దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న కరోనా వైరస్‌లోని కొత్త సబ్-వేరియంట్ జేఎన్.1 భారతదేశంలోకి ప్రవేశించింది. కేరళలో తొలి కేసు నమోదైన తర్వాత గోవా, మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
అయితే ప్రస్తుతం బూస్టర్ డోసు లేదా నాలుగో వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇండియా సార్స్- కోవ్-2 జెనోమిక్స్ కన్సార్టియం చీఫ్ ఎన్‌కే అరోరా మాట్లాడుతూ.. కొత్త సబ్-వేరియంట్‌లు వ్యాప్తి చెందుతున్నప్పటికీ కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.
డాక్టర్ అరోరా మాట్లాడుతూ.. 60 ఏళ్లు పైబడిన వారు, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రమే, ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోని పక్షంలో ముందుజాగ్రత్త చర్యగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ప్రస్తుతం సాధారణ ప్రజలకు నాలుగో డోసు అవసరం లేదని చెప్పారు.
ఓమిక్రాన్‌లోని ఈ కొత్త సబ్-వేరియంట్‌కు సంబంధించిన కేసులు తీవ్రంగా లేవని, వైరస్ సోకిన వారిని ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని అన్నారు. జేఎన్.1 సబ్‌వేరియంట్ లక్షణాలు.. జ్వరం, ముక్కు కారటం, దగ్గు, కొన్నిసార్లు విరేచనాలు, తీవ్రమైన శరీర నొప్పులు అని తెలిపారు. ఇవి సాధారణంగా ఒక వారం రోజులలో తగ్గిపోతాయన్నారు.
కాగా కోవిడ్-19 పరీక్షలను పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించిన డేటాలోని వివరాల ప్రకారం దేశంలో ఆదివారం కొత్తగా 656 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,742కి చేరుకుంది.
ఇది కూడా చదవండి: పెల్లుబికిన భక్తి ప్రవాహం.. చార్‌ధామ్ యాత్రలో భక్తుల రద్దీ!
Comments
Please login to add a commentAdd a comment