన భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. జనవరి 31లోగా విచారణ పూర్తవుతుందని తెలిపారు. దీనిపై స్పందించిన సీజేఐ డీవై చంద్రచూడ్.. డిసెంబర్ 31లోగా తేల్చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు. 2022 జులైలో ఈ ఘటనలు చోటుచేసుకోగా.. ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉందని ఈ ఏడాది మేలోనే రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిందని గుర్తుచేశారు. అయితే.. రాబోయే దీపావళి సెలవులు, అసెంబ్లీ శీతాకాల సమావేశాలను ఉటంకిస్తూ జనవరి 31లోపు పూర్తి నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ విన్నవించారు.
వాదనల అనంతరం డిసెంబర్ 31లోపు విచారణ పూర్తి చేయాల్సిందేనని ధర్మాసనం ఉత్తర్వులను జారీ చేసింది. ఎన్సీపీ విభేదాలకు సంబంధించి మాత్రం జనవరి 31 వరకు సమయం ఇచ్చింది. కానీ ఎన్సీపీ విబేధంపై గడువు ఇవ్వడాన్ని అజిత్ పవార్ వర్గం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ నిరసించారు. ఈ ఏడాది జూలై, సెప్టెంబర్‌లలో మాత్రమే పిటిషన్లు దాఖలయ్యాయని చెప్పారు. అయితే.. ఈ ఏడాది జులైలో తొమ్మిది మంది ఎన్‌సీపీ ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను మాత్రమే ఈ దశలో పరిగణిస్తామని ధర్మాసనం తెలిపింది.
శివసనే, ఎన్సీపీ అనర్హత పిటిషన్లను త్వరితగతిన విచారించడానికి తగిన షెడ్యూల్‌ను రూపొందించడానికి మహారాష్ట్ర స్పీకర్‌కు కోర్టు చివరి అవకాశాన్ని ఇప్పటికే ఇచ్చింది. ముఖ్యమంత్రి శిందేతో సహా పలువురు శివసేన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఉద్ధవ్ వర్గం పెట్టుకున్న అర్జీలపై ఎటూ తేల్చకుండా నాన్చుతున్నారని స్పీకర్‌పై ఇంతకుముందు ఆగ్రహం వ్యక్తంచేసింది.
కాగా.. శివసేనలో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఏక్నాథ్ షిండే, ఆయన మద్దతుదారులైన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీం ఆదేశించినా స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన సునీల్ ప్రభు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అటు ఎన్సీపీలోనూ తిరుగుబాటు చేసిన అజిత్ పవార్ వర్గంపై అనర్హత ప్రకటించాలని కోరుతూ శరద్ పవార్ మద్దతుదారులు సర్వోన్నత న్యాయస్థానానికి చేరారు. దీనిపై విచారణ జరుపుతున్న సీజేఐ ధర్మాసనం నేడు తుది గడువును విధించింది.
ఇదీ చదవండి: హర్ష్ గోయెంకా కీలక వ్యాఖ్యలు: మూర్తి అలా అనలేదంటున్న గుర్నానీ
Comments
Please login to add a commentAdd a comment