నీట్‌ ప్రశ్నకు ఒకే ఆన్సర్‌.. సుప్రీంకు నిపుణుల కమిటీ రిపోర్టు | NEET Paper leak: supreme court hearings over various petitions | Sakshi
Sakshi News home page

నీట్‌ ప్రశ్నకు ఒకే ఆన్సర్‌.. సుప్రీంకు నిపుణుల కమిటీ రిపోర్టు

Published Tue, Jul 23 2024 8:50 AM | Last Updated on Tue, Jul 23 2024 11:52 AM

NEET Paper leak: supreme court hearings over various petitions

ఢిల్లీ: నీట్‌ పేపర్‌ లీకేజీ పిటిషన్లపై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై  చంద్రచూడ్, జిస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్‌ మనోజ్‌  మిశ్రాల ధర్మాసనం విచారణ జరుపుతోంది.  కోర్టు ఆదేశాల మేరకు నీట్‌ పరీక్షలో వచ్చిన ఓ ప్రశ్నపై ఐఐటీ ఢిల్లీ నిపుణుల కమిటీ ఇవాళ నివేదిక అందించింది. 

ఆ ప్రశ్నకు రెండు సమాధానాలు కాదని, ఒక్కటే ఉందని వెల్లడించింది. ఫిజిక్స్‌కు సంబంధించిన  ఓ ప్రశ్నకు రెండు సమాధాలనాలు ఇచ్చి.. మార్కులు మాత్రం ఒక్క దానికే వేశారని పిటిషనర్లు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. ఇక.. నీట్‌ యూజీ పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని దాదాపు 40 పిటిషన్లు దాఖలైన పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది.

పరీక్ష రద్దు చేయాలంటూ, రద్దు చేయొద్దంటూ దాఖలు చేసిన వారి వాదనలు సుప్రీంకోర్టులో పూర్తయ్యాయి. ఇక కేంద్రం తరఫు వాదనలు మిగిలి ఉన్నాయి. అయితే ఇవాళ కేంద్రం వాదనలు పూర్తయితే త్వరగా తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి. 

సోమవారం విచారణలో ఒక ప్రశ్నపై తీవ్రమైన చర్చ జరిగింది. ఒక ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లలో రెండు సరైన సమాధానాలు ఉన్నాయని, వీటిల్లో ఒకటి ఎంచుకున్న అభ్యర్థులకు మార్కులేసి రెండోది ఎంచుకున్న అభ్యర్థులకు మార్కులు వేయలేదని దీనిపై తేల్చాలని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. రెండింటిలో సరైన సమాధానం ఏది? అనే దానిపై స్పష్టత వస్తే అభ్యర్థుల తుది జాబితా మెరిట్‌ లిస్ట్‌లో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. ఈ అంశంపై తొలుత పిటిషన్ల తరఫు న్యాయవాది వాదించారు. ‘‘ఈ ప్రశ్నకు సమాధానం రాసేందుకు ప్రయత్నించిన అభ్యర్థుల్ని మూడురకాలుగా విడగొట్టాలి.

ఎందుకంటే రెండు ‘సరైన’ సమాధానాల్లో ఒకదానికి ఎంచుకున్న వాళ్లకు నెగిటివ్‌ మార్కింగ్‌ కారణంగా ఐదు మార్కులు పోయాయి. రెండో సమాధానం ఎంచుకున్న వాళ్లకు నాలుగు మార్కులు పడ్డాయి. రెండింటిలో ఏది కరెక్టో తేల్చుకోలేక, నెగిటివ్‌ మార్కింగ్‌ వల్ల మార్కులు పోతాయన్న భయంతో సమాధానం రాయకుండా వదిలేసిన వాళ్లూ ఉన్నారు’’అని న్యాయవాది వివరించారు. దీంతో ధర్మాసనం స్పందించింది. 

‘‘ఫిజిక్స్‌ విభాగంలో అణువుకు సంబంధించిన ప్రశ్నలో నాలుగు ఆప్షన్లలో రెండు సరైన సమాధానాలు ఉన్నాయన్న వాదనల నడుమ అసలైన సమాధానాన్ని తేల్చాల్సిన సమయమొచి్చంది. అందుకోసం ముగ్గురు విషయ నిపుణులతో కూడిన బృందాన్ని ఏర్పాటుచేయండి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలలోపు మాకు సరైన సమాధానమేంటో నివేదించండి’’ అని ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్‌ను కోర్టు ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement