కరోనా: ఆర్‌ఎంపీల అత్యుత్సాహం.. టైపాయిడ్‌ పేరిట వైద్యం | RMP Doctors Treating Coronavirus Victims In Adilabad | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎంపీల అత్యుత్సాహం.. కాసులు దండుకుంటున్నారు

Published Sun, May 9 2021 10:29 AM | Last Updated on Sun, May 9 2021 11:01 AM

RMP Doctors Treating Coronavirus Victims - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

‘జన్నారం మండల కేంద్రంలోని ఓ వ్యక్తికి ఇటీవల జ్వరం వచ్చింది. కరోనా పరీక్ష కోసం స్థానిక పీహెచ్‌సీకి వెళ్లాడు. అక్కడ కీట్ల కొరతతో పరీక్ష చేయలేదు. జ్వరం తీవ్రత పెరగడంతో ఓ ప్రైవెట్‌ క్లినిక్‌కు వెళ్లాడు. బ్లడ్‌ టెస్ట్‌ చేసిన సదరు ఆర్‌ఎంపీ టైపాయిడ్‌ అని చెప్పి చికిత్స ప్రారంభించాడు. ఐదు రోజులకు మందులు ఇచ్చాడు. మందులు వాడినా ఫలితం లేకపోవడంతో బాధితుడు మళ్లీ  పీహెచ్‌సీకి వెళ్లి కరోనా టెస్ట్‌ చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. కోవిడ్‌ నిర్ధారణలో జాప్యం, ఆర్‌ఎంపీ తెలిసీ తెలియని వైద్యంతో బాధితుడు ఐదు రోజులు కుటుంబ సభ్యులతో ఉన్నాడు. ఫలితంగా అతడి భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులకు కూడా వైరస్‌ సోకింది. 

‘జిల్లాకు చెందిన ఓ నాయకుడితోపాటు అతడి కుటుంబ సభ్యులకు ఇటీవల కరోనా సోకింది. అందరూ హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇటీవల కోలుకోగా, సదరు నాయకుడికి షుగర్‌ వ్యాధి ఉండడంతో  స్థానికంగా ఓ ప్రైవేటు క్లినిక్‌ వైద్యుడిని సంప్రదించాడు. ఆయన మంచిర్యాలలో తనకు తెలిసిన ఆస్పత్రి ఉందని, అక్కడ చికిత్స చేయించుకోవాలని రెఫర్‌ చేశాడు. ట్రీట్‌మెంట్‌ కోసం ఆస్పత్రి యాజమాన్యంతో రూ.4 లక్షలకు ప్యాకేజీ మాట్లాడినట్లు తెలిసింది. ఈ ప్యాకేజీలో రూ.2 లక్షలు ముందే చెల్లించాడు. పది రోజుల తర్వాత భార్య నగలు అమ్మి మిగతా రూ.2 లక్షలు చెల్లించాడు. ఇందులో సదరు క్లినిక్‌ యజమానికి రూ.15 నుంచి 20 శాతం కమీషన్‌ వచ్చినట్లు తెలిసింది. 

సాక్షి,ఖానాపూర్‌: కరోనా బాధితుల కష్టాలు గ్రామీణ వైద్యులు అయిన ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు సందపగా మారాయి. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఒకవైపు విజృంభిస్తుంటే.. గ్రామీణ వైద్యులు అత్యుత్సాహంతో బాధితులకు చికిత్స చేస్తూ కాసులు దండుకుంటున్నారు. పరిస్థితి విషమించిన తర్వాత పట్టణాల్లోని కార్పొరేట్‌ ఆస్పత్రులతో కమీషన్‌ మాట్లాడుకుని రెఫర్‌ చేస్తున్నారు. మరోవైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టెస్ట్‌ కిట్ల కొరత గ్రామీణ వైద్యుల దందాకు అండగా నిలుస్తోంది. పీహెచ్‌సీలలో టెస్ట్‌ చేయకపోవడంతో కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నవారు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు క్లినిక్‌లను ఆశ్రయిస్తున్నారు. అక్కడ ఆర్‌ఎంపీలు, పీఎంపీలు రక్త పరీక్షలు నిర్వహించి టైఫాయిడ్, వైరల్, సీజనల్‌ జ్వరాల పేరిట దోపిడి చేస్తున్నారు. 

కిట్ల కొరతతో క్లినిక్‌లకు..
కరోనా మొదటి వేవ్‌ సమయంలో గ్రామాల్లో జ్వరం వచ్చిన వారికి వైద్యం చేయడానికి కూడా గ్రామీణ వైద్యులు భయపడ్డారు. వైరస్‌ ఎక్కడ తమను అంటుకుంటుందో అని నాడి పట్టేందుకు కూడా వెనుకాడారు. ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుండడం, గ్రామీణులు కూడా వైరస్‌ బారిన పడుతుండడంతో ఆర్‌ఎంపీలు, పీఎంపీలు కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటూ చికిత్సకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటిజెన్‌ కిట్లు అందుబాటులో లేక టెస్టులు తగ్గించడం వీరికి కలిసొస్తుంది. పీహెచ్‌సీలలో పరిమిత సంఖ్యలో టెస్టులు చేస్తుండడంతో మిగతావారు క్లినిక్‌లకు వెళ్లి రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రైవేటు క్లినిక్‌లలో కోవిడ్‌ టెస్టులకు అనుమతి లేకపోవడంతో రక్త పరీక్షలు నిర్వహించి టైఫాయిడ్‌ జ్వరం అంటూ ట్రీట్‌మెంట్‌ స్టార్ట్‌ చేస్తున్నారు. 

చదవండి: కరోనా కల్లోలం: ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

అడ్మిషన్లు కూడా.. 
జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులను కొంతమంది క్లినిక్‌ల నిర్వాహకులు అడ్మిట్‌ కూడా చేసుకుంటున్నారు. ఇందుకు అదనంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. టైఫాయిడ్‌కు ఐదు రోజుల కోర్సు అంటూ క్లినిక్‌లోనే ఉంచుకుని మందులు ఇస్తున్నారు. ఇందుకు బాధితుడి ఆర్థిక పరిస్థితిని బట్టి ఫీజు వసూలు చేస్తున్నారు. మందులకు అదనంగా చెల్లించాల్సిందే. ఇంతలో పరిస్థితి మెరుగు పడితే ఇంటికి.. విషమిస్తే వాళ్లకు తెలిసిన ప్రైవేటు ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తున్నారు.

పరిస్థితి విషమిస్తే... 
క్లినిక్‌లలో లేదా ఇంటి వద్ద ఉండి ఆర్‌ఎంపీ, పీఎంపీ ద్వారా చికిత్స పొందుతున్నవారిలో చాలా మంది పరిస్థితి విషమిస్తోంది. కోవిడ్‌ నిర్ధారణ చేయకుండా తమకు తెలిసీ తెలియని వైద్యం చేస్తుండడంతో వారం రోజుల్లోనే బాధితుల్లో ఇతర సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో గ్రామీణ వైద్యులు చేతులెత్తేస్తున్నారు. పరిస్థితి సీరియస్‌గా ఉందని, వెంటనే మంచిర్యాల లేదా కరీంనగర్, హైదరాబాద్‌ తీసుకెళ్లాలని బంధువులకు సూచిస్తున్నారు. తమకు తెలిసిన ఆస్పత్రికి తీసుకెళ్లే మెరుగైన వైద్యం అందుతుందని చెబుతూ కమీషన్‌ ఎక్కువ ఇచ్చే కార్పొరేట్‌ ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తున్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో బాధితులు చికిత్సకు చెల్లించే బిల్లుపై 10 నుంచి 15 శాతం కమీషన్‌ తీసుకుంటున్నారు. 

వైరస్‌ వ్యాప్తి కేంద్రాలుగా క్లినిక్‌లు..  
కరోనా వైరస్‌ వ్యాప్తి కేంద్రాలుగా మండల కేంద్రాల్లోని ప్రైవేటు క్లినిక్‌లు మారుతున్నాయి. జ్వరంతో వచ్చే వారికి టైఫాయిడ్‌ అని నిర్ధారిస్తూ వైద్యం చేస్తున్నారు. బాధితులు కూడా తమకు టైఫాయిడ్‌ అనుకుని కుటుంబ సభ్యులతో కలిసే ఉంటున్నారు. కోవిడ్‌ నిబంధనలు పాటించడం లేదు. దీంతో కోవిడ్‌ ఉన్నవారి నుంచి నాలుగైదు రోజుల్లో కుటుంబ సభ్యులకు వ్యాపిస్తోంది. అడ్మిట్‌ అయిన వారికి కూడా చికిత్స చేయడం.. ఇతర సమస్యలతో వచ్చే వారికి కూడా అక్కడే చికిత్స అందిస్తుండడంతో వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. ఇలా గ్రామాల్లోనూ వైరస్‌ వ్యాప్తి ఉధృతమవుతోంది. 

పట్టించుకోని అధికారులు..
అనుమతి లేకుండా క్లినిక్‌లు, ల్యాబ్‌లు నిర్వహిస్తూ పరీక్షలు చేస్తున్న వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కోవిడ్‌ లక్షణాలు ఉన్నవారికి గ్రామీణ వైద్యులు చికిత్స చేయొద్దని ప్రభుత్వం చెబుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. పర్యవేక్షించాల్సిన జిల్లా అధికారులు గ్రామాలవైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో సెకండ్‌ వేవ్‌ పల్లెలనూ తాకింది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారుల స్పందించి ప్రైవేటు క్లినిక్‌లు, ఆర్‌ఎంపీలు, పీఎంపీలు కోవిడ్‌ లక్షణాలు ఉన్నవారికి చికిత్స చేయకుండా కట్టడి చేయాలని టైఫాయిడ్‌ పేరుతో చేస్తున్న దోపిడీని అరికట్టాలని కోరుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement