తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఏ కోర్టులోనూ ప్రార్థనా స్థలాల చట్టంపై పిటిషన్లు తీసుకోకండి
పెండింగ్ కేసులపై మధ్యంతర ఉత్తర్వులొద్దు
‘ప్రార్థనాస్థలాల యథాతథ స్థితి’ కేసులపై సుప్రీంకోర్టు కీలక సూచన
న్యూఢిల్లీ: స్వాతంత్య్రం సిద్ధించిన నాటికి ఉన్న ప్రార్థనాస్థలాలను యథాతథ స్థితిలోనే కొనసాగించాలని నిర్దేశించే 1991నాటి చట్టంలోని సెక్షన్లను సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం కీలకమైన సూచనలు చేసింది. ప్రార్థనాస్థలాల్లో సర్వేలపై వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంగానీ, తీర్పులు చెప్పడంగానీ చేయొద్దని సుప్రీంకోర్టు సూచించింది.
ఈ కేసులపై తమ తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా తమ ఆదేశాలే అమల్లో ఉంటాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ సంజయ్ కుమార్‌ల ధర్మాసనం స్పష్టంచేసింది. ప్రార్థనాస్థలాలు ముఖ్యంగా మసీదులు, దర్గాల వద్ద సర్వేలు చేపట్టడాన్ని సవాల్‌చేస్తూ, సమరి్థస్తూ కొత్తగా ఎలాంటి ఫిర్యాదులు, కేసులను తీసుకోవద్దని ధర్మాసనం దేశంలోని అన్ని కోర్టులకు సూచించింది.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, మథురలోని షాహీ ఈద్గా మసీదు, సంభాల్‌లోని షాహీ జామా మసీదు, ఢిల్లీలోని కుతుబ్ మినార్ దగ్గర్లోని ఖ్వాత్– ఉల్–ఇస్లామ్ మసీదు, మధ్యప్రదేశ్‌లోని కమల్ మౌలా మసీదు సహా 10 మసీదులు ఉన్న ప్రాంతాల్లో గతంలో హిందూ ఆలయాలు ఉండేవని, ఆయా స్థలాల్లో సర్వే చేపట్టి ఆ ప్రాంతాల వాస్తవిక మత విశిష్టతను తేల్చాలంటూ 18 కేసులు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వీటిని విచారించిన సందర్భంగా గురువారం సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది.
ప్రార్థనాస్థలాల(ప్రత్యేక అధికారాల)చట్టం, 1991లోని 2, 3, 4వ సెక్షన్ల చట్టబద్ధతను సవాల్‌చేస్తూ న్యాయవాది అశ్వినీ వైష్ణవ్ తదితరులు దాఖలుచేసిన ఆరు పిటిషన్లనూ ఈ స్పెషల్ బెంచ్ గురువారమే విచారించింది. 1947 ఆగస్ట్ 15నాటికి ఉన్న ప్రార్థనాస్థలాల యథాతథస్థితిని మార్చడానికి వీల్లేదంటూ 1991 చట్టంలో పలు సెక్షన్లు పొందుపరిచారు. ఈ సెక్షన్లు అయోధ్యలోని రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదానికి వర్తించవంటూ గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు చెప్పి ఆ స్థలాన్ని హిందూవర్గానికి కేటాయించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే వారణాసి, మథుర, సంభాల్ తదితర ప్రాంతాల్లో దశాబ్దాల నాటి మసీదులు, దర్గాలున్న స్థలాల వాస్తవిక మత లక్షణాన్ని తేల్చాలని కొత్తగా పిటిషన్లు పుట్టుకొచి్చన విషయం విదితమే.
కేంద్రానికి 4 వారాల గడువు
‘‘ ఉత్తర్వులను నిలుపుదలచేస్తూ అన్ని కోర్టులను ఆదేశించడానికి ముందే సంబంధిత కేసుల్లో కక్షిదారుల వాదనలను సుప్రీంకోర్టు వినాలి’’ అని హిందువుల తరఫున హాజరైన సీనియర్ లాయర్ జే.సాయి దీపక్ కోరారు. దీనిపై సీజేఐ ‘‘ కింది కోర్టులు సుప్రీంకోర్టు కంటే పెద్దవైతే కాదుకదా. ఈ అంశంపై సుప్రీంకోర్టు విస్తృతస్థాయిలో పరిశీలిస్తున్నపుడు కింది కోర్టులకు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం సహజమే. అయినా ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం స్పందన లేకుండా ముందుకు వెళ్లలేం. నాలుగు వారాల్లోపు కేంద్రం తన స్పందనను తెలియజేయాలి.
కేంద్రం స్పందన తెలిపాక మరో నాలుగు వారాల్లోపు సంబంధిత కక్షిదారులు వారి స్పందననూ కోర్టుకు తెలియజేయాలి’’ అని సూచించారు. ఈ అంశానికి సంబంధించి 2022 సెపె్టంబర్‌లో దాఖలైన ప్రధాన పిటిషన్ విషయంలో కోర్టు కేంద్రానికి నోటీసులు పంపింది. 1991 చట్టాన్ని సవాల్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ జ్ఞానవాపి మసీదు మేనేజ్‌మెంట్ కమిటీ తదితర సంస్థలు ముస్లింల తరఫున కేసులు వేశాయి. 1991 చట్టాన్ని తప్పుబట్టి తద్వారా మసీదుల ప్రాచీన ఉనికిని ప్రశ్నార్థకం చేయాలని చూస్తున్నారని మసీదు కమిటీలు వాదిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment